Maharastra Elections: అజిత్ పవార్ కు సుప్రీం ఝలక్-మీ కాళ్లపై నిలబడలేరా ?
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన అజిత్ పవార్ .. మధ్యలో పార్టీని చీల్చి బీజేపీతో కూడిన మహాయుతి కూటమికి మద్దతిచ్చి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత అసలైన ఎన్సీపీ నాదేనంటూ ప్రకటించుకున్నారు. అయినా పార్టీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ ఫొటోలు, వీడియోలను మాత్రం యథేచ్ఛగా వాడేసుకుంటున్నారు. దీనిపై శరద్ పవార్ వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఇవాళ కీలక తీర్పు ఇచ్చింది. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ ఫొటోలు, వీడియోలు వాడకుండా అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎన్సీపీలో ఇరు వర్గాలు కూడా తమ కాళ్లపై తాము నిలబడాలంటూ కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. వచ్చేవారం ఎన్నికలు జరగబోతున్న తరుణంలో అజిత్ పవార్ కు ఇది గట్టి షాక్ గా భావిస్తున్నారు.

శరద్ పవార్‌తో సైద్ధాంతిక విభేదాలు ఉన్నందున ఇప్పుడు మీ కాళ్లపై నిలబడటం నేర్చుకోవాలంటూ అజిత్ పవార్ కు ప్రత్యేకంగా సుప్రీంకోర్టు సూచించింది. మీరు శరద్ పవార్ నుండి విడిపోయిన తర్వాత, అతని పేరు, ఫోటో లేదా వీడియోను ఉపయోగించకూడదని తేల్చిచెప్పేసింది. నవంబర్ 19కి ఈ కేసు విచారణను వాయిదా వేసింది. అదే సమయంలో ఎవరికి ఓటు వేయాలో తెలిసిన ఓటర్ల జ్ఞానంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని పేర్కొంది. ఈ నెల 20న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.












Click it and Unblock the Notifications