కర్ణాటక పశ్చిమ కనుమల్లో.. 3,800 అడుగుల ఎత్తులో: దీపావళికి మాత్రమే తెరచుకునే ఆలయం
కర్ణాటకలో ఎత్తయిన పర్వతాలపై వెలిసిన దేవీరమ్మ అమ్మవారి ఆలయం తెరచుకుంది. సంవత్సరం పొడవునా మూసివుండే అతి అరుదైన ఆలయం ఇది. దీపావళి రోజు మాత్రమే తెరచుకుంటుంది. భక్తులకు అమ్మవారు దర్శనం ఇస్తుంది. దేవీరమ్మను దర్శించుకోవడానికి లక్షల సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుంటోన్నారు. ఈ సాయంత్రం తర్వాత ఆలయం తలుపులను మూసివేస్తారు.
చిక్ మగళూరు జిల్లాలో సముద్ర మట్టానికి 3,800 అడుగుల ఎత్తులో ఉన్న ఆలయం ఇది. దత్తపీఠం, బాబా బుడాన్ గిరి మీదుగా చంద్రద్రోణ పర్వతానికి చేరుకోవాల్సి ఉంటుంది. చిక్ మగళూరు నుంచి 33 కిలోమీటర్లు. ఈ దూరాన్ని అధిగమించడానికి సుమారు గంటన్నర సమయం పడుతుంది. ఘాట్ రోడ్ వల్ల వాహనాల రాకపోకలు నెమ్మదిగా సాగుతుంటాయి. పర్వతం పైభాగంపై ఆలయం వెలిసింది. ఇక్కడికి చేరుకోవడానికి మెట్లు ఉన్నాయి. అయిదారు కిలోమీటర్లు కొండను అధిరోహించాలి.

సాయంత్రానికి లక్షమందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని జిల్లా అధికార యంత్రాంగం అంచనావేసింది. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏటవాలుగా ఉన్న మెట్లను ఎక్కే సమయంలో భక్తులు జారి కిందపడకుండా ఉండటానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. గత ఏడాది ముగ్గురు భక్తులు గాయపడిన నేపథ్యంలో ఈ సారి మరిన్ని అదనపు ఏర్పాట్లు చేశారు.
చిక్ మగళూరు జిల్లాల్లో రెండురోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. అయినా భక్తులు లెక్క చేయట్లేదు. సంవత్సరానికి ఒకసారి మాత్రమే తెరచుకునే ఆలయం కావడం వల్ల పోటెత్తుతున్నారు. వర్షాల తీవ్రత పెరిగితే కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్నందున భక్తులు అత్యంత జాగ్రత్తగా కొండ ఎక్కాలని జిల్లా అధికార యంత్రాంగం సూచించింది. ఎటువంటి ఆటంకాలు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుంది. కొండ ఎక్కే భక్తుల కోసం మార్గదర్శకాలను విడుదల చేసింది.
కొండ కింద దేవీరమ్మ అమ్మవారికి ప్రత్యేకంగా మరో ఆలయాన్ని నిర్మించారు. సంవత్సరం పొడవునా ఈ ఆలయం తెరిచి ఉంటుంది. ఇక్కడ మూడు రోజుల పాటు జాతరను నిర్వహిస్తారు. ఆదివారం జాతర ఆరంభమైంది. ఇక్కడికి వచ్చిన భక్తులు కొండపై వెలిసిన అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తుంటారు. ఈ జాతర నేపథ్యంలో కేఎస్ఆర్టీసీ అధికారులు బెంగళూరు, హాసన్, చిక్ మగళూరు, మైసూరు నుంచి ప్రత్యేక బస్సులను నడిపిస్తోన్నారు.












Click it and Unblock the Notifications