పాంబన్ బ్రిడ్జి మీదుగా ప్రయాణించే మొట్టమొదటి ఎక్స్‌ప్రెస్- హాల్ట్ స్టేషన్లు ఇవే..
New Pamban Bridge: ఏప్రిల్ 6వ తేదీన శ్రీరామనవమి. అయోధ్యలోని రామ్ లల్లా ఆలయం మొదలుకుని దేశవ్యాప్తంగా అన్ని దేవస్థానాలు భక్తులతో కిటకిటలాడుతుంటాయి. తెలంగాణలో భద్రాచలం, ఏపీలో ఒంటిమిట్ట ఆలయంలో ఏటేటా అంగరంగ వైభవంగా రామనవమి ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
శ్రీరామనవమిని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడులో పర్యటించనున్నారు. రామేశ్వరానికి వెళ్లనున్నారాయన. చారిత్రాత్మక రామనాథస్వామివారి ఆలయాన్ని సందర్శించనున్నారు. రామనాథుడి సేవలో పాల్గొననున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.

అనంతరం పాంబన్ బ్రిడ్జిని జాతికి అంకితం ఇవ్వనున్నారు మోదీ. 2019లో ఆయనే ఈ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఆ మరుసటి ఏడాదిలో నిర్మాణ పనులు ఆరంభం అయ్యాయి. ఈ క్రమంలో పాంబన్ బ్రిడ్జి పునర్నిర్మించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అత్యాధునికంగా దీన్ని తీర్చిదిద్దారు.
పాంబన్ బ్రిడ్జి పొడవు 2.07 కిలోమీటర్లు. దేశంలో నిర్మితమైన మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ సీ బ్రిడ్జి ఇదే. వర్టికల్ లిఫ్ట్ ఎత్తు 72 మీటర్లు. 17 మీటర్ల ఎత్తు ఉన్న నౌకలు దీని కింది నుంచి రాకపోకలు సాగించగలవు. అంటే- నౌకలు వచ్చినప్పుడు వర్టికల్‌గా ఈ బ్రిడ్జిని పైకి లిఫ్ట్ చేస్తారు. అదే దీని ప్రత్యేకత.
గత ఏడాది నవంబర్‌లో వంతెన రైల్వే సేఫ్టీ కమిషనర్ ఈ వంతెన సామర్థ్యాన్ని పరీక్షించింది. రైళ్ల రాకపోకలకు అనుమతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ వంతెన అందుబాటులోకి రావడం వల్ల రామేశ్వరానికి రైల్ కనెక్టివిటీ పెరుగుతుంది. పర్యాటకం అభివృద్ధి చెందుతుంది. ఫలితంగా స్థానిక వ్యాపారాలు పురోగమిస్తాయి.
కాగా- ఈ బ్రిడ్జి ప్రారంభం అనంతరం తాంబరం- రామేశ్వరం ఎక్స్‌ప్రెస్ మొట్టమొదటి సారిగా దీని మీదుగా రాకపోకలు సాగించనుంది. ఈ సాయంత్రం 6:10 నిమిషాలకు తాంబరం నుంచి బయలుదేరే నంబర్ 16103 ఎక్స్‌ప్రెస్.. మరుసటి రోజు తెల్లవారు జామున 5:40 నిమిషాలకు రామేశ్వరం చేరుకుంటుంది.
మళ్లీ సోమవారం సాయంత్రం రామేశ్వరం నుంచి బయలుదేరే నంబర్ 16104 ఎక్స్‌ప్రెస్.. ఆ మరుసటి రోజు తెల్లవారు జామున 3:45 నిమిషాలకు తాంబరం స్టేషన్‌కు చేరుకుంటుంది. చెంగల్పట్టు, విల్లుపురం, తిరుప్పదిపులియూర్, చిదంబరం, మైలాడుథురై, తిరువారూర్, తిరుత్తురైపూండి, పట్టుకోట్టై, అరంథంగి, కారైకుడి, శివగంగ, మనమధురై, పరమక్కుడి, రామనాథపురం మీదుగా ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది.
చెన్నై, మధురై, వారణాసి, బెంగళూరు, సికింద్రాబాద్ వంటి దేశంలోని ఇతర ప్రధాన నగరాలు, అన్ని రైల్వే జోన్ల పరిధిలోని ప్రధాన పట్టణాల నుంచి రామేశ్వరానికి అనుసంధానం చేస్తూ మరిన్ని రైలు సర్వీసులు ప్రవేశపెట్టే అవకాశాలు లేకపోలేదు.












Click it and Unblock the Notifications