తమిళనాడులో నిరుద్యోగులకు భారీ ఊరట- విజయ్ సర్కార్ కీలక నిర్ణయం..!
తమిళనాడులో (Tamil Nadu ) ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు విజయ్ సర్కార్ ఇవాళ గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ల ఆలస్యం కారణంగా వయో పరిమితి దాటిపోతున్న నిరుద్యోగులకు ఊరట లభించేలా ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం రాష్ట్రంలోని వివిధ కేటగిరీల నిరుద్యోగులకు పోటీ పరీక్షలకు వయో పరిమితి పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో నిరుద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
రాష్ట్రంలో పోటీ పరీక్షలకు హాజరవుతున్న నిరుద్యోగుల నుంచి వస్తున్న డిమాండ్ల మేరకు వయో పరిమితిని ఐదేళ్ల పాటు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది ఇప్పటికే బీసీ, బీసీ(ముస్లిం), ఎంబీసీ, డీఎన్సీ, ఎస్సీ, ఎస్టీ, వితంతు కేటగిరీల వారికి ఇచ్చిన మినహాయింపుకు అదనమని ప్రభుత్వం తెలిపింది. గ్రూప్ 1 పోస్టులకు జనరల్ కేటగిరీ అభ్యర్ధులకు 32 ఏళ్ల నుంచి 37 ఏళ్లకు వయో పరిమితి పెంచారు. ఇతర రిజర్వుడు కేటగిరీలకు 37 ఏళ్ల నుంచి 42 ఏళ్ళకు వయోపరిమితి పెంచారు. జనరల్ కేటగిరీలో దివ్యాంగులకు 42 ఏళ్ల నుంచి 47 ఏళ్లు, ఇతర కేటగిరీల్లో దివ్యాంగులకు 47 ఏళ్ల నుంచి 52 ఏళ్లకు వయో పరిమితి పెరిగింది.

గ్రూప్ 2, గ్రూప్ 2ఏ పోస్టులకు జనరల్ కేటగిరీకి 30 నుంచి 35 ఏళ్లు, ఇతర కేటగిరీలకు 40 నుంచి 45 ఏళ్లకు వయోపరిమితి పెంచారు. ఇతర కేటగిరీలకు, అలాగే గ్రూప్ 4 పోస్టులకు పోటీపడే వితంతువులకు వయో పరిమితి పూర్తిగా ఎత్తేశారు. అలాగే గరిష్ట విద్యార్హతలు లేని రిజర్వుడు కేటగిరీల అభ్యర్ధులకు 32 ఏళ్ల నుంచి 37 ఏళ్లకు వయో పరిమితి పెంచారు. ఇందులో గ్రూప్ 4 పోస్టులకు మాత్రం ఎస్సీ, ఎస్టీలకు, వితంతువులకు మాత్రం 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచారు. అలాగే గరిష్ట విద్యార్హతలు లేని దివ్యాంగులకు రిజర్వుడు కేటగిరీల్లో 42 ఏళ్ల నుంచి 47 ఏళ్లకు పెంచారు. ఎస్సీ, ఎస్టీలు, వితంతువుల్లో దివ్యాంగులకు 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఉత్తర్వులు తక్షణం అమల్లోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది. ఇవాళ్టి నుంచి ఐదేళ్ల పాటు ఇవి అమల్లో ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నిర్ణయంతో వేల మంది నిరుద్యోగ యువతకు ప్రయోజనం కలగబోతోంది.














Click it and Unblock the Notifications
