Maharashtra: ముంచుకొస్తున్న రాష్ట్రపతి పాలన-తేలని మహా సీఎం -తెరపైకి బీహార్ ఫార్ములా
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన మహా వికాస్ అఘాడీ కష్టాలు ఒకలా ఉంటే ఘన విజయం సాధించిన మహాయుతి కష్టాలు మరోలా ఉన్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీ గడువు రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై మహాయుతి కూటమిలో ఏకాభిప్రాయం కుదరడం లేదు. దీంతో ఈ పంచాయతీ కాస్తా ఢిల్లీకి మారిపోయింది. అయినా అక్కడా అదే పరిస్ధితి. మా పాలన వల్లే కూటమి గెలిచిందని షిండే వర్గం చెప్తుంటే.. మాకే ఎక్కువ సీట్లు వచ్చాయని బీజేపీ చెబుతోంది. దీంతో ఏక్ నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్ మధ్య సిఎం సీటు పోరు ముదురుతోంది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినవి 60 సీట్లే అయినా గత ప్రభుత్వాన్ని సమర్ధంగా నడిపిన అనుభవంతో మరోసారి తమకే సీఎం పోస్టు ఇవ్వాలని శివసేన కోరుతోంది. ఇందుకోసం బీహార్ ఫార్ములాను కూడా తెరపైకి తెస్తోంది. బీహార్ లో బీజేపీకే ఎక్కువ సీట్లు ఉన్నా జేడీయూ నేత నితీశ్ కుమార్ నే బీజేపీ ఎప్పటి నుంచో సీఎంగా కొనసాగిస్తోంది. ఇప్పుడు మహారాష్ట్రలోనూ సీట్లతో సంబంధం లేకుండా సీఎం పోస్టు తమ నేత షిండేకే ఇవ్వాలని శివసేన పట్టుబడుతోంది.

మరోవైపు బీజేపీ మాత్రం ఈసారి ఎన్నికల్లో తమకు ప్రజలు అత్యధిక సీట్లు ఇచ్చారని, అలాగే గతంలో షిండేను మూడేళ్ల పాటు సీఎంగా కొనసాగించామని గుర్తు చేస్తోంది. మరోవైపు మహాయుతిలో మరో మిత్రపక్షం అజిత్ పవార్ నుంచి కూడా ఫడ్నవీస్ కు మద్దతు లభిస్తోంది. దీంతో ఫడ్నవీస్ సీఎం కావడం లాంఛనమే అన్న చర్చ జరుగుతోంది. రేపటితో అసెంబ్లీ గడువు ముగియనున్న నేపథ్యంలో ఇవాళ రాత్రికి ఏదో ఒకటి తేల్చుకుని రేపు ప్రభుత్వ ఏర్పాటు కార్యక్రమం నిర్వహించక తప్పని పరిస్ధితి. ఇంకా ఆలస్యమైతే మాత్రం రాష్ట్రపతి పాలన విధించాల్సి వస్తుంది.












Click it and Unblock the Notifications