సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష విరమణ: కేంద్రం ఇచ్చిన హామీలు: కాక్రోచ్ పార్టీ రియాక్షన్
దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు, విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ ఆమరణ నిరాహార దీక్ష ముగిసింది. మేదాంత ఆసుపత్రిలో గురువారం అర్ధరాత్రి కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ సమక్షంలో దీక్షను విరమించారు. ఆ సమయంలో కేంద్రమంత్రుల వెంట లేహ్ లడఖ్ అపెక్స్ బాడీ సీనియర్ నాయకుల ఉన్నారు. వారి సమక్షంలో వాంగ్‌చుక్ నిమ్మరసాన్ని స్వీకరించారు. దీంతో 26 రోజుల పాటు సాగిన ఆమరణ నిరాహార దీక్షకు తెరపడినట్టయింది.
ఈ దీక్ష విరమణ సమయంలో వాంగ్‌చుక్ భార్య గీతాంజలి ఆంగ్మో కూడా అక్కడే ఉన్నారు. వాంగ్‌చుక్ దీక్ష ముగింపుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. డాక్టర్ల సలహాలను పాటించాలని, సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు. వాంగ్‌చుక్ ఆరోగ్యంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.

జేపీ నడ్డా ఈ సందర్భంగా ప్రభుత్వ నిర్ణయాలను నిరసనకారుల సమక్షంలో చదివి వినిపించారు. దేశ రాజధానిలో జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసనలు తెలిపిన వారిపై, 20న జరిగిన పార్లమెంట్ మార్చ్‌లో పాల్గొన్న ఉద్యమకారులపై ఎలాంటి చట్టపరమైన కేసులు నమోదు చేయబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. వివాదాస్పద నీట్ పేపర్ లీకేజీల అంశంపై పార్లమెంట్‌లో పూర్తిస్థాయి చర్చ జరపడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపింది.
పరీక్షల నిర్వహణలో సమూల మార్పులు తెచ్చేందుకు వీలుగా విద్యా సంస్కరణలపై పార్లమెంట్‌లో చర్చలు జరిపడానికి ప్రభుత్వం అంగీకరించిందని నడ్డా పేర్కొన్నారు. దీనితో పాటు.. ఇటీవల జరిగిన నీట్ పేపర్ లీకేజీల వల్ల తీవ్ర మనస్తాపానికి గురై బలవన్మరణాలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు తగిన ఆర్థిక పరిహారం అందించే అంశాన్ని సానుకూలంగా పరిశీలిస్తున్నామని వెల్లడించారు.
Just now in the presence of Union Ministers Sh. JP Nadda, Dr. Jitendra Singh and the senior leaders of Apex Body of Leh Ladakh I finally broke my fast after 26 days. Earlier 65 members of parliament from different political parties had visited or signed letters urging me to break… pic.twitter.com/RFCet7Oksy
— Sonam Wangchuk (@Wangchuk66) July 23, 2026
వివిధ రాజకీయ పార్టీలకు చెందిన 65 మంది ఎంపీలు తనను స్వయంగా కలిసి లేదా లేఖల ద్వారా దీక్షను విరమించాలని కోరారని వాంగ్‌చుక్ ఒక ప్రకటనలో తెలిపారు. సుదీర్ఘమైన చర్చల అనంతరం దేశంలో శాంతిభద్రతల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని దీక్షను ముగించానని ఆయన చెప్పారు. దీనికి సంబంధించిన షరతులపై త్వరలోనే ఒక ప్రత్యేక వీడియో ద్వారా పూర్తి వివరాలు వెల్లడిస్తానని చెబుతూ, ఎక్కడా హింసకు తావు లేకుండా శాంతియుతంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
వాంగ్‌చుక్ తన దీక్షను ముగించడంపై కక్రోచ్ జనతా పార్టీ హర్షం వ్యక్తం చేసింది. సుదీర్ఘకాలం దీక్ష చేసి దేశ ప్రజల మనస్సాక్షిని నిద్రలేపిన వాంగ్‌చుక్ దేశానికి అత్యంత విలువైన వ్యక్తి అని ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ డిప్కే కొనియాడారు. విద్యావ్యవస్థలో అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసేంతవరకు జంతర్ మంతర్ వద్ద తాము చేపట్టిన శాంతియుత నిరసనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.













Click it and Unblock the Notifications