వివాదం: జ్యోతిషం ముందు సైన్స్ పిగ్మీ అని బిజెపి ఎంపి వ్యాఖ్య
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, బిజెపి పార్లమెంటు సభ్యుడు రమేష్ పొఖ్రియాల్ వివాదాస్పద వ్యాఖ్య చేశారు. సైన్స్ కన్నా జ్యోతిషం చాలా గొప్పదని ఆయన అన్నారు. ప్లానింగ్, ఆర్కిటెక్చర్ స్కూల్‌కు అధిక అధికారాలు కట్టబెట్టే బిల్లుపై పార్లమెంటుపై చర్చ సందర్భంగా ఆయన వ్యాఖ్య చేశారు. అంచనాలు వేయడంలో సైన్స్ కన్నా జ్యోతిషం లక్షలాది ఏళ్లు ముందుందని ఆయన అన్నారు.
జ్యోతిషం ముందు అన్ని శాస్త్ర విజ్ఞానాలు మరుగుజ్జులని ఆయన వ్యాఖ్యానించారు. ప్రపంచంలో జ్యోతిష్ శాస్త్రాన్ని అగ్రగామిగా ముందుకు తీసుకుని వెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ అంశంపై చర్చ జరగాల్సి ఉందని చెప్పారు. లక్షలాది ఏళ్లకు ముందే సన్యాసి కనడ్ అణ్వస్త్ర పరీక్షలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు.

మన విజ్ఞానం, సైన్స్ ఎందులోనూ వెనకబడి లేదని అన్నారు. ఆదిమ యుగంలో మన వద్ద జన్యు శాస్త్రం మనుగడలో ఉందంటూ ప్రధాని నరేంద్ర మోడీ చెప్పిన మాటలను నిశాంక్ ఉదహరించారు. కర్ణ, గణేశ ఉదంతాలు మన దేశంలోని జన్యు శాస్త్రం, ప్లాస్టిక్ సర్జరీకి ఉదాహరణలని నరేంద్ర మోడీ చెప్పారని ఆయన అన్నారు.
వినాయకుడి శస్త్ర చికిత్స గురించి మోడీ చేసిన వ్యాఖ్యలపై కొంత మంది ప్రశ్నించారని, అది వాస్తవంగా శస్త్రచికిత్స అని, తెగిన తలను మార్పిడి చేసే శాస్త్రం లేదా విజ్ఞానం మన దేశంలోనే ఉందని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలకు ప్రతిపక్షాల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. ఇవి తిరోగమన వ్యాఖ్యలని ప్రతిపక్షాలు విమర్శిచాయి.












Click it and Unblock the Notifications