పుట్టిన గంటలోనే సోనియా గాంధీ మొదటి బిడ్డ మృతి.. నదిలో పడేయాలని.. విషాదకరమైన రహస్యం..
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ పైకి ఎంతో హుందాగా, నిర్మలంగా కనిపిస్తారు. కానీ ఆమె ఎన్నో విషాదాలను దాటుకుని ఈ స్థాయికి చేరారని అతికొద్ది మందికి మాత్రమే తెలుసు. తాజాగా విడుదలైన తన ఆత్మకథ 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్' లో ఎవరికీ తెలియని అనేక సంఘటనలను సోనియా గాంధీ వివరించారు. రాహుల్ గాంధీ కంటే ముందు తనకు ఓ మగబిడ్డ పుట్టినట్టు వెల్లడించారు. అయితే ప్రీ మెచ్యూర్ బేబీ కావడంతో పుట్టిన గంటల వ్యవధిలోనే పసికందు మరణించిందని తీవ్ర ఆవేదనతో తెలిపారు. 1969 లో జరిగిన ఈ ఘటన తన జీవితంలో చెరిగిపోని జ్ఞాపకంగా మిగిలి పోయిందని సోనియా గాంధీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
అది సెప్టెంబర్ 1968.. సోనియా గాంధీ ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేశారు. దాంతో గాంధీ కుటుంబం సంబరాల్లో మునిగిపోయింది. ఎప్పుడూ గంభీరంగా ఉండే తన అత్తమ్మ ఇందిరా గాంధీ కూడా చాలా సంబరపడిపోయారు. తనను దగ్గరకు తీసుకుని ఈ పెద్ద పాప.. మరో చిన్న పాపకు జన్మనివ్వబోతుందని ఆనందం వ్యక్తం చేశారు. కానీ ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. జనవరి 18, 1969 న సోనియాగాంధీ ఓ ప్రీ మెచ్యూర్ బేబీకి జన్మనిచ్చారు. డెలివరీ అవ్వాల్సిన రెండు నెలల ముందే ఆ బాబు పుట్టాడు. అయితే బిడ్డ పుట్టినప్పుడు గాంధీ ఫ్యామిలీలో పండగ వాతావరణం నెలకొంది. కానీ గంటల వ్యవధిలోనే విషాదం నెలకొంది. ఆ పసికందు మృతి చెందింది.
" బేబీ పుట్టగానే ఇంకుబేటర్ లో పెట్టారు. పసికందు ఫస్ట్ క్రై నేను విన్నాను. ఆ తర్వాత రాజీవ్ నన్ను బిడ్డ దగ్గరకు తీసుకెళ్లారు. ఆ బాబు పూర్తి రూపంలో నల్లని చిన్న జుట్టు.. సన్నని చేతులతో ఉన్నాడు. మేమిద్దరం బాబును దగ్గరకు తీసుకున్నాం. చంటిబిడ్డతో మేము వెంటనే ప్రేమలో పడిపోయాం" అని సోనియా గాంధీ తన ఆత్మకథలో భావోద్వేగంగా రాసుకొచ్చారు. కానీ ఆ తర్వాత కొద్ది సేపటికే పసిబిడ్డ ప్రాణాలు కోల్పోయింది. " ఈ విషయాన్ని నాకు రాజీవ్ వచ్చి చెప్పారు. నో.. అది జరగదు.. ఎందుకు.. ఎందుకు.. అని నేను అడుగుతూనే ఉన్నాను. ఆ తర్వాత క్షణాల్లోనే ఇద్దరం బోరున విలపించాం. మా గుండెలు పగిలేలా రోదించాం. ఆ సమయంలో ఇందిరా గాంధీ టూర్ లో ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే పర్యటనను రద్దు చేసుకుని ఆస్పత్రికి పరుగున వచ్చారు.
" ఆమె అప్పటికే ఏడుస్తూ కళ్లు ఎర్రబడ్డాయి. మాతో చాలా సమయం వరకు కూర్చొన్నారు. మాతోనే ఉండాలని ఆమె కోరుకుంటున్నట్లు చెప్పారు. కానీ పర్యటన షెడ్యూల్ కారణంగా మరుసటి రోజు ఉదయం గుండె నిండా బాధతో వెనుదిరిగారు. పసిబిడ్డ మరణం మిమ్మల్ని తీవ్రంగా కలిచి వేసింది" అని సోనియా గాంధీ గుర్తు చేసుకున్నారు. ఇక చనిపోయిన ఆ పసిబిడ్డకు అంత్యక్రియలు చేయడంపైనా చర్చలు జరిగాయి. సోనియాగాంధీ తెలిపిన వివరాల ప్రకారం అప్పుడే పుట్టి చనిపోయిన బిడ్డను హిందూ సంప్రదాయాల ప్రకారం పూడ్చిపెట్టరు. నదిలో పడేస్తారు. కానీ అందుకు తాను ససేమిరా అన్నట్లు సోనియాగాంధీ గుర్తు చేసుకున్నారు.
" ఏదేమైనా నా బిడ్డ మృతదేహాన్ని నదిలో పడేయడానికి నేను ఒప్పుకోను. నా బేబీకి నేను అలాంటి పని చేయలేను. నదిలో పడేయడం ఆచారం అయినా నేను అలా చేయలేను. నా బిడ్డ పట్ల నేను అలా ఏలియన్ లా.. హృదయం లేని దానిలా ఎలా చేయగలను" అని భావోద్వేగంతో చెప్పినట్లు సోనియాగాంధీ రాసుకొచ్చారు. ఆ తర్వాత ఆ పసిబిడ్డ మృత దేహాన్ని రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ కలిసి మెహ్రౌలీ లోని వారి కుటుంబ ఫామ్ హౌస్ లో ఓ చెట్టు కింద లోతైన గుంటలో శిశువును ఖననం చేసినట్లు తెలిపారని సోనియా వివరించారు. అంతేకాక చాలాకాలం పాటు.. తాను, రాజీవ్ ఆ బిడ్డను ఖననం చేసిన చోట ప్రతిసారీ ఒక పువ్వును ఉంచేవారమని పేర్కొన్నారు. కాలం గడుస్తున్న కొద్దీ ఆ జ్ఞాపకాల నుంచి మెల్లమెల్లగా బయటపడినట్లు స్పష్టం చేశారు.

ఇక అదే ఏడాది అక్టోబర్ లో తాను మరోసారి గర్భం దాల్చానని ఆ సమయంలో తన అత్తగారు ఇందిరాగాంధీ తనను ఎంతో కేరింగ్ గా చూసుకున్నారని గుర్తుచేసుకున్నారు. డైట్, వ్యాయామంపై మెలకువలు చెప్పేవారని అన్నారు. అలా జూన్ 19, 1970 న రాహుల్ గాంధీకి జన్మనిచ్చినట్లు సోనియాగాంధీ తన ఆత్మకథ 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్' లో వెల్లడించారు.












Click it and Unblock the Notifications
