చరిత్రలోనే బలమైన విపక్షంగా ఇండీ కూటమి-235 సీట్లలో ఆధిక్యం-240కి పడిపోయిన బీజేపీ..!
ఈసారి లోక్ సభ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి దూసుకుపోతున్న విపక్ష ఇండియా కూటమి.. యూపీ వంటి కీలక రాష్ట్రాల్లో ఎన్డీయేకు భారీ షాకులిస్తోంది. అంతే కాదు కేంద్రంలో మరోసారి సునాయాసంగా విజయం దక్కుతుందని భావించిన ప్రధాని మోడీ, అమిత్ షా వంటి నేతలకు ఇండీ కూటమి ప్రదర్శన ఝలక్ ఇచ్చింది. దీంతో పాటు కేంద్రంలో అధికారం దక్కినా దక్కున్నా చరిత్రలోనే అత్యంత బలమైన విపక్షంగా మారేందుకు ఇండీ కూటమి సిద్ధమవుతోంది.
నిన్న మొన్నటివరకూ పార్లమెంటులో విపక్షాల్ని లెక్కచేయకుండా పదుల సంఖ్యలో బిల్లుల్ని ఆమోదించుకుంటూ, అడ్డొచ్చిన విపక్ష ఎంపీలను నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేసుకుంటూ పోయిన ఎన్డీయేకు ఓటర్లు భారీ షాకిచ్చారు. ఉత్తరాదిలో హిందూ-ముస్లిం రాజకీయాలతో ఓటు బ్యాంకును పెంచుకుంటూ పోయి మిగతా అన్ని అంశాల్ని పక్కనబెట్టేసిన ఎన్డీయేకు గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. ఒక్క దెబ్బతో కేంద్రంలో పరిస్ధితిని మార్చేశారు.

ఇవాళ వెలువడుతున్న లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయేకు 295 సీట్ల వరకూ ఇచ్చిన ఓటర్లు.. విపక్ష ఇండీ కూటమికి సైతం 235 సీట్ల వరకూ ఇచ్చారు. దీంతో దేశ చరిత్రలోనే అతిపెద్ద విపక్షం అవతరించబోతోంది. అంతే కాదు ఈసారి విపక్షాన్ని లెక్కచేయకుండా కేంద్రం ఏ విషయంలోనూ ముందుకెళ్లలేని పరిస్ధితి ఎదురుకాబోతోంది. పార్లమెంట్ లో మూడింటి రెండొంతుల మెజార్టీ కావాలన్నా విపక్షాన్ని బతిమాలుకోవాల్సిన స్ధితిలోకి ఎన్డీయే వెళ్లిపోయింది. ఈ సునామీలో బీజేపీ కూడా గతంలో సాధించిన 303 సీట్ల నుంచి 340కి పడిపోవడం మరో విషాదం.












Click it and Unblock the Notifications