Oil Prices: ఒక్క మాటతో చమురు ధరల్ని నేలకు దించిన ట్రంప్..!
అమెరికా-ఇరాన్ యుద్దం కారణంగా గత కొన్ని నెలలుగా చమురు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరితే చమురు ధరలు (Oil Prices) తగ్గుతాయని ప్రపంచ దేశాలు ఎదురుచూస్తున్నాయి. అయితే అది మాత్రం సాధ్యం కాలేదు. ఇలాంటి సమయంలో అమెరికా మధ్యంతర ఎన్నికలు రావడం, అందులో ట్రంప్ పార్టీ రిపబ్లికన్లు చిత్తుగా ఓటమి పాలవ్వడంతో పరిస్దితులు ఒక్కసారిగా మారిపోయాయి. దీంతో ఇరాన్ వార్ విషయంలో ట్రంప్ రూటుమార్చారు.
మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ల ఓటమికి ఇరాన్ వార్ కూడా కారణమంటూ ఇప్పటికే అంగీకరించిన ట్రంప్.. ఇవాళ మరో అడుగు ముందుకేసి ఇకపై ఇరాన్ పై దాడులు ఉండకపోవచ్చంటూ మరో ప్రకటన చేశారు. దీంతో ఒక్కసారిగా అంతర్జాతీయ చమురు ధరలు క్షీణించాయి. ఏకంగా మూడు నెలల కనిష్టానికి దిగజారి బ్యారెల్ కు 90 డాలర్లకు పడిపోయాయి. ఇవాళ్టి ట్రేడింగ్ లో బ్రెంట్ క్రూడ్ ధర 3.3 శాతం తగ్గింది. ట్రంప్ ప్రకటనతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు సద్దుమణగవచ్చని భావించిన ట్రేడర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. దీంతో చమురు ధరలు తగ్గుతున్నాయి.

అంతకు ముందు ఇరాన్ లో దాడుల కొనసాగింపుపై ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఓవైపు ఇజ్రాయెల్ ఎన్నికల్లో ఇరాన్ వార్ నడిపిన నెతన్యాహు ఓటమి పాలవ్వడం, అమెరికా మధ్యంతర ఎన్నికల్లో తన పార్టీ ఓడిపోవడంతో దాడులపై ట్రంప్ వెనక్కి తగ్గారు. ఇరాన్ సైన్యం పూర్తిగా నిర్వీర్యం అయిపోయందంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు. అందుకే తాము యథాతథ స్దితిని కొనసాగించాలని భావిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఆ దేశంలో దాడుల అవసరం ఇక ఉండకపోవచ్చన్నారు. అయితే ఇరాన్ అణుకార్యక్రమం కొనసాగించకుండా దీర్ఘకాల ఒప్పందం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఏ కారణం వల్లనైనా పరిస్దితులు మారితే మాత్రం దాడులకు సిద్దంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రకటనే చమురు ధరల పతనానికి కారణమైంది. అయితే భారత్ లో మాత్రం ఇప్పుడే ధరలు తగ్గే పరిస్దితులు కనిపించడం లేదు.













Click it and Unblock the Notifications
