కాషాయం కప్పుకొన్న కామాంధుడివిరా నువ్వు..: 17 మందితో
ఢిల్లీ వసంత్ కుంజ్ ప్రాంతంలో శ్రీ శారదా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్‌మెంట్-రీసెర్చ్ డైరెక్టర్ స్వామి చైతన్యానంద సరస్వతిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈడబ్ల్యూఎస్ స్కాలర్‌షిప్‌ల కింద మేనేజ్‌మెంట్ డిప్లొమా కోర్సులు చేస్తున్న 17 మందికి పైగా విద్యార్థినులు ఆయనపై ఫిర్యాదు చేశారు. వారి వాంగ్మూలాల ఆధారంగా వసంత్ కుంజ్ నార్త్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ప్రతిష్ఠాత్మక శృంగేరి మఠం ఆధీనంలో నడిచే ఇన్‌స్టిట్యూట్ ఇది.
ఈ ఆరోపణలు ఆశ్రమంలో తీవ్ర కలకలం రేపాయి. ప్రస్తుతం స్వామి చైతన్యానంద సరస్వతి పరారీలో ఉన్నారు. ఆయన కోసం పోలీసులు గాలిస్తోన్నారు. ప్రత్యేకంగా సెర్చ్ టీమ్ లను ఏర్పాటు చేశారు. చివరిసారిగా ఆగ్రాలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదైన వెంటనే శృంగేరి మఠం ఆయనను డైరెక్టర్ పదవి నుంచి తొలగించింది. ఆయనతో తమకు ఎటువంటి సంబంధం లేదని తెలిపింది. దర్యాప్తులో పోలీసులకు పూర్తిస్థాయిలో సహకరిస్తామని పేర్కొంది.

స్వామి చైతన్యనంద సరస్వతి.. అసలు పేరు స్వామి పార్థసారథి. ఆయన స్వరాష్ట్రం ఒడిశా. గత 12 సంవత్సరాలుగా ఆశ్రమంలోనే నివసిస్తున్నాడు. ఆశ్రమంలో నిర్వాహకుడిగా, సంరక్షకుడిగా కూడా వ్యవహరించాడు. అసభ్యకరమైన వాట్సాప్, టెక్స్ట్ మెసేజ్ పంపించేవాడని, ఎక్కడపడితే అక్కడ చేతులు వేసేవాడని శ్రీ శారదా ఇన్‌స్టిట్యూట్ లో ఈడబ్ల్యూఎస్ స్కాలర్‌షిప్‌లపై పోస్ట్-గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ (PGDM) కోర్సులు చేస్తోన్న విద్యార్థినులకు లిఖితపూరకంగా ఫిర్యాదులు అందాయి.
బ్లాక్‌మెయిల్ చేసి బెదిరించాడని బాధిత విద్యార్థినులు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ముగ్గురు మహిళా అధ్యాపకులు, నిర్వాహకులకు తెలియజేయగా.. వాళ్లు కూడా చైతన్యానంద సరస్వతికి వత్తాసు పలికారని, ఆయన కోరిక తీర్చాలని తమను ఒత్తిడి చేశారని ఆరోపించారు. దీనిపై పోలీసులకు లిఖితపూరకంగా ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే విచారణ చేపట్టారు. ఆ ముగ్గురు మహిళా అధ్యాపకులను అదుపులోకి తీసుకున్నారు. సంఘటన జరిగిన ప్రదేశానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఆశ్రమం హార్డ్‌డిస్క్‌లు, వీడియో రికార్డర్‌ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపారు. శ్రీ శారదా ఇన్‌స్టిట్యూట్ బేస్‌మెంట్‌లో ఓ నకిలీ యూఎన్ నంబర్ ప్లేట్‌తో ఉన్న వోల్వో కారును గుర్తించారు. ఆ కారు స్వామి చైతన్యనంద సరస్వతి ఉపయోగించినట్లు తేలింది. అతనికి ఆ నంబర్ ప్లేట్ ఎలా వచ్చిందనే విషయంపై విచారణ జరుగుతోంది.
ఆయనపై లైంగిక వేధింపులు, ఇతర నేరారోపణలు రావడం ఇదే మొదటిసారి కాదు. 2009లో డిఫెన్స్ కాలనీలో మోసం, లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఆ తర్వాత 2016లో వసంత కుంజ్‌లో ఓ మహిళ ఆయనపై ఇటువంటి ఫిర్యాదులే చేశారు. ఆరోపణల అనంతరం ఆశ్రమం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆయనను డైరెక్టర్ పదవి నుంచి తొలగించింది. ఆయనతో తమకు ఎటువంటి సంబంధం లేదని తెలిపింది.












Click it and Unblock the Notifications