అలా మాట్లాడుతుంటే పడిపడి నవ్వారు: పాకిస్తాన్ దమ్ముదులిపిన సుష్మా
ఐక్య రాజ్య సమితి వేదికగా పాకిస్తాన్ పైన విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ నిప్పులు చెరిగారు. భారత్ ఐటీ రంగంలో, పాకిస్తాన్ ఉగ్రవాద రంగంలో దూసుకెళ్తున్నాయని ఎద్దేవా చేశారు.
న్యూఢిల్లీ: ఐక్య రాజ్య సమితి వేదికగా పాకిస్తాన్ పైన విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ నిప్పులు చెరిగారు. భారత్ ఐటీ రంగంలో, పాకిస్తాన్ ఉగ్రవాద రంగంలో దూసుకెళ్తున్నాయని ఎద్దేవా చేశారు.
పీవోకే, బెలూచ్‌లలో పాకిస్తాన్ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందన్నారు. ఆ దేశానికి గట్టిగా బుద్ది చెప్పాలన్నారు. పాక్‌కు వినాశకాలం దాపురించిందన్నారు.

ఎవరు అభివృద్ధి చెందుతున్నారో అందరికీ తెలుసు
అరాచకాలను ప్రోత్సహిస్తూ, పాకిస్తాన్ ఉగ్రవాదుల కర్మాగారంగా మారిందని సుష్మా విరుచుకుపడ్డారు. నిత్యం ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాక్ వైఖరి సరికాదన్నారు. ఒకేసారి స్వాతంత్ర్యం సాధించిన భారత్, పాకిస్తాన్ దేశాల్లో ఎవరు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నారో అందరికీ తెలుసునన్నారు.

అప్పుడు ప్రపంచం మరింత సురక్షితమవుతుంది
ఉగ్రవాదులకు నిలయంగా మారిన పాక్, భారత్ సహా ఎన్నో దేశాలను అస్థిరపరిచే కుట్ర, ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. తమ దేశానికి భయపడి జమ్ము కాశ్మీర్ ప్రజలను భారత్ అణిచివేస్తోందని పాక్ ప్రధాని అబ్బాసీ చేసిన వ్యాఖ్యలను ఆమె తిప్పికొట్టారు. భారత్‌పై పాక్ నిత్యం యుద్ధానికి దిగుతోందన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషించడంపై దృష్టి పెట్టిందని, అందులో కొంతైనా అభివృద్ధిపై పెట్టి ఉంటే ప్రపంచం మరింత సురక్షితమవుతుందన్నారు.

పాక్ ప్రధానిపై ఆగ్రహం
భారత్ పేదరికంతో పోరాడుతుంటే, పాకిస్థాన్ మాత్రం మాతో పోరాడుతోందని సుష్మా మండిపడ్డారు. రెండు రోజుల క్రితం పాక్ ప్రధాని షాహిద్ ఖాఖన్ అబ్బాసీ ఇదే వేదిక మీద మాపై అనేక ఆరోపణలు చేశారని మండిపడ్డారు. భారత్ పైన విమర్శలతో ఆయన సమయం వృథా చేశారన్నారు. సమయానుకూలంగా మరిచిపోతున్నట్టు నటిస్తుండడం పాకిస్తాన్ నాయకులకు అలవాటేనని అన్నారు. కాశ్మీర్ సమస్యపై పాత ఐరాస తీర్మానాన్ని ప్రస్తావించిన పాక్ ప్రధాని సిమ్లా ఒప్పందం, లాహోర్ ప్రకటనలను మరిచిపోతున్నారు. వీటి ఆధారంగానే సమస్యలను ద్వైపాక్షికంగా చర్చించుకోవాలన్నారు.

ఆ మాటలు విని నవ్వుకున్నారు
తాము తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నామని పాక్ ప్రధాని ఆరోపించారని సుష్మా స్వరాజ్ మండిపడ్డారు. ఆయన మాట్లాడుతున్న సమయంలో వినేవారంతా ఆశ్చర్యపోయారని, నవ్వుకున్నారన్నారు. పాక్ ప్రధాని మాటలకు జనాలు పడిపడి నవ్వుకున్నారన్నారు. హక్కుల ఉల్లంఘనకు యథేచ్ఛగా పాల్పడుతూ అనేకమంది ప్రజల ప్రాణాలను తీస్తున్నది పాకిస్తానే అన్నారు.

మాకు పాఠాలు చెబుతారా
ఇక్కడ నిలబడి తమకు మానవత్వం గురించి మానవ హక్కుల గురించి పాఠాలు చెబుతున్నారని సుష్మా అన్నారు. లాహోర్ డిక్లరేషన్ వంటి అంతర్జాతీయ ఒప్పందాలకు పాకిస్తాన్ తూట్లు పొడుస్తోందన్నారు. ఐరాసలో భారత రాయబారి ఈనామ్ గంగూలీ పాక్ వైఖరిని ఎండగట్టిన మరుసటి రోజే సుష్మా దుమ్ముదులిపారు.












Click it and Unblock the Notifications