"చెన్నైలో సుప్రీంకోర్టు బెంచ్.."-ప్రధాని మోడీకి విజయ్ కీలక డిమాండ్..!
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో ఉత్తరాదికీ, దక్షిణాదికీ మధ్య గ్యాప్ పెరుగుతుందన్న ఆరోపణలు ఇప్పటికే ఉన్నాయి. ముఖ్యంగా పార్లమెంట్, సుప్రీంకోర్టు, ఇతర సంస్థలన్నీ ఢిల్లీలో కేంద్రీకృతం చేసుకుంటే, దక్షిణాది రాష్ట్రాలకు అవి అందుబాటులో లేకుండా పోతున్నాయన్న ఆందోళన ఇక్కడి నేతల్లో కనిపిస్తుంటుంది. ఇదే క్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్.. (CM Vijay) ఇప్పుడు ఇలాంటిదే ఓ వాదనను తెరపైకి తెచ్చారు. ఈ మేరకు ప్రధాని మోడీ ముందు విజయ్ కీలక డిమాండ్ పెట్టారు.
సుప్రీంకోర్టు ఢిల్లీలో ఉండటం వల్ల దక్షిణాది రాష్ట్రాల నుంచి కక్షిదారులు ప్రతీసారీ హస్తినకు వెళ్లాల్సి రావడం ఇబ్బందిగా మారిందని సీఎం విజయ్.. ప్రధాని మోడీ దృష్టికి తెచ్చారు. కాబట్టి చెన్నైలో సుప్రీంకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ విజయ్ ప్రధాని మోదీకి ఓ లేఖ రాశారు. ఇది తమిళనాడు యొక్క దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్ అని ఇందులో గుర్తుచేశారు. దీన్ని మొదటిసారిగా 1980లో లేవనెత్తారని విజయ్ తన లేఖలో పేర్కొన్నారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 130ను ఈ సందర్భంగా ప్రధానికి రాసిన లేఖలో విజయ్ ప్రస్తావించారు. దక్షిణ భారతదేశంలోని వ్యాజ్యదారులు పరిష్కారం కోసం న్యూఢిల్లీకి ప్రయాణించవలసి వస్తోందని, చెన్నైలో బెంచ్ ఏర్పాటు చేయడం వల్ల అన్ని దక్షిణ రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరుతుందని విజయ్ తెలిపారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫార్సులు, లా కమిషన్ నివేదికలు , దేశ సమాఖ్య స్వరూపాన్ని ఉటంకిస్తూ, ఈ విషయంపై సుప్రీంకోర్టు తన వైఖరిని పునఃపరిశీలించేలా ప్రధానిని కోరాలని సీఎం విజయ్ ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు. దీనిపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.














Click it and Unblock the Notifications
