మణిపూర్ హింసపై 6,500 ఎఫ్ఐఆర్స్- అన్నీ తప్పుల తడకే: సుప్రీంకోర్టు ఆగ్రహం ..!!
న్యూఢిల్లీ: రోజులు గడుస్తున్నప్పటికీ మణిపూర్‌లో చెలరేగిన హింసకు బ్రేకులు పడట్లేేదు. అక్కడి పరిస్థితులు అదుపులోకి రావట్లేదు. రెండున్నర నెలలుగా ఈ రాష్ట్రం మండిపోతూనే వస్తోంది. మెయితీ, కుకీ సామాజిక వర్గాల మధ్య మొదలైన రిజర్వేషన్ అంశం రోజురోజుకూ తీవ్రరూపాన్ని దాల్చుతూనే ఉంది. దీనికి అడ్డుకట్ట వేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపినప్పటికీ.. ఏ మాత్రం ఫలితం ఉండట్లేదు.
ఇద్దరు మహిళలను వివస్త్రలుగా చేసి.. ఊరేగించడం, అందరూ చూస్తుండగానే వారిపై అత్యాచారానికి పాల్పడిన అమానవీయ సంఘటనల వీడియోలు వెలుగులోకి రావడం- అక్కడి హింసాత్మక పరిస్థితులకు ఆజ్యం పోసినట్టయింది. ఈ ఘటన- అటు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనూ ప్రస్తావనకు వచ్చింది. ఉభయసభల్లో ప్రకంపనలు పుట్టించింది. ఇవ్వాళ్టికీ అదే తీరు కొనసాగుతుంది.

మణిపూర్‌లో చోటు చేసుకున్న హింసాత్మక పరిస్థితులపై అటు దేశ అత్యున్నత న్యాయస్థానం సైతం ఘాటుగా స్పందించింది. మణిపూర్ అంశంపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటీషన్లపై ఇవ్వాళ కూడా వాడివేడిగా వాదనలు కొనసాగాయి. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లన్నీ తప్పుల తడకగా ఉన్నాయంటూ సుప్రీంకోర్టు మండిపడింది.
మణిపూర్ డీజీపీపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం. ఎఫ్‌ఐఆర్‌ల నమోదులో ఎన్నో లోపాలు ఉన్నాయని, దీనిపై ఆ రాష్ట్ర డీజీపీ వివరణ ఇవ్వాలని ఆదేశించింది. సంఘటన జరిగిన తేదీ, జీరో ఎఫ్‌ఐఆర్, సాధారణ ఎఫ్‌ఐఆర్, సాక్షుల వాంగ్మూలాల నమోదు, సెక్షన్ 164 సీఆర్పీసీ కింద స్టేట్‌మెంట్ రికార్డ్ చేసీన తేదీలన్నీ పొంతన లేకుండా ఉన్నాయని పేర్కొంది.
వాటన్నింటితో కూడిన సమగ్ర స్టేట్‌మెంట్‌ను సమర్పించాలని సుప్రీంకోర్టు.. మణిపూర్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరు నేరం చేసినా కోర్టు తీరు ఒకేలా ఉంటుందని అన్నారు. ఎవరు బాధితుడు? నేరస్థుడు? అనేది సంబంధం ఉండదని, నేరం నేరమేనని చెప్పారు.

రాష్ట్ర పోలీసులు విచారణ చేపట్టే పరిస్థితుల్లో లేనట్టుగా కనిపిస్తోందని, అందుకే దీనికోసం ఓ ప్రత్యేక యంత్రాంగం అవసరమని డీవై చంద్రచూడ్ అన్నారు. 6,500 ఎఫ్‌ఐఆర్‌ల దర్యాప్తును సీబీఐకి అప్పగించడం అసాధ్యమని పేర్కొన్నారు. దీనిపై విచారణ అటు రాష్ట్ర పోలీసులకు కూడా సమగ్ర విచారణకు అప్పగించకూడదని చెప్పారు.












Click it and Unblock the Notifications