సునంద అప్పుడు మాట్లాడలేదు!: సీనియర్ జర్నలిస్ట్ నళిని విచారణ
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ సతీమణి సునంద పుష్కర్ మృతి కేసులో ప్రత్యేక దర్యాఫ్తు బృందం శుక్రవారం నాడు ప్రముఖ జర్నలిస్ట్ నళినీ సింగ్‌ను విచారించింది. సునంద మృతికి ముందు తనతో ఫోన్ ద్వారా మాట్లాడారని, ఈ నేపథ్యంలో తనను ప్రశ్నించారని నళినీ తెలిపారు.
సునంద పుష్కర్ తనతో ఐపీఎల్ విషయమై మాట్లాడాలనుకుంటున్నానని చెప్పారని నళినీ తెలిపారు. నిందలన్నీ ఆమె తన పైన వేసుకున్నారని అభిప్రాయపడ్డారు. ఈ విషయాలన్ని మీడియాకు చెప్పాలనకుంటున్నారా అని తాను సునందను ప్రశ్నించినప్పుడు.. ఆమె మౌనం దాల్చిందని చెప్పారు.
న్యూఢిల్లీలోని సరోజిని నగర్ పోలీసు స్టేషన్‌లో నళినీ సింగ్‌ను ప్రత్యేక దర్యాఫ్తు బృందం విచారించింది. ఆమెను గంటకు పైగా విచారించింది. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు ప్రేమ్ నాథ్ నేతృత్వంలో ఆమెను విచారించారు.

కాగా, సునంద పుష్కర్ మృతి కేసులో ప్రత్యేక దర్యాఫ్తు సంస్థ గురువారం నాడు పలువురు జర్నలిస్టులను ప్రశ్నించిన విషయం తెలిసిందే. సునంద పుష్కర్ మృతికి ముందు ఏఏ విలేకరులతో మాట్లాడారో.. వారిని విచారించారు.
సునంద పుష్కర్ హత్య కేసు ఇటీవల ముమ్మరం చేసిన విషయం తెలిసిందే.
ఈ కేసును చేధించేందుకు ఢిల్లీ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే సునంద భర్త, కాంగ్రెస్ మాజీ మంత్రి శశిథరూర్‌ను, పలువురిని ప్రశ్నించారు. ఇప్పుడు కొందరు మహిళా, పురుష జర్నలిస్టుల నుంచి వివరాలు సేకరించారు. సునంద పుష్కర్ చనిపోవడానికి ముందు కొందరు మహిళా జర్నలిస్టులతో ఫోన్‌లో మాట్లాడారు.
వారిని ప్రశ్నించడం ద్వారా కీలక విషయాలు రాబట్టాలని పోలీసులు భావిస్తున్నారు. జర్నలిస్టులు చెప్పిన విషయాలతో శశిథరూర్ చెప్పిన వివరాలను పోల్చుకోనున్నారు. మహిళా జర్నలిస్టులతో ఐపీఎల్ విషయం, లేదా పాకిస్తాన్ జర్నలిస్ట్ మెహర్ తరర్ విషయాలు ఏమైనా చెప్పారా అని ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం.












Click it and Unblock the Notifications