హోంవర్క్ చేయలేదని.. టీచర్‌పై విద్యార్థి కాల్పులు!
ఉత్తరాఖండ్‌లోని ఉధమ్ సింగ్ నగర్ జిల్లాలోని కాశీపూర్‌లో జరిగిన ఒక దారుణమైన ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. హోంవర్క్ చేయనుందుకు మందలించడంతో ఈ ఘటన జరిగింది. కాశీపూర్‌లోని గురునానక్ స్కూల్‌లో చదువుతున్న 9వ తరగతి విద్యార్థి హోంవర్క్ చేయలేదని మందలించినందుకు ఉపాధ్యాయుడిపై నాటు తుపాకీతో కాల్పులు జరిపాడు.
అసలేం జరిగిందంటే?
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మంగళవారం టీచర్ గగన్ సింగ్ విద్యార్థి హోంవర్క్ చేయనందుకు అతడిని మందలించారు. దీంతో కోపంతో రగిలిపోయిన విద్యార్థి .. మరుసటి రోజు ఒక నాటు తుపాకీతో తిరిగి వచ్చి టీచర్‌పై కాల్పులు జరిపాడు. ఈ ఘటన తరగతి గదిలో భయాందోళనలకు దారి తీసింది.

ఈ కాల్పుల్లో టీచర్ గగన్ సింగ్‌కు భుజంపై బుల్లెట్ గాయమైంది. వెంటనే ఆయనను ప్రైవేట్ ఆస్పత్రికి తలించారు. అదృష్టవశాత్తు ఆయనకు ప్రాణాపాయం లేదని, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని వైద్యులు వెల్లడించారు. కాల్పులు జరిపిన తర్వాత విద్యార్థి వెంటనే పారిపోగా.. పోలీసులు అతడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. విద్యార్థికి తుపాకీ ఎలా లభించింది, ఇలాంటి తీవ్ర చర్యకు అతడిని ఏది ప్రేరేపించిందనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. "మేము ఈ కేసును వివరంగా దర్యాప్తు చేస్తున్నాం. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటాం. ఒక విద్యార్థికి తుపాకీ ఎలా లభించిందో, ఇలాంటి తీవ్రమైన చర్యకు అతడిని ఏది ప్రేరేపించిందో కూడా మేము పరిశోధిస్తున్నాం" అని ఎస్పీ అభయ్ సింగ్ తెలిపారు.
ఈ దారుణ ఘటనపై ఉధమ్ సింగ్ నగర్ అసోసియేషన్ ఆఫ్ ఇండిపెండెంట్ స్కూల్స్ తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. ఈ ఘటనను ఖండిస్తూ, నిందితుడిపై, అతడికి ఆ తుపాకీని అందించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. దీనికి నిరసనగా జిల్లాలోని అన్ని పాఠశాలలకు గురువారం సెలవు ప్రకటించాయి. ఈ ఘటన విద్యార్థులలో పెరుగుతున్న ఆవేశం, అక్రమ ఆయుధాల లభ్యత వంటి సామాజిక సమస్యలను ప్రతిబింబిస్తోంది. ఇది దేశంలో విద్యార్థుల ప్రవర్తన, భద్రతపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.












Click it and Unblock the Notifications