లంచం కేసు: టీవీ చానెల్ రిపోర్టర్‌తో సహా ఇద్దరి అరెస్టు
బెంగళూరు: కర్ణాటక లోకాయుక్త లో అవినీతి జరిగిందని, రూ. కోటి లంచం డిమాండ్ చేశారని నమోదు చేసిన కేసులో అరెస్టుల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికే తెలంగాణలోని వరంగల్ కు చెందిన అశోక్ కుమార్ ను ప్రత్యేక బృందం పోలీసులు అరెస్టు చేశారు.
అశోక్ కుమార్ ఇచ్చిన సమాచారం మేరకు ఒక టీవీ చానెల్ రిపోర్టర్, సమాచార హక్కు చట్టం కార్యకర్త (ఆర్ టీఐ)ని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. శ్రీనివాస్ గౌడ, శంకర్ గౌడ అనే ఇద్దరిని అరెస్టు చేసి న్యాయస్ధానం ముందు హాజరు పరిచి అదుపులోకి తీసుకున్నామని సిట్ అధికారులు తెలిపారు.
వీరిద్దరు అశోక్ కుమార్ స్నేహితులు. శ్రీనివాస్ గౌడ ఒక ప్రయివేటు టీవీ చానెల్ లో రిపోర్టర్ గా పని చేసేవాడు. అయితే ఇతను కొన్ని రోజుల క్రితమే తన ఉద్యోగానికి రాజీనామా చేశానని చెబుతున్నాడని పోలీసు అధికారులు అంటున్నారు.

తుమకూరుకు చెందిన శంకర్ గౌడ ఆర్ టీఐ కార్యకర్తగా పని చేస్తున్నాడు. అశ్విన్ రావ్ రూ. కోటి లంచం డిమాండ్ చేశాడని, అశోక్ కుమార్ స్నేహితులైన వీరిద్దరు మద్యవర్తులుగా పని చేశారని వెలుగు చూసింది. ఈ కేసులో లోకాయుక్త న్యాయమూర్తి భాస్కర్ రావ్ కుమారుడు అశ్విన్ రావ్ మొదటి ముద్దాయి.
రెండవ ముద్దాయి అశోక్ కుమార్, మూడు, నాలుగవ ముద్దాయిలుగా శ్రీనివాస్ గౌడ, శంకర్ గౌడ పేర్లు నమోదు అయ్యాయి. ఈనెల 25వ తేది లోపు అశ్విన్ రావ్ ఎస్ఐటి అధికారుల ముందు విచారణకు హాజరుకావలసి ఉంది. అశ్విన్ రావ్ ను విచారణ చేసిన తరువాత కేసు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications