తమిళనాడు గవర్నర్ కు స్టాలిన్ షాక్- ఆ 10 బిల్లుల్ని మళ్లీ ఆమోదించిన అసెంబ్లీ...
తమిళనాడులో డీఎంకే ప్రభుత్వానికీ, గవర్నర్ ఆర్ఎన్ రవికీ మధ్య సాగుతున్న పోరు ఇవాళ మరో మలుపు తిరిగింది. ఇప్పటికే తమిళనాడు అసెంబ్లీ ఆమోదించి పంపిన 10 బిల్లుల్ని ఆమోదించకుండా కాలయాపన చేసిన గవర్నర్ ఆర్ఎన్ రవి తాజాగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంతో వాటిని వెనక్కి పంపారు. దీంతో ఇవాళ అసెంబ్లీలో స్టాలిన్ సర్కార్ మరోసారి వాటిని ఆమోదిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో మరోసారి ఆ 10 బిల్లులు గవర్నర్ వద్దకు వెళ్లనున్నాయి.
తమిళనాడు గవర్నర్ గతంలో తాము పంపిన 10 బిల్లుల్ని ఆమోదించకుండా వెనక్కి పంపడంతో వాటిని మరోసారి ఆమోదించేందుకు అసెంబ్లీ ఇవాళ ప్రత్యేకంగా సమావేశమైంది. ఇందులో సీఎం ఎంకే స్టాలిన్ గవర్నర్ వెనక్కి పంపిన బిల్లుల్ని తిరిగి ఆమోదం కోసం పెట్టారు. దీంతో అసెంబ్లీ వాటిని ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది. విపక్ష అన్నాడీఎంకే, బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రం అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.

ఈ బిల్లుల్లో న్యాయం, వ్యవసాయం, ఉన్నత విద్య సహా వివిధ శాఖలకు సంబంధించినవి ఉన్నాయి. వీటిని గవర్నర్ వెనక్కి పంపిన నేపథ్యంలో తిరిగి అసెంబ్లీ ఇవాళ మరోసారి ఆమోదించింది. అసెంబ్లీలో సీఎం ఎంకే స్టాలిన్ మాట్లాడుతూ.. ప్రజలతో ఎన్నికైన ప్రజాప్రతినిధులతో కూడిన అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలపడం గవర్నర్ విధి అన్నారు. ఆయనకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే ప్రభుత్వానికి తెలియజేయవచ్చని సూచించారు.
గతంలో కొన్ని బిల్లుల గురించి గవర్నర్ ప్రశ్నలు లేవనెత్తినప్పుడు ప్రభుత్వం వెంటనే స్పందించిందని స్టాలిన్ గుర్తుచేశారు. గవర్నర్‌ను కోరిన వాటికి ప్రభుత్వం వివరణ ఇవ్వని సందర్భం ఎప్పుడూ లేదన్నారు. 10 బిల్లులకు గవర్నరు అనుమతి నిలుపుదల చేయడం తమిళనాడు ప్రజలను అవమానించడమే అన్నారు. తమిళనాడు అసెంబ్లీని అవమానించడమే తప్ప మరొకటి కాదన్నారు. గవర్నర్ ప్రజలకు, ప్రజాస్వామ్యానికి, చట్టానికి, మనస్సాక్షికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications