భద్రాచలం: ఆ మండలాలు సీమాంధ్రకే, జైపాల్ అసహనం
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లు చట్టరూపం దాల్చిన మరుసటి రోజే కేంద్ర ప్రభుత్వం దానికి రెండు సవరణలు ప్రతిపాదించింది. వాటితో పాటు సీమాంధ్రకు ప్రత్యేక కేటగిరీ హోదా కల్పిస్తూ ఇచ్చిన హామీ అమలును తక్షణం మొదలు పెట్టాలని మంత్రివర్గం ప్రణాళికా సంఘాన్ని నిర్దేశించింది. ఆదివారం కేంద్రమంత్రి జైరామ్ రమేష్ విలేకరులతో మాట్లాడారు. ఎపి పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై మూడు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు.
సీమాంధ్రకు ఐదేళ్ల పాటు ప్రత్యేక కేటగరీ హోదా కల్పించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆమలు చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు ప్రణాళికా సంఘాన్ని ఆదేశించినట్లు జైరాం తెలిపారు. సీమాంధ్రకు ప్రత్యేక హోదాపై పరిపాలనా విభాగమైన ప్రణాళికా సంఘాన్ని ఆదేశించినట్లు ఆయన స్పష్టం చేశారు. ప్రణాళికా సంఘం ద్వారానే కేంద్ర సహాయం అందించగలమని తెలిపారు.
ఇక పోలవరం, విద్యుత్ కేటాయింపులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి రెండు సవరణలను చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. పోలవరం విషయంలో పునరావాస కార్యక్రమాలు సాఫీగా సాగడానికి వీలుగా ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను సీమాంధ్రకు బదిలీ చేయాలని కేబినెట్ నిర్ణయించినట్లు వెల్లడించారు.

ఈ సవరణ ప్రకారం పాల్వంచ రెవిన్యూ డివిజన్‌లో కుకునూరు, వేలేరుపాడు మండలాలతో పాటు, బూర్గంపహాడు మండలంలోని పినపాక, మొరంపల్లి, మోతపత్తి నగర్, బూర్గంపాడు, నాగేనిప్రోలు, కృష్ణసాగర్, టేకుల, సరపాక, ఇరవెండి, మోతపత్తినగర్, ఉప్పుసాక, నక్రీంపేట, సోంపల్లి రెవెన్యూ గ్రామాలు మినహా మొత్తం మండలం కూడా సీమాంధ్రలో కలుస్తుంది. అలాగే చింతూరు, కూనవరం, వీఆర్ పురం, భద్రాచలం మండలాలు కూడా కలుస్తాయి.
భద్రాచలం రెవెన్యూ గ్రామం మాత్రం తెలంగాణలోనే ఉంటుంది. భద్రాచలం పట్టణం, రాములవారి ఆలయం తెలంగాణలోనే ఉంటాయని జైరాం స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టును అమలు చేయడానికి, సహాయ పునరావాస కార్యక్రమాలను సాఫీగా అమలు చేసేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించారు. బాధితులకు ఒకే రెవెన్యూ డివిజన్‌లో భూమికి బదులు భూమిని కేటాయించేందు కోసమే ఈ నిర్ణయం అవసరమైందన్నారు.
ఇక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి విద్యుత్ కేటాయింపులకు సంబంధించి బిల్లులో అస్పష్టతను దూరం చేసేందుకు మరో సవరణచేయాల్సి వచ్చిందన్నారు. గాడ్గిల్ ఫార్ములాను అనుసరించి కేంద్ర విద్యుత్ సంస్థల నుంచి ఇరు రాష్ట్రాలకూ జనాభా ప్రాతిపదికన 85 శాతం విద్యుత్ కేటాయింపులు జరుగుతాయని, మిగతా 15 శాతాన్ని మాత్రం గత 5 ఏళ్లలో ఇరు ప్రాంతాల విద్యుత్ వినియోగం ప్రాతిపదికగా కేటాయిస్తారని ఆయన వివరించారు.
విభజన బిల్లుకు కేబినెట్ చేసిన సవరణలను ఆమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ రెండింటిపై ఆర్డినెన్స్‌లు జారీ చేయడానికి సంబంధించి రాష్ట్రపతి కార్యాలయం చర్యలు తీసుకుంటుందన్నారు. కానీ ఆర్డినెన్స్‌లను కచ్చితంగా జారీ చేసే విషయంపై ఆయన స్పష్టత నివ్వలేదు.
సీమాంధ్ర రాజధానిని నిర్ణయించేందుకు ఒకటి రెండు రోజుల్లో కమిటీ ఏర్పాటవుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ఉద్యోగుల పంపిణీకి సంబంధించి కేంద్ర సిబ్బంది శాఖ నియమించిన రెండు కమిటీలు సోమవారం నుంచి పని ప్రారంభిస్తాయన్నారు. నోటిఫికేషన్ జారీ అయినందున ఉద్యోగుల పంపిణీ, ఇతర నిర్ణయాల అమలును బట్టి రాష్ట్ర ఆవిర్భావదినం ఉంటుందన్నారు.
కాగా, ఖమ్మం జిల్లాలోని కుకునూరు, వేలేరుపాడు, చింతూరు, కూనవరం, వీఆర్ పురం మండలాలతో పాటు బూర్గంపాడు మండలంలోని పినపాక, మొరంపల్లి, మోతపత్తి నగర్, బూర్గంపాడు, నాగేనిప్రోలు, కృష్ణసాగర్, టేకుల, సరపాక, ఇరవెండి, మోతపత్తినగర్, ఉప్పుసాక, నక్రీంపేట, సోంపల్లి రెవెన్యూ గ్రామాలు మినహా మొత్తం మండలం, భద్రాచలం మండలంలో భద్రాచలం రెవెన్యూ గ్రామం మినహా మొత్తం మండలాన్ని సీమాంధ్రలో కలపాలన్న సవరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
జైపాల్ అసంతృప్తి
పోలవరం ప్రాజెక్టు కోసం మరిన్ని గ్రామాలను సీమాంధ్రకు బదిలీ చేయడంపై కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి కేబినెట్ సమావేశంలో తీవ్ర నిరసన తెలిపారు. గిరిజనుల ప్రయోజనాలను విస్మరించి మరిన్ని గ్రామాలను సీమాంధ్రలో కలపడం సరికాదన్నారు. పార్లమెంట్ చట్టం చేసిన తర్వాత సవరణ ఎందుకు చేస్తారని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications