బెంగళూరులో రోడ్డుపై తొక్కిసలాట-స్టేడియంలో సంబరాలు-బీసీసీఐ రియాక్షన్..!
నిన్న అహ్మదాబాద్ లో జరిగిన ఐపీఎల్ ఫైనల్లో పంజాబ్ కింగ్స్ పై గెలిచి 18 ఏళ్ల టైటిల్ కల నెరవేర్చుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇవాళ బెంగళూరులో భారీ ఎత్తున విజయోత్సవ ర్యాలీ నిర్వహించింది. ఇందులో అవాంఛనీయ ఘటనలు జరిగే అవకాశం ఉందని ముందే గ్రహించిన పోలీసులు పలు ఆంక్షలు విధించారు. అయినా అభిమానులు భారీ ఎత్తున తరలిరావడంతో చివరిగా సంబరాలు జరిగే చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది.
ఇందులో 11 మంది ప్రాణాలు కోల్పోగా 50 మంది వరకూ గాయాలయ్యాయి. అయితే రోడ్డుపై తొక్కిసలాట జరుగుతున్నా పట్టించుకోకుండా ఆర్సీబీ జట్టు చిన్నస్వామి స్టేడియంలో సంబరాలు కొనసాగించడం వివాదాస్పదం అయింది. ఆర్సీబీ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. అభిమానుల ప్రాణాల కన్నా సంబరాలు ముఖ్యమయ్యాయా అంటూ సోషల్ మీడియాలో ఆర్సీబీని నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ క్షమాపణలు చెప్పారు. ఇప్పటికే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని సీఎం సిద్ధరామయ్యతో కలిసి ఆయన పరామర్శించారు.

మరోవైపు ఈ ఘటనపై బీసీసీఐ స్పందించింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో బీసీసీఐ పాత్ర లేదని బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా స్పష్టం చేశారు. అయితే భవిష్యత్తులో ఇటువంటి వేడుకలకు మార్గదర్శకాలను రూపొందించడాన్ని బోర్డు పరిశీలిస్తుందని తెలిపారు. ఘటన బాధాకరమని, ఇలాంటి ఈవెంట్ ను ఆర్సీబీ ఫ్రాంచైజీ మరిం మెరుగ్గా ప్లాన్ చేసి ఉండాల్సిందని ఆయన తెలిపారు.
మరోవైపు బెంగళూరు తొక్కిసలాట కర్నాటకలో రాజకీయ రంగు పులుపుకుంటోంది. ఈ ఘటనపై ఇప్పటికే ప్రభుత్వం స్పందించి చర్యలు చేపడుతోంది. ఆర్సీబీ ర్యాలీకి వచ్చిన ఫ్యాన్స్ ను నియంత్రించేందుకు 5 వేల మంది పోలీసుల్ని మోహరించినట్లు డిప్యూటీ సీఎం శివకుమార్ తెలిపారు. అయితే విపక్ష బీజేపీ మాత్రం ఇది ప్రభుత్వ వైఫల్యమని విమర్శించింది. తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేస్తోంది.












Click it and Unblock the Notifications