ఆధార్ తో ఓటర్ ఐడీ లింక్-నేడు తేల్చనున్న సుప్రీంకోర్టు-ప్రధాన అభ్యంతరాలివే..
ఆధార్ కార్డును ఓటర్ ఐడీతో లింక్ చేస్తూ గతేడాది పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ చేపట్టబోతోంది. కేంద్రం తీసుకొచ్చిన చట్టంతో పౌరుల గోప్యత హక్కుకు భంగం కలుగుతోందని కాంగ్రెస్ ఎంపీ రణ్ దీప్ సూర్జేవాలా దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరపబోతోంది.
ఆధార్‌తో ఓటర్ గుర్తింపు కార్డును అనుసంధానం చేస్తూ కేంద్రం తెచ్చిన వివాదాస్పద చట్టంపై అప్పట్లోనే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయితే వీటిని పట్టించుకోకుండా కేంద్రం చట్టాన్ని ఆమోదించింది. పార్లమెంటులో తమకున్న మెజారిటీతో కేంద్రం దాన్ని నెగ్గించుకున్నా అభ్యంతరాల నేపథ్యంలో సుప్రింకోర్టు ఈ వ్యవహారంపై విచారణ జరిపేందుకు పిటిషన్ ను స్వీకరించింది.
కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ గత శీతాకాల సమావేశాల్లో 24 గంటల వ్యధిలోనే ఆమోదింపజేసుకున్న ఈ చట్టంలో రాజ్యాంగ విరుద్ధమైన అంశాలున్నాయని పిటిషనర్ అయిన కాంగ్రెస్ ఎంపీ రణదీప్ సూర్జేవాలా ఆరోపిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ప్రజల గోప్యత, సమానత్వపు హక్కుల ఉల్లంఘన జరుగుతోందని పిటిషన్‌లో ఆయన పేర్కొన్నారు.

గతేడాది కేంద్రం ఆమోదించిన ఎన్నికల చట్టాల సవరణ బిల్లు ఎన్నికల అధికారులకు గుర్తింపు కోసం ఓటర్లుగా నమోదు చేసుకోవాలనుకునే వ్యక్తుల ఆధార్ నంబర్‌ను కోరేందుకు అనుమతిస్తుంది. అదే సమయంలో ఆధార్‌తో ఓటర్ ఐడీ అనుసంధానం కారణంగా మన దేశ పౌరులు కాని వారికి కూడా ఓటు హక్కు లభిస్తుందనే ఆందోళనలు కూడా ఉన్నాయి. ఎన్నికల సంస్కరణల్లో భాగంగా ఎన్నికల సంఘం ఆగస్ట్ 1వ తేదీ నుంచి ఆధార్‌ను ఎన్నికల సమాచారంతో అనుసంధానం చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.
దీని ఉద్దేశం ఎన్నికల జాబితాలో పేర్లు రిపీట్ కాకుండా, తప్పులు దొర్లకుండా చేయడమేనని కేంద్రం చెబుతోంది. కానీ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం.. వ్యక్తిగత గోప్యతకు సంబంధించి ఆధార్, ఓటర్ ఐడీ లింకింగ్ ఆప్షన్ మాత్రమే కానీ తప్పనిసరి కాదు. దీంతో సుప్రీంకోర్టు ఇప్పుడు ఏం చెబ్బబోతోందన్నది కీలకంగా మారింది.












Click it and Unblock the Notifications