• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Sexsomnia: నిద్రలో సెక్స్‌ చేసే ఈ వ్యాధి ఏమిటి? దీన్ని కారణంగా చూపించి అత్యాచారం కేసును కొట్టేయవచ్చా?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
జేడ్ మెక్‌క్రాసెన్ నెథెర్కాట్

అరుదైన నిద్ర సమస్య ఓ అత్యాచార కేసును చాలా మలుపులు తిప్పింది. పోలీసులు దీన్ని కారణంగా చూపించి కేసును మూసివేశారు. అయితే, ఈ కేసును మళ్లీ తెరచేందుకు ఆమె ఏం చేశారు?

జేడ్ మెక్‌క్రాసెన్ నెథెర్కాట్ దాఖలుచేసిన అత్యాచార కేసును ఇకపై విచారించకూడదని బ్రిటన్‌లోని క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ (సీపీఎస్) నిర్ణయించింది.

ఆమెకు ''సెక్సోమ్నియా’’గా పిలిచే వ్యాధి ఉందని, దీని వల్ల ఈ కేసులో దోషిని నిర్ధారించడం వీలుకాదని సీపీఎస్ పేర్కొంది. అయితే, ఈ వ్యాధి గురించి నెలలపాటు పరిశోధన చేపట్టిన ఆమె సీపీఎస్ నిర్ణయాన్ని సవాల్ చేశారు.

ఇప్పుడు తప్పు చేశామని సీపీఎస్ అంగీకరించింది. ఆమెకు క్షమాపణలు కూడా చెప్పింది.

అత్యాచారం

ఇంతకీ అసలు ఏమిటీ కేసు?

2017లో ఓ ఆదివారం సాయంత్రం సౌత్ లండన్‌లో ఓ ఇంటిలో సోఫాపై పడుకున్న జేడ్‌కు నెమ్మదిగా తెలివివచ్చింది. వెంటనే తను అర్ధనగ్నంగా ఉన్నట్లు ఆమె గమనించారు. తన మెడలోని గొలుసు కూడా ముక్కలై నేలపై కనిపించింది.

కార్న్‌వాల్‌కు చెందిన 24ఏళ్ల జేడ్‌కు తనతో ఎవరో సెక్స్‌ చేసినట్లు అనిపించింది. నిద్రలో ఉండగానే తనపై ఎవరో అత్యాచారం చేసినట్లు ఆమె అనుకున్నారు. ఆ తర్వాత తనపై అత్యాచారం చేసినట్లు భావించిన వ్యక్తిపై ఆమె కేసు పెట్టారు.

అయితే, మూడేళ్ల తర్వాత, ఇటీవల పోలీస్ స్టేషన్‌కు ఆమెను అత్యవసరంగా రావాలని సీపీఎస్ న్యాయవాదులు పిలిచారు.

అప్పుడే ఆ కేసుపై ఇక ముందుకు వెళ్లలేమని లాయర్లు తెలిపారు. ఈ కేసుపై ఇద్దరు ''స్లీప్ ఎక్స్‌పర్ట్స్’’తో మాట్లాడామని వారు చెప్పారు. ''బహుశా సెక్సోమ్నియా వల్ల అలా అయ్యుండొచ్చు. ఆ సమయంలో మీరు కాస్త తెలివితోనే ఉండొచ్చు. బహుశా మీరు కూడా సెక్స్‌కు అంగీకరించే ఉండొచ్చు’’అని ఆమెకు చెప్పారు.

సెక్సోమ్నియా అనేది ఒకరమైన ఆరోగ్య సమస్య. ఈ సమస్యతో బాధపడేవారు నిద్రలోనే సెక్స్ చేస్తుంటారు.

ఇంగ్లండ్, వేల్స్‌లోని చట్టాల ప్రకారం, ఒక వ్యక్తి నిద్రలో ఉంటే సెక్స్‌కు అంగీకరించనట్లుగా భావించాలి. అదే సమయంలో ఒకవేళ సదరు మహిళ సెక్స్‌కు అంగీకారం తెలిపినట్లు ''కొంత నమ్మకం’’ కలిగించేలా పరిస్థితులు ఉన్నప్పటికీ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని దోషిగా నిర్ధారించడానికి వీలులేదు.

''ఇలా జరుగుతుందని నేను అసలు ఊహించుకోలేదు. ఏం జరిగిందో నాకు అర్థం కాలేదు’’అని నాటి పరిస్థితుల గురించి జేడ్ వివరించారు. అప్పటివరకు సెక్సోమ్నియాపై ఆమెకు ఎలాంటి అవగాహనా లేదు.

''గత 13ఏళ్లలో రెండు రిలేషన్‌షిప్‌లలో ఉన్నాను. కానీ, ఎవరూ నాకు దీని గురించి చెప్పలేదు’’అని ఆమె చెప్పారు.

సీపీఎస్ నిర్ణయం ప్రకారం, ఈ కేసును మూసివేయాలి. మరోవైపు నిందితుడికి పూర్తిగా ఆరోపణల నుంచి విముక్తి ప్రకటిస్తారు.

మొదట తను పోలీస్ స్టేషన్‌కు వెళ్లినప్పుడు నిద్ర గురించి ఆమెను అక్కడి అధికారులు ప్రశ్నలు అడిగారు.

ఎప్పుడూ తనకు మంచి నిద్ర పడుతుందని, టీనేజీ వయసులో నిద్రలో నడుచుకుంటూ కొన్నిసార్లు అలా బయటకు వెళ్లానని ఆమె ఓ పోలీసు అధికారికి వివరించారు. అయితే, ఇదే కేసును మూసివేయడానికి కారణం అవుతుందని ఆమె ఊహించలేదు.

జేడ్ మెక్‌క్రాసెన్ నెథెర్కాట్, బెల్

అసలు ఆ రోజు ఏం జరిగింది?

పోలీసులకు ఆ రోజు సమాచారం ఇచ్చింది జేడ్ బెస్ట్ ఫ్రెండ్ బెల్. ఆమె 999కు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పారు.

తనతో మొదట జేడ్ మాట్లాడినప్పుడు ఆమె గొంతు ఎలా ఉండేదో ఇప్పటికీ బెల్‌కు గుర్తింది. ''నేను ముందెప్పుడూ తన గొంతును అలా వినలేదు. తను చాలా బాధపడుతూ మాట్లాడింది. తనపై అత్యాచారం జరిగిందని వివరించింది. మన ఆప్తులు అలా చెబితే, మన కాలి కింద భూమి కదిలినట్లు అనిపిస్తుంది’’అని బెల్ చెప్పారు.

బార్‌కు వెళ్లేముందు వీరిద్దరూ కలిసి బయటకువెళ్లారు. కలిసే మేకప్ వేసుకున్నారు, కలిసే వైన్ తాగారు, కలిసే సాయంత్రం హాయిగా గడిపారు.

ఆ రోజు సాయంత్రం చాలా సరదాగా గడిచింది. రాత్రి అయినప్పుడు బెల్ ట్యాక్సీ బుక్ చేసుకొని ఇంటికి వెళ్లిపోయారు. ఆ తర్వాత స్నేహితుడి ఫ్లాట్‌కు వెళ్లాలని జేడ్ నిర్ణయించుకున్నారు.

అక్కడ రాత్రి 2 గంటలకు కూడా కొంతమంది చాట్ చేస్తూ కనిపించారు. అయితే, సోఫాలో దుప్పటి కప్పుకొని ఆమె నిద్రలోకి వెళ్లిపోయారు.

అయితే, ఉదయం 5 గంటలకు ఆమెకు మెలకువ వచ్చింది. ఆమె ప్యాంట్ విప్పేసి ఉంది. బ్రా కూడా ఒంటిపై సరిగా లేదు. సోఫాకు రెండోవైపు ఒక పురుషుడు ఆమెకు కనిపించారు.

''అసలు ఏం జరిగింది? నువ్వేం చేశావు?’’అని ఆమె గట్టిగా అతణ్ని అడిగారు. ''కొంచెం చెప్పలేనిది జరిగింది. నువ్వు తెలివితోనే ఉన్నావు కదా’’అని ఆయన సమాధానం ఇచ్చారు.

''అతడు వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తలుపు కూడా తెరిచే ఉంది. వెంటనే ఫోన్ తీసుకొని బెల్‌కు కాల్ చేశాను’’అని జేడ్ చెప్పారు.

ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఇద్దరు పోలీసు అధికారులు ఫొరెన్సిక్ పరీక్షల కోసం జేడ్‌ను తీసుకెళ్లారు. వెజైనల్ స్వాబ్ టెస్టులలో వీర్యం కనిపించింది. ఇది సోఫాపై కనిపించిన వీర్య నమూనాతో సరిపోలింది.

మొదట పోలీసులు ప్రశ్నించినప్పుడు నిందితుడు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. దీంతో అతడిపై అత్యాచార ఆరోపణలు మోపాలని సీపీఎస్ నిర్ణయించింది. దీంతో నేనే తప్పూ చేయలేదని ఆయన వాదించారు. విచారణకు తేదీ కూడా ఖరారుచేశారు.

కానీ, అసలు విచారణే జరగలేదు.

ఈ కేసును మూసివేయాలని సీపీఎస్ తీసుకున్న నిర్ణయం తప్పని ఎలాగైనా నిరూపించాలని జేడ్ భావించారు. కానీ, అప్పీలుకు ఆమె దగ్గర చాలా తక్కువ సమయమే మిగిలివుంది.

దీంతో పోలీసుల ఇంటర్వ్యూలు, టాక్సికాలజీ పరీక్షల ఫలితాలు, స్లీప్ ఎక్స్‌పర్ట్స్ నివేదికలు ఇలా అన్నింటినీ ఆమె సేకరించారు.

స్లీప్ ఎక్స్‌పర్ట్స్ చెప్పిన సిద్ధాంతాలకు పోలీసులు అంత ప్రాధాన్యం ఇవ్వడం చూసి ఆమె షాక్‌కు గురయ్యారు.

ఎందుకంటే వారు అసలు ఆమెను వ్యక్తిగతంగా కలవనేలేదు. కానీ, ఆ అభిప్రాయాలతో కేసును మూసివేసే పరిస్థితి వచ్చింది.

అత్యాచారం

నిద్రలో సెక్స్‌ చేసే ఈ వ్యాధి ఏమిటి?

మొదట నిపుణుడు జేడ్‌కు ఆ రోజు సెక్సోమ్నియా ఎటాక్ అయ్యుంటుందని చెప్పారు. ''ఆమె కళ్లు తెరచి, ఆనందాన్ని పొందుతూ సెక్స్ పాల్గొని ఉండొచ్చు’’అని ఆయన చెప్పారు. ఆయన్ను నిందితుడి తరఫు వ్యక్తి తీసుకొచ్చారు.

మరో నిపుణుడిని సీపీఎస్ నియమించింది. ''16ఏళ్ల వయసులో ఆమెకు నిద్రలో నడిచే అలవాటు ఉన్నట్లు ఆమె చెప్పారు. నిద్రలో కూడా ఆమె మాట్లాడేదాన్నని వివరించారు. దీని ప్రకారం, ఆమెకు సెక్సోమ్నియా ఎటాక్ అయ్యుండొచ్చని అనిపిస్తోంది’’అని ఆయన చెప్పారు.

ఈ రెండు వాదనలు విన్న తర్వాత జేడ్‌కు ఏం చెప్పాలో తెలియలేదు. ''కేవలం అదే రోజు సెక్సోమ్నియా ఎటాక్ ఎలా జరుగుతుంది. అసలు అంతకుముందు ఎప్పుడూ సెక్స్‌లో పాల్గొనని వ్యక్తితో సెక్స్‌కు నిద్రలో ఎలా అంగీకరిస్తాను?’’అని ఆమెలో ఆమె చాలా మథనపడ్డారు.

దీంతో ఆ తర్వాత తను కూడా ఒక నిపుణుడిని తీసుకురావాలని జేడ్ నిర్ణయించుకున్నారు. అప్పుడే లండన్ స్లీప్ సెంటర్‌లోని డాక్టర్ ఇర్షాద్ ఇబ్రహీంను కలిశారు. అత్యాచార కేసుల్లో నిపుణుడిగా అభిప్రాయాలను చెప్పిన అనుభం ఆయనకు ఉంది.

అయితే, ఆయన దగ్గరకు వచ్చిన కేసుల్లో అత్యాచార బాధితురాలికి సెక్సోమ్నియా ఉందంటూ వచ్చిన తొలి కేసు ఇదే. సాధారణంగా నిందితులే సెక్సోమ్నియాతో అత్యాచారం చేసిన కేసులను ఆయన చూస్తుంటారు. బీబీసీ చేపట్టిన పరిశోధనలోనే బాధితులకు సెక్సోమ్నియా ఉన్న కేసులు కనిపించలేదు.

సెక్సోమ్నియాను నిర్ధారించడానికి సరైన విధానాలు, పరీక్షలు ప్రస్తుతం అందుబాటులోలేవని ఇబ్రహీం చెప్పారు. అయితే, సాధారణంగా ఈ వ్యాధితో బాధపడే పురుషులు నిద్రలోనే సెక్స్ చేస్తుంటారు.

దీంతో జేడ్ స్లీప్ టెస్టు పాలీసోమ్నోగ్రఫీకి వెళ్లారు. ఈ పరీక్షలో భాగంగా మెదడు తరంగాలు, శ్వాస, నిద్రలో కదలికలను పరిశీలిస్తారు.

ఆమె నిద్రలోనే సెక్స్‌కు అంగీకరించారా?

నిద్రలో ఆమె గురకలు పెడతారని, ఆమెకు నిద్ర సమస్య స్లీప్ ఆప్నియా కూడా ఉందని వైద్యులు నిర్ధారించారు. ఈ సమస్య ఉండే వారికి ఒక్కోసారి నిద్రలో శ్వాస సరిగా అందదు. ఈ రెండూ సెక్సోమ్నియాకు కారణం కావొచ్చని డాక్టర్ ఇబ్రహీం చెప్పారు. దీంతో ఆ రోజు ఆమెకు సెక్నోమ్నియా ఎటాక్ వచ్చుండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

అయితే, అసలు జరిగిన దానిలో సెక్సోమ్నియా పాత్ర ఉందని ఏ మేరకు చెప్పొచ్చు? అని ఆమె వైద్యుడిని అడిగారు.

''అది నిజంగా బిలియన్ డాలర్ల ప్రశ్న’’అని ఇబ్రహీం అన్నారు.

''అవును లేదా కాదు.. జరుగుతుంది లేదా జరగదు.. ఇలాంటి సమాధానం ఆమె అడిగారు’’అని ఆయన చెప్పారు.

ఆ రోజు సెక్సోమ్నియా ఎటాక్ అయ్యుండదని జేడ్ బలంగా నమ్ముతున్నారు. అయితే, స్లీప్ ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయాలు మాత్రం దానికి విరుద్ధంగా ఉన్నాయి.

దీంతో ఈ వ్యాధిని కోర్టులు ఎలా చూస్తున్నాయో మరింత లోతుగా తెలుసుకునేందుకు ఆమె ఒక న్యాయవాది దగ్గరకు వెళ్లారు.

బారిస్టర్ అలిసన్ సమ్మర్స్ కేసీ.. ఇదివరకు సెక్సోమ్నియాతో పురుషులు అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న కేసులు వాదించారు.

దీంతో ఎవరికైనా ఈ వ్యాధి ఉందో లేదో వైద్యులు కచ్చితంగా నిర్ధారించలేరని జేడ్‌కు అలిసన్ చెప్పారు. అయితే, ఈ కేసులో అయ్యుండొచ్చు.. అనే వాదనతో దోషిగా నిర్ధరణ కాకుండా తప్పించుకోవచ్చని ఆమె కూడా వివరించారు.

''దీని వల్ల కొందరు దోషులు కూడా తప్పించుకునే అవకాశముందా? అవును ఉంటుంది. ఇక్కడ కొన్ని తీవ్రమైన నేరాల్లోనూ కొందరిని దోషులుగా నిర్ధారిస్తుంటాం. నిజానికి వారు ఆ పనులు చేసుండరు. అయితే, ఈ అంశాల్లో నిజానిజాలను కోర్టులే తేల్చాల్సి ఉంటుంది’’అని అలిసన్ చెప్పారు.

ఆమెకు న్యాయం జరుగుతుందా?

సెక్సోమ్నియాతోపాటు ఇతర స్లీప్ వాకింగ్ కేసులను కోర్టులో లోతుగా విచారించి నిజానిజాలు తేల్చుకోవాలని సీపీఎస్ మార్గదర్శకాలు చెబుతున్నాయి.

కానీ, జేడ్ కేసు కోర్టు వరకు వెళ్లలేదు. అయితే, తను చేపట్టిన పరిశోధనతో ఆమె సీపీఎస్ నిర్ణయాన్ని సవాల్ చేశారు.

ఆమె సమర్పించిన పరిశోధనలు, నివేదికలను మరో చీఫ్ క్రౌన్ ప్రాసిక్యూటర్ సమీక్షించారు. దీంతో ఈ కేసుపై విచారణ కొనసాగాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు. స్లీప్ ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయాలు, నిందితుడి న్యాయవాది వాదనపై కోర్టు విచారించాలని ఆయన స్పష్టంచేశారు.

బహుశా జ్యూరీ ఆయనను దోషిగా నిర్ధారించకపోవచ్చు. కానీ, దానిపై విచారణ మాత్రం జరగాలని ప్రాసిక్యూటర్ అభిప్రాయపడ్డారు.

''మీరు ఎంత వేదన అనుభవించారో, ఎలా ఫీలయ్యారో తలచుకుంటే చాలా బాధగా అనిపిస్తోంది’’అని ఆయన చెప్పారు. సీపీఎస్ తరఫున ఆయన క్షమాపణలు చెప్పారు.

''నాకు న్యాయం జరుగుతుందని అనుకోవడం లేదు. కానీ, ఇలాంటి కేసుల్లో ఎలా ముందుకు వెళ్లాలో సీపీఎస్‌కు ఈ కేసుతో కొంత అవగాహన వస్తుంది’’అని జేడ్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Sexsomnia: What is this disease of having sex in sleep? Can the rape case be dismissed by showing this as a reason?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X