ఢిల్లీలో టెన్షన్ టెన్షన్-రాహుల్ ఈడీ విచారణ-ఏఐసీసీ ఆఫీసుకు భారీగా నేతలు-పోలీసుల దిగ్బంధం
నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఈడీ సమన్ల నేపథ్యంలో ఇవాళ కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ ఈడీ ముందు విచారణకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో బల ప్రదర్శనకు రాహుల్ సిద్దమవుతున్నారు. కాంగ్రెస్ కు చెందిన సీఎంలు అశోక్ గెహ్లాట్, భూపేష్ భగేల్ ను ఏఐసీసీ కార్యాలయానికి పీలిపించారు. వీరితో పాటు కాంగ్రెస్ ముఖ్యనేతలంతా ఏఐసీసీ కార్యాలయానికి చేరుకున్నారు. వీరంతా రాహుల్ తో కలిసి ఈడీ కార్యాలయానికి సత్యాగ్రహ్ ర్యాలీ చేపట్టబోతు్న్నారు. దీంతో ఢిల్లీలో టెన్షన్ నెలకొంది.
కాంగ్రెస్ అధిష్టానం పిలుపుమేరకు వివిధ రాష్ట్రాల నుంచి కీలక నేతలంతా ఇవాళ ఏఐసీసీ కార్యలయానికి చేరుకుంటున్నారు. కాసేపట్లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా ఏఐసీసీ ఆఫీసుకు రానున్నారు.అక్కడి నుంచి వీరంతా ఈడీ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లాలని నిర్ణయించారు. దీంతో వీరిని అడ్డుకునేందుకు పోలిసులు భారీగా మోహరించారు. ఏఐసీసీ కార్యాలయం నుంచి ఈడీ ఆఫీసుకు వెళ్లే అన్ని దారుల్ని మూసేసి పోలీసులు భారీగా కాపలా కాస్తున్నారు. అంతేకాదు ఏఐసీసీ కార్యలయాన్ని సైతం పూర్తిగా దిగ్బంధించారు.

నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ సమన్లు పంపిన నేపథ్యంలో ఇవాళ విచారణకు హాజరు కాబోతున్న రాహుల్ గాంధీ.. కేంద్ర ప్రభుత్వం తనను ఉద్దేశపూర్వకంగా ఈడీతో టార్గెట్ చేయిస్తుందన్న అంశాన్ని ప్రజల్లోకి పంపేందుకు వ్రయత్నిస్తున్నారు. అందుకే దేశవ్యాప్తంగా ఇవాళ సత్యాగ్రహ్ ర్యాలీలకు పిలుపునిచ్చారు. అలాగే ఢిల్లీలోనూ ఏఐసీసీ కార్యాలయం నుంచి ర్యాలీ చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ భారీగా పోలీసులు మోహరించడంతో ఢిల్లీలో ఉద్రిక్త పరిస్ధితులు తప్పేలా లేవు.












Click it and Unblock the Notifications