ఢిల్లీ మేయర్ ఎన్నికలో మరో ట్విస్ట్: ఆప్ వాదనకు సుప్రీం మద్దతు- బీజేపీకి భారీ షాక్?
ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో ఆప్ అత్యధిక స్ధానాలు సాధించినా మేయర్ పీఠం కైవసం చేసుకునేందుకు నామినేటెడ్ సభ్యుల సాయంతో గేమ్ మొదలుపెట్టిన బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. నామినేటెడ్ సభ్యుల సాయంతో మేయర్ పీఠం దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్న బీజేపికి ఇవాళ సుప్రీంకోర్టు షాకిచ్చింది.
ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడిన ఢిల్లీ మేయర్ ఎన్నిక నిర్వహించే విషయంలో మరోసారి విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. మరోసారి వాయిదా వేసేందుకు అంగీకరించింది. అయితే నామినేటెడ్ సభ్యులకు ఓటు హక్కు కల్పించే విషయంలో మాత్రం ససేమిరా అంది. దీంతో నామినేటెడ్ సభ్యుల సాయంతో మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఈ విషయంలో ఆప్ వాదనతో సుప్రీంకోర్టు ధర్మాసనం ఏకీభవించింది.

ఫిబ్రవరి 16న మేయర్ ఎన్నిక నిర్వహించాలన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పార్టీ ప్రతిపాదనను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా గతంలో ఆమోదించారు. లెఫ్టినెంట్ గవర్నర్ నామినేట్ చేసిన 10 మంది కౌన్సిల్ సభ్యులను ఓటు వేయడానికి అనుమతించిన తర్వాత బీజేపీ, ఆప్ నిరసనల కారణంగా జనవరి 6, 24, ఫిబ్రవరి 6 న మేయర్ ఎన్నిక వాయిదా పడుతూ వచ్చింది.
ఢిల్లీ కార్పోరేషన్ చట్టం ప్రకారం నామినేటెడ్ సభ్యులకు ఓటు హక్కు లేదు. అయినా బీజేపీ వీరితో ఓటు వేయించేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ సాయంతో విశ్వప్రయత్నాలు చేసింది. దీనికి సుప్రీంకోర్టు అంగీకరించకపోవడంతో ఆప్ కు భారీ ఊరటగా మారింది.












Click it and Unblock the Notifications