రాయ్‌కు బెయిల్: 10వేల కోట్లు చెల్లిస్తేనే విడుదల
న్యూఢిల్లీ: సహారా సంస్థల అధినేత సుబ్రతారాయ్‌కు సుప్రీం కోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. డిపాజిటర్లను మోసం చేసిన కేసులో గత ఏడాదిగా జైలులో ఉంటున్న సుబ్రతో రాయ్ ఇప్పటికే పలుమార్లు బెయిల్ కోసం యత్నించి విఫలమయ్యాడు.
తాజాగా ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. రూ. 10 వేల కోట్ల సొమ్మును డిపాజిట్ చేస్తే బెయిలిస్తామని సుప్రీం కోర్టు గతంలో చెప్పినా కోర్టుకు బ్యాంకు గ్యారంటీ ఇవ్వడంలో సుబ్రతో విఫలమయ్యారు.
దీంతో కోర్టు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో మరికొన్ని రోజులు సుబ్రతా రాయ్ జైల్లోనే కాలం వెళ్లదీయక తప్పదు. ఇన్వెస్టర్ల నుంచి సేకరించిన డిపాజిట్లపై 20,000 కోట్ల రూపాయల వడ్డీ చెల్లించడంలో సుబ్రతా రాయ్ విఫలమయ్యారు. కోర్టు ఆదేశాల ప్రకారం ఆయన గతేడాది నుంచి తీహార్ జైల్లోనే ఉన్నారు.

తీహార్ జైలు అధికార వర్గాలకు సహారా గ్రూప్ 31 లక్షల రూపాయలను చెల్లించింది. మదుపుదారుల సొమ్ము చెల్లించని కారణంగా సహారా గ్రూప్ అధినేత సుబ్రతా రాయ్ తీహార్ జైలులో ఉంటున్న విషయం తెలిసిందే. తన బెయిల్ కోసం 10,000 కోట్ల నిధులను సమీకరించడంలో భాగంగా విదేశాల్లోని లగ్జరీ హోటళ్ల విక్రయానికి వివిధ వర్గాలతో సుబ్రతా రాయ్ ఈ జైలు నుంచే చర్చలు జరుపుతున్నారు.
ఈ సందర్భంగా వినియోగిస్తున్న వీడియో కాన్ఫరెన్స్, ఇంటర్నెట్, ఫోన్, ఎయిర్ కండీషనర్ తదితర సదుపాయల ఖర్చులకుగాను ఈ 31 లక్షలను తీహార్ జైలుకు సహారా చెల్లించింది. హోటళ్ల విక్రయానికి సంబంధించి చర్చలకు జైలులోని కాన్ఫరెన్స్ గదిని వినియోగించుకునే వెసులుబాటును సుప్రీం కోర్టు సుబ్రతా రాయ్‌కి కల్పించింది.












Click it and Unblock the Notifications