తెలంగాణపై దూకుడు: అధికారులత జివోఎం భేటీ
న్యూఢిల్లీ: తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం దూకుడు ప్రదర్సిస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర మంత్రుల బృందం (జివోఎం) సోమవారం వివిధ శాఖల అధికారులతో సమావేశమైంది. వివిధ శాఖల ఉన్నతాధికారులతో కేంద్ర మంత్రుల బృందం (జివోఎం) సభ్యులు విడివిడిగా చర్చలు జరిపారు. సోమవారం ఉదయం నుంచి 8 మంత్రిత్వ శాఖలకు చెందిన అధికారుల నుంచి వివరాలు సేకరించింది.
జలవనరులు, బొగ్గు, సహజ వాయువు, విద్యుత్తు, ప్రణాళికా సంఘం, విద్య, వైద్య, ఆరోగ్య శాఖల అధికారులతో మంత్రులు విస్తృతంగా చర్చలు జరిపారు. ఈ భేటీలో కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేతో పాటు జైరాం రమేష్, గులాం నబీ ఆజాద్ పాల్గొన్నారు. మరోసారి అధికారులతో జివోఎం ఈ నెల 14వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు సమావేశం కానుంది. మంత్రుల బృందం రైల్వే, న్యాయ, పాలనా సిబ్బంది, ఆర్థికపరమైన అంశాలపై కూడా చర్చించింది.

కాగా, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు జివోఎంకు నేతృత్వం వహిస్తున్న రక్షణ మంత్రి ఎకె ఆంటోనీని కలిశారు. జెడి శీలం, చిరంజీవి, దగ్గుబాటి పురంధేశ్వరి ఈ భేటీలో పాల్గొన్నారు. ఇదిలావుంటే, జివోఎంతో భేటీ అయ్యేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు, సెక్రటరీ జనరల్ కె. కేశవరావు హైదరాబాదు నుంచి ఢిల్లీకి బయలుదేరారు.
జీవోంఎ రెండు రోజుల పాటు రాష్ట్రానికి చెందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం కానుంది. కాంగ్రెసు నుంచి మంత్రి వట్టి వసంత కుమార్ (సీమాంధ్ర), ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ (తెలంగాణ) జివోఎం ముందు హాజరు కానున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, సిపిఐ జివోఎం ముందు హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నాయి. జివోఎంకు హాజరు కావాలా, వద్దా అనే విషయంపై నిర్ణయం తీసుకోవడానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సీనియర్ పార్టీ నాయకులతో చర్చలు జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications