Sonia Gandhi: రాజస్తాన్ నుంచి రాజ్యసభకు సోనియాగాంధీ?
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఈసారి లోక్ సభకు బదులు రాజ్యసభకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకూ రాయ్ బరేలీ నుంచి లోక్ సభకు పోటీ చేస్తూ గెలుస్తున్న సోనియా గాంధీకి తమ రాష్ట్రాల నుంచి పోటీ చేయాలని కర్నాటక, తెలంగాణ వంటి కాంగ్రెస్ పాలిత ప్రభుత్వాల నుంచి ఆఫర్ ఉంది. అయితే ఆరోగ్య కారణాల రీత్యా ఈసారి లోక్ సభకు పోటీ చేసేందుకు ఆమె అనాసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
త్వరలో రాజ్యసభకు ద్వైవార్షిక ఎన్నికలు జరగబోతున్నాయి. వీటిలో కాంగ్రెస్ పార్టీకి రాజస్తాన్ లో లభించే రాజ్యసభ సీట్లలో ఒకటి సోనియా గాంధీకి కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసారి రాజ్యసభ ఎన్నికల్లో సోనియా గాంధీతో పాటు అజయ్ మాకెన్, అభిషేక్ మను సింఘ్వీ, అఖిలేష్ ప్రసాద్ సింగ్ వంటి వారిని ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరిలో ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్న అఖిలేష్ ప్రసాద్ ను ఈసారి బీహార్ నుంచి రాజ్యసభకు పంపే అవకాశముంది.

ఒకట్రెండు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తమ రాజ్యసభ అభ్యర్ధుల జాబితాను ప్రకటించనుంది. ఇందులో సోనియా గాంధీని రాజస్తాన్ నుంచి బరిలోకి దింపే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో కాలుష్యం కారణంగా రాజస్తాన్ రాజధాని జైపూర్ ను తన రెండో విడిదిగా ఎంచుకుంటున్న సోనియా గాంధీ.. ఆ రాష్ట్రం నుంచే రాజ్యసభకు నామినేట్ అయ్యేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.ఈ నెల 27న 15 రాష్ట్రాల్లోని 56 సీట్లకు జరిగే రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకు నామినేషన్లు సమర్పించేందుకు ఈ నెల 15 వరకూ గడువుంది.












Click it and Unblock the Notifications