మరో పెను రైలు ప్రమాదం- పట్టాలపై రాళ్లు?
Sabarmati Express: మరో రైలు ప్రమాదం సంభవించింది. ఇటీవలి కాలంలో ఓ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి గురి కావడం ఇది మూడోసారి. ఇదివరకు విశాఖపట్నం- అమృత్‌సర్ హిరాకుడ్, హౌరా- ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రమాదానికి గురయ్యాయి.
ఇప్పుడు తాజాగా ఈ జాబితాలో సబర్మతి ఎక్స్‌ప్రెస్ వచ్చి చేరింది. వారణాశి జంక్షన్- అహ్మదాబాద్ మధ్య రాకపోకలు సాగించే రైలు ఇది. అర్ధరాత్రి దాటిన తరువాత ఉత్తరప్రదేశ్ కాన్పూర్ సమీపంలో పట్టాలు తప్పింది. ఏకంగా 22 బోగీలు చెల్లాచెదురు అయ్యాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణాపాయం సంభవించలేదు గానీ కొందరు ప్రయాణికులు గాయపడ్డారు.

శుక్రవారం రాత్రి వారణాశి జంక్షన్ నుంచి అహ్మదాబాద్‌కు బయలుదేరిన నంబర్ 19168 సబర్మతి ఎక్స్‌ప్రెస్ మార్గమధ్యలో ప్రమాదానికి గురైంది. ఈ తెల్లవారు జామున 2:30 గంటల సమయంలో కాన్పూర్- భీమ్‌సేన్ సెక్షన్ పరిధిలోని గోవింద్‌పురి స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది. మొత్తం 22 బోగీలు నేలపై దిగాయి.
సమాచారం అందుకున్న వెంటనే రైల్వే అధికారులు, పోలీసులు, రాష్ట్ర విపత్తు నిర్వహణ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను చేపట్టారు. ఈ ఘటనలో ప్రాణాపాయం తప్పింది. కొందరు ప్రయాణికులకు స్వల్పంగా గాయపడ్డారు. వారికి ప్రాథమిక చికిత్స అందజేశారు.
సబర్మతి ఎక్స్‌ప్రెస్‌కు చెందిన మొత్తం 22 బోగీలు పట్టాలు తప్పినట్లు కాన్పూర్ డివిజినల్ రైల్వే మేనేజర్ రాకేష్ కుమార్ సింహ్ తెలిపారు. కొందరు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారని, వారికి అక్కడికక్కడే చికిత్స అందించామని వివరించారు. తీవ్రంగా గాయపడ్డ ప్రయాణికులు ఎవరూ లేరని పేర్కొన్నారు. ప్రయాణికులను ప్రత్యేక బస్సుల ద్వారా ప్రయాణికులను కాన్పూర్‌కు తరలించినట్లు చెప్పారు.
ఈ సంఘటనను దృష్టిలో పెట్టుకుని ప్రయాణికుల కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల కోసం ప్రయాగ్‌రాజ్, కాన్పూర్ సెంట్రల్, మిర్జాపూర్, ఫతేపూర్, నైనీ, చునార్, ఇటావా, హత్రాస్/అసర్మ, ఫఫుండ్ రైల్వే స్టేషన్లల్లో ప్రత్యేకంగా హెల్ప్‌లైన్లను ఏర్పాటు చేశారు.
కాగా- సబర్మతి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడానికి ప్రధాన కారణం.. పట్టాలపై గులకరాళ్లు పేర్చి ఉండటమేనని నార్త్ సెంట్రల్ రైల్వే అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇది ఉద్దేశపూరకంగా ఎవరైనా పట్టాలపై గులకరాళ్లను పేర్చి ఉండొచ్చని అనుమానిస్తోన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశాలను జారీ చేశారు.












Click it and Unblock the Notifications