వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సమ్మెద్ శిఖర్: జైనులకు ఈ ప్రాంతం ఎందుకు అంత పవిత్రం... ఇతర మతస్తులు రాకూడదని వారు కోరుకుంటున్నారా

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
సమ్మెద్ శిఖర్

జార్ఖండ్‌ పారస్‌నాథ్ ప్రాంతంలో జైనుల ప్రార్థనా స్థలం ''సమ్మెద్ శిఖర్’’ పరిసరాల్లో ఎకో-టూరిజానికి అనుమతిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దుచేసింది.

దేశ వ్యాప్తంగా జైనుల నుంచి నిరసన వ్యక్తమైన నేపథ్యంలో కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది.

మూడేళ్ల క్రితం ఈ ప్రాంతంలో ఎకో-టూరిజానికి అనుమతిస్తూ జారీచేసిన ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటున్నట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం వెల్లడించింది. ఇక్కడ పర్యటక కార్యక్రమాలను వెంటనే నిలిపివేయాలని కేంద్ర పర్యావరణ శాఖ కూడా ఆదేశాలు జారీచేసింది.

సమ్మెద్ శిఖర్ పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ కూడా ఏర్పాటుచేసింది. దీనిలో ఇద్దరు జైన ప్రతినిధులు, ఒక ఆదివాసీకి స్థానం కల్పించారు.

మరోవైపు దిల్లీలో జైనుల ప్రతినిధులతో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ గురువారం సమావేశమయ్యారు. ''సమ్మెద్ శిఖర్‌తోపాటు దేశంలోని జైనుల ప్రార్థనా స్థలాలను పరిరక్షించేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని జైనుల ప్రతినిధులకు తెలియజేశాం’’అని సమావేశం అనంతరం భూపేంద్ర యాదవ్ ట్వీట్ చేశారు.

సమ్మెద్ శిఖర్

ఇక్కడ ఎకో-టూరిజం అనుమతులను రద్దుచేయాలని కోరుతూ ఇదివరకు కేంద్ర ప్రభుత్వానికి జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కూడా లేఖ కూడా రాశారు.

నిజానికి పారస్‌నాథ్ శిఖర్‌గా పిలుచుకునే సమ్మెద్ శిఖర్‌ను పర్యటక క్షేత్రంగా అభివృద్ధి చేయాలని జార్ఖండ్ ప్రభుత్వం తొలుత భావించింది. గ్రామీణ పర్యాటకానికి ఊతమిచ్చేలా ఇక్కడ మార్పులకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దేవగఢ్, రజరప్ప, ఇట్‌ఖోరీ లాంటి ఇతర ప్రాంతాల అభివృద్ధికి ఒక విధానాన్ని అభివృద్ధి చేయాలని హేమంత్ సోరెన్ సూచించారు.

ఒకవేళ ఇదే జరిగితే, పారస్‌నాథ్ చుట్టుపక్కల పెద్దపెద్ద హోటళ్లు, పార్కులు నిర్మిస్తారని జైనులు భావిస్తున్నారు. మరోవైపు ఇక్కడకు పర్యటకులు రావడం కూడా ఎక్కువ అవుతుందని, ఫలితంగా ఇక్కడ మద్యం, ఆల్కహాల్ లాంటివి కూడా విక్రయించడం మొదలుపెడతారని వారు చెబుతున్నారు. ఇలాంటి వాటిని పవిత్రమైన ఈ శిఖరంపై అనుమతించకూడదని వారు అంటున్నారు. మరోవైపు యువత కూడా ఇక్కడ సరదాగా గడపడానికి వస్తారని, జైన సంప్రదాయాల్లో ఇలాంటి ఉల్లాసాలకు చోటులేదని జైన ప్రతినిధులు వివరిస్తున్నారు.

జైనుల అభీష్టం మేరకు ఇక్కడ మద్యం, మాంసం విక్రయాలపై జార్ఖండ్ ప్రభుత్వం నిషేధం విధించింది.

ప్రమాణసాగర్ జీ మహారాజ్‌

దేశ వ్యాప్తంగా నిరసనలు..

కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి ముందుగా పరిస్థితులను తెలుసుకునేందుకు పారస్‌నాథ్‌కు బీబీసీ చేరుకుంది. అప్పటికి ఇక్కడ పర్వతానికి దిగువ భాగంలో గుణాయతన్ ఆలయం నిర్మాణం పనులు జరుగుతున్నాయి. గిరిడీ జిల్లా మధుబన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ గ్రామముంది.

స్వామి మునిశ్రీ ప్రమాణసాగర్ జీ మహారాజ్‌ను కలిసేందుకు మంగళవారం సాయంత్రం ఇక్కడకు భక్తులు వస్తూ కనిపించారు. ఎప్పటిలానే ఇక్కడ శంకా సమాధాన్ కార్యక్రమం కొనసాగుతోంది.

ఇక్కడ ఎకో-టూరిజానికి అనుమతించడంపై మీరే ఏమంటారు? అని ఒక భక్తుడు స్వామీజీని అడిగారు. వెంటనే ఆయనే స్పందిస్తూ.. ''సమ్మెద్ శిఖర్‌ పవిత్రతను కాపాడేందుకు మేం అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటాం. ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేవరకు నిరసనలు కొనసాగుతాయి’’అని ఆయన చెప్పారు.

ఆ కార్యక్రమం తర్వాత బీబీసీతో కూడా ప్రమాణసాగర్ మాట్లాడారు. ''సమ్మెద్ శిఖర్ అనేది జైనులకు పవిత్రమైన స్థలం. 2019లో ఈ ప్రాంతంలో ఎకో-టూరిజాన్ని ప్రోత్సహిస్తున్నట్లు చెబుతూ కేంద్రం ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించిన కార్యకలాపాలు ఇటీవల ఊపందుకున్నాయి. ఈ ప్రాంతం పర్యటక కేంద్రంగా అభివృద్ధి చెందితే, ఇక్కడ సరదా వేడుకలు, అభ్యంతరక పనులు జరగడం ఎక్కువ అవుతుంది. సమ్మెద్ శిఖర్ పవిత్రతను కాపాడేందుకు మేం అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటాం’’అని ఆయన వివరించారు.

సమ్మెద్ శిఖర్

''మాకు రాసివ్వొద్దు.. కనీసం పవిత్రతను కాపాడండి’’

''ఈ ప్రాంతాన్ని మాకు రాసి ఇవ్వాలని జైనులు కోరుకోవడం లేదు. దీని పవిత్రతను కాపాడాలని మాత్రమే మేం డిమాండ్ చేస్తున్నాం. ఇది పవిత్ర స్థలంగానే కొనసాగాలి. దీనికి అవసరమైన మౌలిక సదుపాయాలు ఇక్కడ ఏర్పాటుచేయొచ్చు’’అని ఆయన చెప్పారు.

మధుబన్‌లో ఈ ప్రాంతం మొత్తం సంథాల్ గిరిజనులు, దళితులకు చెందుతుందని పీర్‌టాండ్ బ్లాకు మాజీ చైర్మన్ సికందర్ హేమ్రంబ్ చెప్పారు.

''సమ్మెద్ శిఖర్‌కు వెళ్లేదారిలో రెండు గిరిజన ప్రార్థనా స్థలాలు కూడా ఉన్నాయి. ఇక్కడ గిరిజనులు బలి ఇచ్చే ఆచారం కూడా కొనసాగుతోంది’’అని ఆయన వివరించారు.

సమ్మెద్ శిఖర్

నోటిఫికేషన్‌లో ఏముంది?

ఈ ప్రాంతాన్ని పర్యటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు 2019 ఆగస్టు 2న 32 పేజీల నోటిఫికేషన్‌ను కేంద్ర ప్రభుత్వం విడుదలచేసింది.

దీనిపై రాష్ట్ర పర్యటక మంత్రి హఫిజుల్ హసన్ మాట్లాడారు. ''ఇది హేమంత్ సోరెన్ ప్రభుత్వ నిర్ణయం కాదు. ఈ ప్రాంతాన్ని పర్యటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని కోరుతూ ఇదివరకటి రఘువర్ దాస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఓ లేఖను పంపింది. ఆ తర్వాతే కేంద్రం ఈ ప్రాంతాన్ని ఎకో-టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేస్తాం అని నోటిఫికేషన్‌ను కేంద్రం విడుదల చేసింది’’అని హసన్ చెప్పారు.

గిరిడీ ఎమ్మెల్యే, జేఎంఎం జనరల్ సెక్రటరీ సుదివ్య కుమార్ సోను మాట్లాడుతూ.. ''ఈ విషయంపై జైన ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిసినప్పుడు నేను కూడా అక్కడ ఉన్నాను. ఎకో-టూరిజానికి బదులు మతపరమైన ప్రార్థనా క్షేత్రంగా దీన్ని అభివృద్ధి చేయాలని వారు కోరారు. అంటే సమ్మెద్ శిఖర్ పవిత్రతను కాపాడాలని వారు భావిస్తున్నారు’’అని వివరించారు.

సమ్మెద్ శిఖర్

నిరసనలు ఎలా మొదలయ్యాయి?

ఈ అంశంపై గిరిడీ జిల్లా మేజిస్ట్రేట్ నమన్ ప్రియేశ్ లకడా బీబీసీతో మాట్లాడారు. ''ఇటీవల ఆన్‌లైన్‌లో ఒక ఫోటో వైరల్ అయ్యింది. దీనిలో కొంత మంది యువత ఇక్కడ మాంసం వండుతూ కనిపించారు. ఆ ఫోటోపై మేం దర్యాప్తు చేపట్టాం. అది గత ఏడాది ఫోటో. అయితే, ఇది వైరల్ కావడంతో నిరసనలు మొదలయ్యాయి’’అని చెప్పారు.

మరో విషయాన్ని కూడా నమన్ వెల్లడించారు. ''గత అక్టోబరులో ఈ ప్రాంత అభివృద్ధికి పారస్‌నథ్ టూరిజం డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటుచేశారు. ఈ కమిటీలో ఆరుగురు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఉన్నారు. వీరిలో ఇద్దరు దిగంబర జైనులు, ఇద్దరు శ్వేతంబర జైనులు, ఇద్దరు గిరిజన ప్రతినిధులకు చోటు కల్పించాలని ప్రతిపాదించారు. అయితే, ఈ కమిటీ పేరులో టూరిజం అని ఏర్పాటుచేయడంపై వ్యతిరేకత వ్యక్తమైంది’’అని వివరించారు.

అయితే, ఈ నిరసనల వెనుక ఇటీవల చోటుచేసుకున్న ఒక ఘటన కూడా కారణమని మధుబన్ మార్కెట్‌లో బట్టల వ్యాపారంచేసే పింటూ కుమార్ చెప్పారు.

''డిసెంబరు 28న ఇక్కడకు కొంతమంది స్కూల్ పిల్లలను తీసుకొచ్చారు. వారు జైనుల పిల్లలు కాదు. దీంతో జైన వర్గానికి చెందిన సంతోష్ జైన్ అభ్యంతరం వ్యక్తంచేశారు. శిఖరం పవిత్రతను దెబ్బతీస్తున్నారని ఆయన అన్నారు’’అని కుమార్ వివరించారు.

''ఇలా పిల్లలను అడ్డుకోవడానికి వ్యతిరేకంగా మేం నిరసన తెలియజేశాం. ఎప్పటినుంచో జైనయేతరులు కూడా ఈ ప్రాంతానికి వస్తున్నారు. అలా ఎవరిపైనా అభ్యంతరాలు వ్యక్తం చేయకూడదు. దీన్ని మేం వ్యతిరేకించడంతో వారు నిరసన తెలియజేయడం మొదలుపెట్టారు’’అని ఆయన తెలిపారు. ఇలా జైనయేతరులు రాకుండా అడ్డుకోకూడదని మార్కెట్‌లో బట్టల వ్యాపారంచేసే ఒక జైన ప్రతినిధి కూడా అంగీకరించారు. అయితే, నిరసనలకు ఇది కారణం కాదని ఆయన తోసిపుచ్చారు.

''ఇక్కడ మొదట్లో జైనులు, ఇతర వర్గాల మధ్య మాత్రమే విభేదాలు ఉండేవి. కానీ, ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న ఘటనలపై దేశ వ్యాప్తంగా మీడియాలో చర్చ జరుగుతోంది. ఇక్కడకు మీడియా ప్రతినిధులు వస్తున్నారు’’అని ఆ జైన ప్రతినిధి చెప్పారు.

''మతపెద్దలు ఇలాంటి నిరసనలను పక్కనపెట్టి యాత్రికులకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషిచేయాలి. ఇక్కడ పార్కింగ్ సదుపాయాలతోపాటు ఇతర మౌలిక సదుపాయాలను కల్పించాలి’’అని ఆయన అన్నారు.

సమ్మెద్ శిఖర్

ఎందుకంత ముఖ్యం?

ఈ ప్రాంతం జైనులకు ఎందుకంత ముఖ్యమో బనారస్ హిందూ యూనివర్సిటీ ప్రొఫెసర్ శాంతి స్వరూప్ సిన్హా బీబీసీతో మాట్లాడారు. ''జైన్ ఆర్ట్ అండ్ ఏస్తెటిక్స్’’ పేరుతో ఆయన ఒక పుస్తకం కూడా రాశారు.

''జైనుల్లో 24 మంది తీర్థంకరుల్లో 20 మంది ఇక్కడే మహాపరినిర్వాణం చెందినట్లుగా భావిస్తారు. ఇక్కడ మద్యం, ఆల్కహాల్‌పై పూర్తి నిషేధం ఉంది. తమ జీవితంలో ఒక్కసారైనా 16 కిలో మీటర్లు నడిచి ఈ శిఖరంపైకి వెళ్లాలని జైనులు భావిస్తారు’’అని ఆయన చెప్పారు.

మరోవైపు దీనిపై జార్ఖండ్ పర్యటక మంత్రి హఫిజుల్ హసన్ మాట్లాడుతూ.. ''ఎవరి మతపరమైన మనోభావాలనూ దెబ్బతీయకూడదు. ఇక్కడ మాంసం, మద్యం విక్రయించకుండా చూడాలని కలెక్టర్‌కు మేం సూచించాం. జైనుల విశ్వాసాలను మేం పరిరక్షిస్తాం’’అని ఆయన వివరించారు.

కార్మికుల పరిస్థితి ఏమిటి?

ఇక్కడ గుణాయతన్ ఆలయం నిర్మాణం గత పదేళ్లుగా కొనసాగుతోంది. ఈ నిర్మాణ ప్రాజెక్టు విలువ రూ.115 కోట్లు అని ఇక్కడ పనిచేస్తున్న ఇంజినీర్ నవ్‌నీత్ కుమార్ చెప్పారు.

దేవాలయం గేటు దగ్గర రాత్రి పదకొండు గంటలకు ప్లాస్టిక్ షీటుపై నిద్రపోతూ రూప్‌లాల్ టుడూ కనిపించారు. రాత్రి రెండు గంటలకు ఇక్కడున్న ధర్మశాలల నుంచి యాత్రికులు రావడం మొదలవుతుంది. వారిని తన డోలీలో ఆయన శిఖరంపైకి తీసుకెళ్తారు.

''గత పదేళ్లుగా నేను డోలీ మోస్తున్నాను. వర్షం పడినా, చలి ఉన్నా.. మేం రోడ్డుపైనే పడుకోవాలి. మాకు మరుగుదొడ్లు కూడా లేవు. కొండ ఎక్కేటప్పుడు దారిలోనే మల, మూత్ర విసర్జన చేస్తాం. పర్యటకులు కూడా అదే చేస్తారు’’అని ఆయన చెప్పారు.

మరుగుదొడ్డి కూడా లేదా?

''పైన ఒక మరుగుదొడ్డి ఉంది. కేవలం అది పర్యటకుల కోసమే. మేం ఉపయోగించడానికి అక్కడివారు అనుమతించరు. మేం 27 కిలోమీటర్లు యాత్రికులను మోసుకుంటూ కొండపైకి తీసుకెళ్తాం’’అని రూప్‌లాల్ చెప్పారు.

కొంచెం ముందుకు వెళ్లినప్పుడు సురేశ్ తురీ కనిపించారు. ఆయన కూడా రోడ్డుపైనే పడుకున్నారు. ''ఇదివరకు మేం ధర్మశాలలో నిద్రపోయేవాళ్లం. కానీ, ఇప్పుడు వారు మమ్మల్ని రానివ్వడం లేదు’’అని ఆయన వివరించారు.

అయితే, ఇక్కడ తన నిధులతో ఇక్కడ ఒక షెడ్డు కట్టినట్లు ఎమ్మెల్యే సుదివ్య చెబుతున్నారు. అయితే, ఆ షెడ్డులో పైన రేకులు, కింద నేల మాత్రమే కనిపిస్తోంది. దీంతో కింద ప్లాస్టిక్ షీట్లు వేసుకొని, దుప్పట్లు కప్పుకొని కార్మికులు నిద్రపోతున్నారు.

ఇక్కడ కొన్ని డోలీలను ఇద్దరు, మరికొన్నింటిని నలుగురు కూడా తీసుకెళ్తున్నారు. మొత్తంగా ఇక్కడ డోలీల కోసం దాదాపు 10,000 మంది పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది గిరిజనులే ఉన్నారు. కొంతమంది దళితులు కూడా ఇక్కడ పనిచేస్తున్నారు.

ఇక్కడ 34 ధర్మశాలలు ఉన్నాయి. వీటి నుంచి విడుదలయ్యే వ్యర్థాలను దగ్గర్లోని నదిలో కలిపేస్తున్నారు. మరోవైపు ఇక్కడి గిరిజనులతో కలిపి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ప్రమాణ్‌సాగర్ అన్నారు. అయితే, గిరిజన నాయకుడు సికందర్ మాత్రం.. ఇక్కడ గిరిజనులను అసలు జైనులు పట్టించుకోవడంలేదని అంటున్నారు.

''ఇక్కడ కోట్ల రూపాయలతో జైన ప్రార్థనా మందిరాలు, ధర్మశాలలు కడుతున్నారు. వాటి కోసం గిరిజనులు పనిచేస్తున్నాం. కానీ, వారికి ఎలాంటి సదుపాయాలూ లేవు. ఇప్పటికీ మేం మంచినీటి కోసం రెండు కి.మీ. నడిచి వెళ్లాల్సి వస్తోంది’’అని సికందర్ చెప్పారు.

నిరసనల నడుమ పారస్‌నాథ్‌కు జైన యాత్రికులు వస్తున్నారు. నిరసనలతో తమ వ్యాపారాలకు, స్థానికులకు ఎలాంటి ఇబ్బందీ కలగకూడదని స్థానిక వ్యాపారులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Sammed Shikhar: Why is this area so sacred for Jains... Do they want other religions not to come?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X