Adani Group: అదానీ గ్రూప్ అక్రమాలపై ఆధారాలేవీ..? సుప్రీంకోర్టు ప్రశ్న..
గతంలో జర్మనీకి చెందిన హిండెన్ బర్గ్ సంస్ధ భారత్ లో పారిశ్రామిక దిగ్గజం అదానీ గ్రూప్ ఆర్ధిక అక్రమాలకు పాల్పడిందన్న ఆరోపణలు చేసింది. దీంతో అదానీ గ్రూపు షేర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఆ తర్వాత కోలుకున్నా తిరిగి ఆ స్ధాయిలో వెళ్లేందుకు అదానీ గ్రూప్ అపసోపాలు పడుతోంది. ఈ నేపథ్యంలో అదానీ గ్రూప్ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ చేస్తున్న సుప్రీంకోర్టు ఇవాళ కీలక ప్రశ్న వేసింది.
హిండెన్ బర్గ్ రిపోర్ట్ మినహా అదానీ గ్రూప్ అక్రమాలపై ఆధారాలేవైనా ఉన్నాయా అని సుప్రీంకోర్టు ఇవాళ పిటిషనర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ ను ప్రశ్నించింది. హిండెన్ బర్గ్ నివేదికను తాను తప్పుబట్టడం లేదని, కానీ ఆధారాలు కావాలి కదా అని ప్రశ్నించింది. అలాగే ఓ విదేశీ నివేదికపై ఆధారపడి ఇంత పెద్ద సంస్ధపై చర్యలు తీసుకోలేం కదా అని పరోక్షంగా పిటిషనర్ ను ప్రశ్నించింది. దీంతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగేలా ఉంది.

గతంలో బిలియనీర్ జార్జ్ సోరోస్ నిధులు సమకూర్చిన ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ (OCCRP)... ఇద్దరు విదేశీ పెట్టుబడిదారుల ద్వారా అదానీ గ్రూప్‌లో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపించింది. అదానీ గ్రూప్ వాటిని పాత ఆరోపణలు గానే అభివర్ణించింది. విదేశీ మీడియాలో కొందరు ఉద్దేశపూర్వకంగా హిండెన్ బర్గ్ తో కుమ్మక్కై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శలు చేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఆధారాలు అడగడంతో ఈ వ్యవహారం సంచలనం రేపుతోంది.
కేవలం హిండెన్ బర్గ్ నివేదికపై ఆధారపడి మేం చర్యలు తీసుకుంటే మన దర్యాప్తు సంస్ధలు ఏం చేస్తాయంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అదే సమయంలో సెబీ తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా విదేశీ నివేదికల ద్వారా భారతీయ విధానాలను ప్రభావితం చేసే కొత్త ట్రెండ్ లా ఇది కనిపిస్తోందని కోర్టుకు తెలిపారు. దీనిపై మరింత సమాచారం కోసం ఓసీసీఆర్పీని సంప్రదించినట్లు వెల్లడించారు.












Click it and Unblock the Notifications