మరో రేప్ జరిగే వరకూ ఆగొద్దు-డాక్టర్ల భద్రతపై సుప్రీం టాస్క్ ఫోర్స్-సీజే కీలక వ్యాఖ్యలు..!
కోల్ కతాలోని ఆర్ జీ కర్ ఆస్పత్రిలో రేప్ అండ్ మర్డర్ ఘటన విషయంలో పశ్చిమబెంగాల్లోని మమతా బెనర్జీ సర్కార్ నిర్లక్ష్యంపై సుప్రీంకోర్టు ఇవాళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే ఈ కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు.. ఇవాళ విచారణ జరిపింది. ఇందులో ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం, హత్య జరిగిందని తెలిసి కూడా ఆమె మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించకముందే ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని బెంగాల్ పోలీసుల్ని ప్రశ్నించింది.
కోల్ కతా ఆస్పత్రిలో ఓ ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం, హత్య జరిగితే దాన్ని ఆత్మహత్యగా ఎలా చెప్పారంటూ కాలేజీ ప్రిన్సిపాల్ పైనా సుప్రీంకోర్టు ఆగ్రహం మండిపడింది. అలాగే మీడియాలోనూ బాధితురాలి ఫొటో, వివరాలు రావడంపైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది కేవలం ఆసుపత్రిలో ఒక నిర్దిష్ట అత్యాచారం సమస్యకు సంబంధించిన అంశం మాత్రమే కాదని, ఇది దేశంలోని వైద్యుల భద్రతకు సంబంధించిన సమస్య అని సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు.

దేశంలో చాలా మంది యువ డాక్టర్లు 36 గంటల పాటు వరుసగా పనిచేస్తున్న సందర్భాలు ఉన్నాయని, అందులో మహిళా డాక్టర్లకు పని ప్రదేశాల్లో భద్రత కల్పించలేకపోతే వారికి సమానత్వాన్ని నిరాకరిస్తున్నట్లే లెక్క అని సీజే స్పష్టంచేశారు. క్షేత్రస్దాయిలో మార్పులు తెచ్చే వరకూ దేశంలో మరో రేప్ లేదా హత్య జరిగే వరకూ మనం ఎదురుచూడొద్దని సీజే తెలిపారు. ఆస్పత్రుల్లో డాక్టర్ల భద్రతపై సూచనలు చేసేందుకు 10 మంది సభ్యులతో ఓ జాతీయ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. మూడు వారాల్లో ఈ టాస్క్ ఫోర్స్ డాక్టర్ల భద్రతపై సుప్రీంకోర్టుకు సూచనలు చేయనుంది. తదుపరి విచారణ ఎల్లుండికి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications