93 ఏళ్ల ఇండియన్ మిలిటరీ అకాడమీ చరిత్రలో తొలి లేడీ ఆఫీసర్.. ఎవరంటే ?
భారత సైనిక చరిత్రలో చారిత్రాత్మిక ఘటన చోటు చేసుకుంది. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ మిలిటరీ అకాడమీ (ఐఎంఏ) నుంచి ఓ మహిళా అధికారిణి శిక్షణను పూర్తి చేసుకుని భారతసైన్యంలోకి అడుగు పెట్టారు. 93 ఐఎంఏ సంవత్సరాల చరిత్రలో మొట్ట మొదటిసారిగా మహిళా ఆఫీసర్ క్యాడెట్‌గా ఈ ఘనత సాధించడం పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
ఆమె ఎవరంటే..?
ఈ విశేష ఘనతను సాధించిన వ్యక్తి మహారాష్ట్రకు చెందిన సాయి ఎస్.జాధవ్. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఆరు నెలల కఠిన సైనిక శిక్షణను పూర్తి చేసుకుని భారత సైన్యంలో చేరారు. అంతే కాకుండా కొల్హాపూర్‌కు చెందిన ఆమె కుటుంబ సభ్యులు కూడా భారత ఆర్మీలో పని చేసిన వారు కావడం గమనార్హం. సాయి తాతయ్య భారత సైన్యంలో పని చేయగా.. ప్రస్తుతం ఆమె తండ్రి సందీప్ జాధవ్ కూడా ఆర్మీలో అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె ముత్తాత బ్రిటిష్ సైన్యంలో సేవలందించినట్టు సమాచారం. ఇప్పుడు వారి బాటలోనే సాయి కూడా ఐఎంఏలో చేరి సైనిక అధికారిణిగా మారడం పట్ల పొగడ్తలు కురిపిస్తున్నారు.

అయితే ఇంతకుముందు ఐఎంఏలో శిక్షణ పొందిన వారందరూ పురుషులే కావడంతో వారిని 'జెంటిల్‌మన్ క్యాడెట్స్' అని పిలిచేవారు. ఇప్పుడు సాయి ఈ ఘనత సాధించడంతో ఆమెను జెంటిల్‌మన్ క్యాడెట్స్ అని కాకుండా ఆఫీసర్ క్యాడెట్స్ అని పిలవనున్నారు. ఇకపై ఇలానే కొనసాగించనున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ క్రమంలోనే ఐఎంఏలో నిర్వహించిన పిప్పింగ్ వేడుక సందర్భంగా సైనిక ఉన్నతాధికారులు సాయి జాధవ్ యూనిఫామ్‌పై నక్షత్రాల బ్యాడ్జిని పిన్ చేశారు. ఆమెకు ఆర్మీ అధికారిణిగా ర్యాంకింగ్‌ను కేటాయించారు.
కుమార్తె సాధించిన అరుదైన ఘనత పట్ల ఆమె తల్లిదండ్రులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇండియన్ మిలిటరీ అకాడమీ నుంచి పాసై టెరిటోరియల్ ఆర్మీలో ఆఫీసర్‌గా చేరిన తొలి మహిళ తమ కూతురు కావడం మరింత గర్వంగా ఉందని పేర్కొన్నారు. మరోవైపు 2026 జూన్‌లో డెహ్రాడూన్ లోని ఐఎంఏలో జరగనున్న పాసింగ్ ఔట్ పరేడ్ ను పూర్తిగా మహిళలతో కూడిన ఐఎంఏ తొలి ప్రత్యేక బ్యాచ్ నిర్వహించనుంది. ఇండియన్ మిలిటరీ అకాడమీని 1932 డిసెంబరు 10న ప్రారంభించారు. ఇప్పటివరకు దాదాపు 67,000 మంది ఆఫీసర్ క్యాడెట్‌లకు ఐఎంఏలో శిక్షణ ఇచ్చారు.












Click it and Unblock the Notifications