స్త్రీనిది ద్వారా మహిళలకు మూడు లక్షల రూపాయల వరకు రుణాలు.. ఇక దూసుకుపొండి!
తెలంగాణ రాష్ట్రంలో మహిళా సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్న విషయం తెలిసిందే. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని సంకల్పించిన తెలంగాణ ప్రభుత్వం, ఈ క్రమంలో మహిళలను అన్ని రంగాలలోనూ ప్రోత్సహిస్తుంది. ఇప్పటికే ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా స్వయం సహాయక సంఘాలలోని మహిళలకు క్యాంటీన్లు, సూపర్ మార్కెట్లు, డ్రోన్లు, పెట్రోల్ బంకులు, ఆర్టీసీ బస్సుల నిర్వహణ అప్పగించిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరో కీలకనిర్ణయం తీసుకుంది.
స్త్రీనిధి ద్వారా ఈ ఆటోలు, ఈ ద్విచక్ర వాహనాలు
స్త్రీనిధి ద్వారా మహిళా సంఘాల సభ్యులకు ఈ ఆటోలు, ఈ ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేసుకునేందుకు, తద్వారా జీవనోపాధి సృష్టించుకునేందుకు అవకాశం కల్పించాలని నిర్ణయించింది. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఎలక్ట్రిక్ ఆటోలు మరియు ద్విచక్ర వాహనాలు, ట్రాలీలు కొనుగోలు చేసుకోవడానికి తద్వారా ఉపాధి పొందడానికి ఒక్కొక్క సంఘానికి లేదా సభ్యురాలికి మూడు లక్షల రూపాయల వరకు రుణాలు ఇవ్వడానికి నిర్ణయించింది.

60 నెలల సులభ వాయిదాలలో తిరిగి చెల్లించేలా ఋణం
మొత్తం 60 నెలల సులభ వాయిదాలలో తిరిగి చెల్లించే విధంగా ఈ రుణాన్ని అందిస్తారు. 11 శాతం వార్షిక వడ్డీకి రుణాలను అందజేస్తారు. ప్రతిరోజు రెండు గంటల ఛార్జింగ్ తో సుమారు 100 కిలోమీటర్ల దూరం ప్రయాణించేలా ఈ ఆటోలను అందించనున్నారు. ఈ ఎలక్ట్రిక్ ఆటోలో ఐదుగురు ప్రయాణించే వీలుంటుంది.
48 వాయిదాలలో చెల్లించేలా ఈ బైక్ లకు 75 వేల ఋణం
ఇక ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం కొనుగోలుకు గరిష్టంగా 75 వేల రూపాయల వరకు రుణాలు అందిస్తారు. మొత్తం 48 వాయిదాలలో దీనిని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. మహిళా సంఘాల సభ్యులకు గ్రామీణ అభివృద్ధి సంస్థ ద్వారా ఈ రుణ సదుపాయాన్ని అందజేస్తారు. ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలను కల్పించడంతోపాటు మహిళలకు ఉపాధిని కూడా కల్పించే ఉద్దేశంతో ఈ ఆటోలను, ఈ బైక్ లను మహిళలకు స్త్రీనిధి రుణాల ద్వారా ఇవ్వనున్నారు.
డ్వాక్రా మహిళలు అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరిన తెలంగాణ సర్కార్
వీటి ద్వారా మహిళలు ఉపాధి పొందేలా, ఇదే సమయంలో కాలుష్యం కూడా తగ్గించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ అవకాశాన్ని డ్వాక్రా మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కూడా తెలంగాణ సర్కార్ కోరుతోంది. మహిళలకు అండగా, వారి ఆర్ధిక స్వావలంబన కలిగించే విషయంలో తగ్గేదే లేదని స్పష్టం చేస్తోంది.













Click it and Unblock the Notifications