బీజేపీలోకి కన్నడ హీరోలు కిచ్చా సుదీప్, దర్శన్-కర్నాటక ఎన్నికల్లో పోటీ ?
కర్నాటకలో వచ్చే నెల 10న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు సర్వశక్తులొడ్డుతున్న బీజేపీ సినీ పరిశ్రమ నుంచి కూడా వలసల్ని ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా కన్నడ హీరోలు కిచ్చా సుదీప్, దర్శన్ ను ఇవాళ పార్టీలో చేర్చుకుంటోంది. ఇప్పటికే బీజేపీకి దగ్గరగా మెలుగుతున్న సుదీప్, దర్శన్ తుగుదీప ఇవాళ అధికారికంగా కాషాయ తీర్ధం పుచ్చుకోనున్నారు.
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో సినీ పరిశ్రమకు చెందిన వారిని రంగంలోకి దింపడం ద్వారా లబ్ది పొందేందుకు బీజేపీ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా కిచ్చా సుదీప్, దర్శన్ వంటి వారితో సంప్రదింపులు జరిపింది. దీంతో వారు కాషాయ పార్టీలో చేరేందుకు అంగీకరించారు. ఇవాళ బెంగళూరులోని ఓ ప్రైవేట్ హోటల్లో సీఎం బసవరాజ బొమ్మై సమక్షంలో సుదీప్, దర్శన్ బీజేపీలో చేరబోతున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటన్నర తర్వాత వీరు బీజేపీలో చేరేందుకు ముహుర్తం ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

కర్నాటకలో ఈసారి కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్న బీజేపీ.. హీరోల సినీ గ్లామర్ ను సొమ్ము చేసుకునేందుకు వీరిని పార్టీలోకి చేర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ హీరోలిద్దరినీ వచ్చే ఎన్నికల్లో బరిలోకి దింపే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల జాబితాను బీజేపీ ఇంకా ప్రకటించలేదు. ఈ నెల 8న ఈ జాబితా విడుదల కానుంది. ఆలోపు వీరిద్దరినీ పార్టీలో చేర్చుకుని అభ్యర్ధుల జాబితాలో పేర్లు పెట్టే అవకాశాలు లేకపోలేదు. దీంతో ఈ కన్నడ హీరోలు బీజేపీకి ఈసారి ఏమేరకు ఉపయోగపడతారన్న చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications