కోల్‌కత్తా వైద్యురాలి హత్యాచారం కేసు.. బీజేపీ మాజీ ఎంపీకి సమన్లు, కీలకంగా దర్యాప్తు!
కోల్‌కత్తా వైద్యురాలిపై హత్యాచారం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మరోమారు విచారణకు రావాలంటూ ఆర్జి కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ కు సిబిఐ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈరోజు మళ్లీ ఆయనను విచారిస్తున్న సిబిఐ అధికారులు ఈ కేసులో ఆయనను పదేపదే విచారించటం ఉత్కంఠను రేకెత్తిస్తుంది.
ఆర్జి కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ను విచారిస్తున్న సీబీఐ
ఇప్పటికే కోల్కత్తా వైద్యురాలిపై హత్యాచారం కేసులో 20 మందిని విచారించారు సీబీఐ అధికారులు . ఈ కేసులో ఇప్పటికే ఆగస్టు 16వ తేదీన 15 గంటల పాటు, ఆగస్టు 17వ తేదీన 13 గంటల పాటు ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ను సిబిఐ ప్రశ్నించింది. మళ్లీ ఈరోజు ఉదయం 11 గంటల నుంచి ఆయనను సిబిఐ ప్రశ్నిస్తోంది. వరుసగా మూడో రోజు ఆయనను విచారిస్తుంది.

మరింత లోతుగా దర్యాప్తు
హత్యాచారం జరిగిన తర్వాత ఘోష్ కు ఎలా తెలిసింది? ఆపై ఆయన ప్రతిస్పందన ఏమిటి? విషాదానికి సంబంధించి కుటుంబానికి, అధికారులకు ఎవరు తెలియజేశారు? ఎలా తెలియజేశారు? వంటి విషయాలపైన సిబిఐ దృష్టిసారించింది. ఈ క్రమంలోనే నేడు మరో మారు ఆయనను విచారిస్తుంది. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి వైద్యులు పోలీసులతో సహా మొత్తం 40 మందిని ప్రశ్నించాలని భావించి సిబిఐ మరింత లోతుగా విచారణ జరుగుతుంది.
బీజేపీ మాజీ ఎంపీకి సమన్లు
సందీప్ ఘోష్ ఫోన్ కాల్స్ వివరాలను, ఆయన మొబైల్ డేటా వివరాలను తీసుకోవడానికి మొబైల్ ఫోన్ సర్వీస్ ప్రొవైడర్ ను కూడా సంప్రదించాలని సిబిఐ అధికారులు భావిస్తున్నారని సమాచారం. ఇదిలా ఉంటే బాధితురాలి గుర్తింపును వెల్లడించినందుకు బిజెపి మాజీ ఎంపీ తో పాటు కొందరు ప్రముఖ వైద్యులకు పోలీసులు సమన్లు జారీ చేశారు.
కొందరు వైద్యులకు సమన్లు
ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ లో అత్యాచారం మరియు హత్యకు గురైన మహిళ వైద్యురాలి గుర్తింపును వెల్లడించినందుకు బిజెపి మాజీ ఎంపీ లాకెట్ చటర్జీ మరియు ఇద్దరు ప్రముఖ వైద్యులకు కలకత్తా పోలీసులు సమన్లు జారీ చేశారు. ఈ ఘటనపై తప్పుడు సమాచారం ప్రచారం చేసినందుకు ఈ ముగ్గురు వ్యక్తులతో పాటు మరో 57 మందికి కూడా పోలీసులు నోటీసులు ఇచ్చినట్టు సమాచారం. మొత్తానికి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో తాజాగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.












Click it and Unblock the Notifications