ఎస్ఐ చెంప చెడేల్మనిపించిన యువకుడు.. అతడి మేనమామ ఎమ్మెల్సీ మరి!
పోలీసుస్టేషన్ కు తనను పిలిపించినందుకు ఓ యువకుడికి ఎక్కడలేని కోపం వచ్చింది. ఆ కోపంలో అతడు ‘నేనెవరో తెలుసా..’ అంటూ అక్కడున్న ఎస్సైని లాగిపెట్టి చెంపమీద కొట్టాడు.
ఉత్తరప్రదేశ్: ఓ యువకుడు పోలీసుస్టేషన్ లోకి వచ్చాడు. నేరుగా అక్కడున్న ఎస్సై వద్దకు వెళ్లాడు. 'నా పేరు మోహిత్ యాదవ్..' అని చెబుతూ లాగిపెట్టి ఎస్సై చెంప మీద కొట్టాడు. అంతటితో ఆగలేదతడు, తన మేనమామ పేరు చెబుతూ ఇంకా రెచ్చిపోయాడు.
ఎందుకంటే అతడి మేనమామ ఎమ్మెల్సీ మరి! ఉత్తరప్రదేశ్‌లోని ఇటా నియోజకవర్గానికి చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్సీ అల్లుడు మోహిత్ యాదవ్ దుశ్చర్య ఇది. అప్పటికే అతడు ఫుల్లుగా తాగేసి ఉన్నాడు. తనను స్టేషన్‌కు పిలిపించినందుకు అతడికి ఎక్కడలేని కోపం వచ్చింది. దాంతో ఎస్ఐ జితేంద్ర కుమార్‌ను లాగి ఒక్కటిచ్చాడు.

ఈ ఘటనతో పోలీసుస్టేషన్ లో ఉన్న వాళ్లందరూ అవాక్కయ్యారు. మిగిలిన పోలీసులు మోహిత్ యాదవ్ ను పట్టుకుని ఆపేందుకు ప్రయత్నించగా, అతడు వాళ్లలో ఒకరి కాలర్ పట్టుకున్నాడు. ఆ తరువాత పోలీసు అధికారుల విధి నిర్వహణను అడ్డుకున్నందుకు అతడ్ని అరెస్టు చేశారు లెండి.. అది వేరే విషయం.
మోహిత్ యాదవ్ మామ రమేష్ యాదవ్ సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నాయకుడు, ప్రస్తుతం ఎమ్మెల్సీ. యూపీ ఎన్నికల సమయంలో ఆయనను బీజేపీ తమ పార్టీ నుంచి తప్పించింది. అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఇలాంటి ఘటనలు చాలావరకు జరిగాయి.
యూపీలో రాజకీయ నాయకులు, వాళ్ల బంధువులు పలువురు అధికారుల మీద దాడులు చేసేవారు. అయితే కొత్తగా అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాత్రం ఇలా ఎవరైనా చట్టాలను ఉల్లంఘిస్తే ఊరుకునేది లేదని స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు.
ఇక మోహిత్ యాదవ్ విషయానికొస్తే.. అతడు నిరుద్యోగి. వాళ్ల నాన్నకు తుపాకుల దుకాణం ఉంది. మోహిత్ పొద్దున్న ఓ ఆసుపత్రికి వెళ్లి, తన బంధువుకు ఎక్స్‌రే తీయించుకోడానికి వీఐపీ ట్రీట్‌మెంట్ కావాలని డిమాండ్ చేశాడు. వాళ్లను వెంటనే చూడాలని, క్యూలో వేచి ఉండేది లేదన్నాడు.
అలా కుదరదని అక్కడి సిబ్బంది చెప్పడంతో అక్కడున్న ల్యాబ్ టెక్నీషియన్‌ను కొట్టడంతో పాటు డాక్టర్ మీద కూడా దాడి చేశాడు. దీంతో సదరు ఆసుపత్రి వర్గాలు పోలీసులకు చెప్పడంతో వాళ్లొచ్చి అతడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు స్టేషన్కు తరలించారు.
అయితే తన మేనమామ అండ చూసుకుని అతడు పోలీసుస్టేషన్ లో కూడా అదే ధిక్కారం ప్రదర్శించడంతో పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. ఆ సమయంలో మోహిత్ యాదవ్ బాగా తాగి ఉన్నట్లు తెలుస్తోందని సీనియర్ పోలీసు అధికారి సత్యార్థ్ అనిరుథ్ పంకజ్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications