కాంగ్రెస్ కు భారీ షాక్ -బీజేపీలో చేరిపోయిన కేరళ దిగ్గజ నేత కుమారుడు..
సీనియర్ కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీ ఇవాళ పార్టీని వీడి బీజేపీలో చేరిపోయారు. 2002 గుజరాత్ అల్లర్ల కేసు తీర్పు, ప్రధాని మోడీపై బీబీసీ డాక్యుమెంటరీ వివాదం నేపథ్యంలో ఈ ఏడాది జనవరిలో కాంగ్రెస్ పార్టీని వీడిన అనిల్ ఆంటోనీ .. ఇవాళ ఢిల్లీలో కేంద్రమంత్రుల సమక్షంలో బీజేపీలో చేరారు.
కేరళ కాంగ్రెస్ నేతగా ఉన్న అనిల్ ఆంటోనీ.. కొంతకాలంగా పార్టీ పనితీరుపై అసంతృప్తిగా ఉన్నారు. అయితే తండ్రి ఏకే ఆంటోనీ కాంగ్రెస్ లోనే పుట్టిపెరిగిన నేత కావడం, ఆయనతో విభేదాల నేపథ్యంలో జనవరిలోనే సొంత పార్టీని వీడారు.
ఇవాళ ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో బీజేపీ కేంద్రమంత్రులు పీయూష్ గోయల్, వీ మురళీధరన్, పార్టీ కేరళ యూనిట్ చీఫ్ కే సురేంద్రన్ సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు.

బీజేపీలో చేరిన సందర్భంగా అనిల్ ఆంటోనీ కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త తాము ఓ కుటుంబం కోసం పనిచేస్తున్నామని నమ్ముతారన్నారు. కానీ తాను కాంగ్రెస్ కోసం పనిచేస్తున్నానని నమ్ముతున్నానన్నారు. బహుళ ధ్రువ ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రగామిగా ఉంచే విషయంలో ప్రధాని నరేంద్ర మోడీకి చాలా స్పష్టమైన దృష్టి ఉందని అనిల్ వ్యాఖ్యానించారు. అనిల్ ఆంటోనీది బహుముఖ వ్యక్తిత్వమని, ఆయన అర్హతలు తమను ఆకట్టుకున్నాయని బీజేపీలో చేరిక సందర్భంగా కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.
మరోవైపు అనిల్ ఆంటోనీ కాంగ్రెస్ పార్టీని వీడే ముందు కేరళలో పార్టీ సోషల్ మీడియా సెల్‌ను నడిపారు. పార్టీని వీడే ముందు ఆయన.. ప్రధాని మోడీపై బీబీసీ డాక్యుమెంటరీని భారతదేశంపై పక్షపాత వైఖరిగా పేర్కొన్నారు. భారత రాజకీయాల్లో విపక్షాల స్థానాన్ని కుదించేందుకు ప్రధాని మోదీ ఎత్తుగడలు వేస్తున్నారని ఆరోపిస్తూ ఆయనపై దాడి చేసేందుకు కాంగ్రెస్ ఈ డాక్యుమెంటరీని ఉదాహరణగా చూపిందన్నారు.












Click it and Unblock the Notifications