సుప్రీం ఆలస్యానికి దేశం చెల్లిస్తున్న మూల్యం..! రెండేళ్లుగా జరిగింది ఇదీ..?
వంద మంది దోషులు తప్పించుకున్నా ఫర్వాలేదు.. ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదన్నది మన న్యాయవ్యవస్థ సిద్దాంతం. అందుకు అనుగుణంగానే పని చేస్తున్న దేశ అత్యున్న న్యాయస్దానం సుప్రీంకోర్టు.. ఓ కీలక కేసు విచారణ విషయంలో చేస్తున్న ఆలస్యానికి దేశం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్న చర్చ న్యాయనిపుణుల నుంచీ సాధారణ ప్రజల వరకూ జరుగుతోంది. ముఖ్యంగా ఇవాళ ఢిల్లీ, ముంబైలో సీఈసీ రాజీనామా డిమాండ్ తో జరుగుతున్న ఆందోళనలు, మరోవైపు బెంగాల్, బీహార్, యూపీ, కర్నాటక, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో బయడపడుతున్న ఎస్ఐఆర్ అక్రమాలకూ ఇదే ప్రధాన కారణంగా మారిపోతోంది.
ఎన్నికల కమిషనర్ల నియామక చట్టం
భారతదేశంలో ఎన్నికల కమిషనర్ల నియామకాల విషయంలో అప్పటి వరకకూ ఉన్న చట్టాన్ని సవరించి 2023లో కేంద్రం పార్లమెంట్ లో కొత్త చట్టం తెచ్చింది. దీంతో ఎన్నికల కమిషనర్ల నియామక కమిటీలో ఉన్న ప్రధాని, విపక్ష నేతతో పాటు ఉన్న సుప్రీం ఛీఫ్ జస్టిస్ స్ధానంలో ప్రధాని సూచించే మంత్రి వచ్చి చేరారు. దీంతో ప్రధాని మోడీ, ఆయన సిఫార్సు చేసిన మంత్రి అమిత్ షా, విపక్ష నేత రాహుల్ గాంధీ ఈ కమిటీలోకి వచ్చారు. ఈ కమిటీ కమిషనర్లను నియమించేటప్పుడు మెజార్టీ సూత్రం ఆధారంగా మోడీ-షాలు ఎంపిక చేసిన జ్ఞానేష్ కుమార్ సీఈసీగానూ, వివేక్ జోషీ, సుఖ్ బీర్ సింగ్ సంధూ కమిషనర్లుగానూ నియమితులయ్యారు. వీరి హయాంలోనే ప్రస్తుతం ఎస్ఐఆర్ వివాదంతో పాటు ఇతర వివాదాలూ మొదలయ్యాయి.

సుప్రీం విచారణ ఆలస్యం (Supreme Court)
2023 మార్చిలో సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక అనూప్ బరన్వాల్ తీర్పు ప్రకారం ప్రధానమంత్రి, లోక్‌సభ ప్రతిపక్ష నేత, భారత ప్రధాన న్యాయమూర్తిలతో కూడిన కమిటీ ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేయాలని ఆదేశించింది. అయితే పార్లమెంటు దీని స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ కొత్త కమిటీ నుంచి సీజేఐని తొలగించి, ఆయన స్థానంలో ప్రధాని సూచించిన ఒక కేంద్ర మంత్రిని చేర్చారు. దీనివల్ల కమిటీలో ప్రభుత్వానికి పూర్తి ఆధిక్యం లభిస్తుందని, ఇది స్వతంత్ర ఎన్నికల సంఘం మనుగడనే దెబ్బతీస్తుందని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేత డాక్టర్ జయ ఠాకూర్, ఏడీఆర్ సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. కానీ ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇప్పటివరకూ విచారణ జరపకుండా ఆలస్యం చేస్తోంది. దీంతో ఇదే వివాదాస్పద చట్టం కింద పలు కీలక నియామకాలు కూడా జరిగిపోయాయి. తాజాగా మరోసారి ఇవే పిటిషన్లు విచారణకు రాగా రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగించారు. మరోవైపు సీఈసీ జ్ఞానేష్ కుమార్ వివాదాల నేపథ్యంలో ఆయన సస్పెన్షన్ కు దాఖలైన పిటిషన్లనూ సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అయితే ఆయన తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలపై విచారణ చేస్తామని మాత్రం తెలిపింది.

అమల్లోకి చట్టం-కీలక పరిణామాలు
2024 ప్రారంభంలో ఈ చట్టం అమలుపై స్టే ఇచ్చేందుకు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాల బెంచ్ నిరాకరించింది. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో మధ్యంతర ఆదేశాలు ఇస్తే తీవ్ర గందరగోళం ఏర్పడుతుందని కోర్టు భావించింది. ఆ తర్వాత కేవలం కొద్ది గంటల వ్యవధిలోనే సెర్చ్ కమిటీ సుమారు 200 మంది అభ్యర్థుల నుంచి కేవలం ఆరుగురిని మాత్రమే షార్ట్‌లిస్ట్ చేయడాన్ని కోర్టు ఆక్షేపించింది. అయినప్పటికీ, నియామకాలు ఆపకపోవడంతో జ్ఞానేష్ కుమార్, సుఖ్‌బీర్ సింగ్ సంధూ ఎన్నికల కమిషనర్లుగా నియమితులయ్యారు. అనంతరం, రాజీవ్ కుమార్ పదవీ విరమణ తర్వాత జ్ఞానేష్ కుమారే దేశ కొత్త ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ఈ కేసు విచారణ జస్టిస్ సూర్యకాంత్ బెంచ్‌కు బదిలీ అయింది. అక్కడ పదికి పైగా వాయిదాల పాటు విచారణ సాగలేదు. చివరకు జస్టిస్ దీపాంకర్ దత్తా బెంచ్ విచారణ జరపగా, తాజాగా భిన్నాభిప్రాయాలతో కూడిన తీర్పు వచ్చింది. నియామక కమిటీలో ఇద్దరు అధికార పక్ష సభ్యులు ఉంటే ప్రభుత్వానికి పూర్తి వీటో అధికారం దక్కుతుందని జస్టిస్ దత్తా ఆందోళన వ్యక్తం చేయగా, జస్టిస్ ఎస్.సి.శర్మ విభేదించారు. ఈ వివాదం ఇప్పుడు రాజ్యాంగ బెంచ్‌కు చేరడంతో, ఎన్నికల సంఘం స్వతంత్రతపై తుది నిర్ణయం ఎప్పుడు వస్తుందనేది సందిగ్ధంలో పడింది.












Click it and Unblock the Notifications
