శబరిమల ఆలయానికి వెళ్లే ప్రతి భక్తుడికీ రూ. 2 లక్షల డెత్ ఇన్సూరెన్స్ కవరేజ్
శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి వచ్చే లక్షలాది మంది భక్తుల కోసం ట్రావెన్ కూర్ దేవస్వం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. శబరిమల మండలం- మకరవిళక్కు యాత్రా కాలంలో అయ్యప్ప స్వామి దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడికి రూ. 2 లక్షల ఉచిత బీమా సౌకర్యాన్ని కల్పించింది. ఈ బీమా పథకానికి అయ్యే ప్రీమియం మొత్తాన్ని కూడా దేవస్వం బోర్డే చెల్లిస్తుంది. ఎల్ఐసీ భాగస్వామ్యంతో ఈ ప్రత్యేక పథకాన్ని అందుబాటులోకి తీసుకుని రానుంది.
వర్చువల్ క్యూ విధానం ద్వారా ముందస్తు నమోదు చేసుకున్న వారితో పాటు, స్పాట్ బుకింగ్ చేసుకుని సన్నిధానానికి వచ్చే భక్తులందరికీ ఈ బీమా వర్తిస్తుంది. భక్తులు శబరిమల కొండ ఎక్కడానికి ఒక రోజు ముందు నుంచి, దర్శనం పూర్తయి తిరిగి ఇళ్లకు ప్రయాణమైన తర్వాత కూడా మూడు రోజుల వరకు ఈ బీమా అమలులో ఉంటుంది. దీనికి సంబంధించిన విధివిధానాలు, మార్గదర్శకాలను దేవస్వం బోర్డు ఖరారు చేసింది.

ఇదివరకు అందుబాటులో ఉన్న బీమా సౌకర్యాలు ప్రమాదాలకు మాత్రమే పరిమితమై ఉండేవి. ఈసారి ప్రవేశపెడుతున్న నూతన విధానంలో భక్తుడి మరణానికి గల కారణాలతో సంబంధం లేకుండా పరిహారం అందుతుంది. నిర్దేశిత సమయ పరిమితి లోపు ఆ భక్తుడు శబరిమల నుంచి స్వస్థలానికి చేరుకున్న తర్వాత మరణించినా కూడా ఈ బీమాను క్లెయిమ్ చేసుకునే వెసులుబాటును కల్పించినట్లు టీడీబీ ఛైర్మన్ కే జయకుమార్ తెలిపారు.
ఒకవేళ కొందరు భక్తులు వర్చువల్ క్యూ లేదా స్పాట్ బుకింగ్ నమోదు చేసుకోకుండా శబరిమలకు వచ్చినప్పటికీ.. వారు అయ్యప్పస్వామి దర్శనానికి వచ్చినట్లు దేవస్వం బోర్డు ధృవీకరిస్తే.. ఎల్ఐసీ ఆ క్లెయిమ్‌ను పరిశీలిస్తుందని జయకుమార్ స్పష్టం చేశారు. ఈ పథకానికి సంబంధించి ఎల్ఐసీతో త్వరలోనే కాంట్రాక్ట్ కుదుర్చుకోబోతోన్నామని అన్నారు. యాత్రికుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.
శబరిమల యాత్రికుల సౌకర్యార్థం దేవస్వం బోర్డు మరొకకార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రసిద్ధ శబరిమల అరవణ ప్రసాదాన్ని భక్తుల ఇళ్లకు నేరుగా చేరవేయడానికి పోస్టాఫీస్ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. సన్నిధానంలోని పోస్టల్ కౌంటర్ వద్ద ప్రసాదం మొత్తాన్ని చెల్లించి, తమ చిరునామా నమోదు చేస్తే పోస్టాఫీస్ సిబ్బంది ప్రసాదాన్ని ఇళ్లకు డెలివరీ చేస్తారు. ఈ సేవ కోసం నామమాత్రంగా ఛార్జీ వసూలు చేస్తారు.













Click it and Unblock the Notifications
