థ్యాంక్స్, మరాఠీలో మాట్లాడాలని ఉంది: సచిన్
ముంబై: తనపై ఇప్పటివరకు ప్రేమ, గౌరవాభిమానాలు చూపిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. సచిన్ టెండూల్కర్‌ను మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అరుదైన గౌరవంతో సత్కరించింది. మహారాష్ట్రలోని కండీవిలి క్రికెట్ మైదానానికి సచిన్ టెండూల్కర్ జింఖానా (క్లబ్)గ్రౌండ్‌గా పేరు మారుస్తున్నట్లు మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ సోమవారం ప్రకటించింది.
నవంబర్ 14న వాంఖేడే స్టేడియంలో వెస్టిండీస్‌తో జరిగే చివరిదైన 200వ టెస్టు ఆడనున్న నేపథ్యంలో సచిన్ టెండూల్కర్‌ను గౌరవించాలని యోచనతో ఎంసిఎ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా సచిన్ టెండూల్కర్ మాట్లాడారు. ఎంసిఎ, క్లబ్‌లతో తన అనుభవం సుదీర్ఘమైనదని ఆయన అన్నారు. తనకు ఎప్పుడు అవసరమైనా నెట్స్‌ను అందుబాటులో ఉంచేదని, అందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు.

తన పేరును ప్రవేశ ద్వారం ముందు ఉంచడం ప్రత్యేకతగా ఉందని ఆయన అన్నారు. సచిన్ మాట్లాడుతూండగా అతని సహచరులు సచిన్.. సచిన్ అని నినాదాలు చేశారు. నాకు మరాఠీలో మాట్లాడాలని ఉందని, అయితే ఇక్కడ వెస్డిండీస్ జట్టు ఆటగాళ్లు ఉన్నందన తన ప్రసంగాన్ని ఇంగ్లీష్‌లోనే కొనసాగిస్తానని చెప్పారు. సచిన్ టెండూల్కర్ ప్రసంగించిన అనంతరం ఎంసిఎ అధ్యక్షుడు శరద్ పవార్, ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌లు ఘనంగా సత్కరించారు. తన చిత్రంతో కూడిన పెయింటింగ్‌ను సచిన్‌కు అందించారు.
కాగా సచిన్ రమేష్ టెండూల్కర్ స్టేజిపైకి రావాలని మాజీ ఆటగాడు రవిశాస్త్రి కోరగానే ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. సచిన్ .. సచిన్ అంటూ నినాదాలు చేశారు. సచిన్ ఓ గొప్ప వ్యక్తి, గొప్ప క్రికెటర్ అని, సచిన్ ఎన్నో ఏళ్లకు సరిపడా క్రీడాస్ఫూర్తిని ఇతర ఆటగాళ్లకు అందించాడని ముఖ్యమంత్రి చవాన్ కొనియాడారు. ఈ సందర్భంగా సచిన్ టెండూల్కర్ పై రూపొందించిన ఓ డాక్యుమెంటరీని ప్రదర్శించారు. ఈ డాక్యుమెంటరీ భారత్‌కు ఇన్నేళ్లపాటు సేవలందించినందుకు థాంక్యూ సచిన్ అంటూ ముగిసింది. ఎంసిఎ నిర్వహించిన ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖలు, భారత, వెస్టిండీస్ ఆటగాళ్లు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications