ప్రధాని వచ్చి ఏం పొడిచేశారా ?, ఆయన ఏమైనా పెద్ద హీరోనా, నోటీసులు !
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన బీజేపీలో అంతర్గత కలహాలు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయి, బీజేపీ ఓటమికి బాధ్యులెవరు? జాతీయ నేతలా ?, కర్ణాటక రాష్ట్ర నేతలా ? అంటూ ప్రధానంగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి, ఈ సందర్బంలో బీజేపీకి చెందిన కొందరు నాయకులు సొంత పార్టీ నాయకుల మీద విమర్శలు కొనసాగిస్తున్నారు.
కర్ణాకలోని హొన్నాళి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శిగా పని చేసిన మాజీ మంత్రి ఎంపీ. రేణుకాచార్య ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు రేణేకాచార్యకు 74, 832 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి శాంతనగౌడ డి. జి. 92, 392 ఓట్లు రావడంతో రేణకాచార్య ఓడిపోయారు. అయితే తాను ఓడిపోయానని రేణుకాచార్య ఊరికే కూర్చోలేదు.

తన నియోజకవర్గంలో నేను అధికారంలో ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి పనుల గురించి రోజుకు పదుల సంఖ్యలో ఫేస్‌బుక్‌లో పోస్టులు పెడుతున్నారు. అలాంటి రేణుకాచార్య ఇప్పుడు బీజేపీ నేతల టార్గెట్‌గా మారారు. దానికి కారణం రేణుకాచార్య మాటలే. జాతీయ, రాష్ట్ర నేతలపై రేణుకాచార్య విరుచుకుపడటంతో బీజేపీ క్రమశిక్షణ సంఘం ఆయనకు నోటీసులిచ్చింది.
రేణుకాచార్యకు బీజేపీ హైకమాండ్ నోటీసు ఇవ్వడం ఇప్పుడు కర్ణాటకలో హాట్ టాపిక్ అయ్యింది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్, మాజీ మంత్రి డాక్టర్ కే. సుధాకర్, కర్ణాటక ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా ఉన్న తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కే. అన్నామలై,తో పాటుపలువురు నేతలను విమర్శించినందుకు రేణుకాచార్యకు బీజేపీ క్రమశిక్షణా సంఘం నోటీసు జారీ చేసి 7 రోజుల్లో సమాధానం ఇవ్వాలని సూచించింది.

జాతీయ నాయకులపై, పార్టీకి వ్యతిరేకంగా మీరు చేస్తున్న ప్రకటనలకు 7 రోజుల్లోగా సమాధానం చెప్పండి. లేకుంటే మీపై చర్యలు తీసుకుంటామని ఎంపీ రేణుకాచార్యకు బీజేపీ క్రమశిక్షణ సంఘం నోటీసులో నోటీసు జారీ చేసింది. దీని ద్వారా రాష్ట్ర నేతల మాటల యుద్ధానికి స్వస్తి పలకాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయించింది.
దావణగెరె, బెంగళూరులలో మీడియాతో మాట్లాడిన రేణుకాచార్య సొంత పార్టీ నేతలకు వ్యతిరేకంగా ప్రకటనలు చేశారు. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పను ఎన్నికలకు దూరంగా పెట్టడం వలనే కర్ణాటకలో బీజేపీ అధికారానికి దూరం అయ్యిందని రేణుకాచార్య ఆరోపించారు. ఇదే సమయంలో బీజేపీ నాయకుల మీద రేణుకాచార్య విరుచుకుపడ్డారు.
కనీసం గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలవని వారు మాకు ఉచిత సలహాలు ఇస్తున్ననారని, మాకు గుణపాఠం చెబుతారన్నారని, తమిళనాడు నుంచి వచ్చిన అన్నామలై మమ్మల్ని ముందుకు నడిపించాలని ప్రయత్నించారని, అన్నామలై ఏమైనా పెద్ద హీరోనా?, కర్ణాటకలో బీజేపీని గెలిపించే సత్తా అన్నామలైకి ఉందా అంటూ మాజీ మంత్రి రేణుకాచార్య విరుచుకుపడ్డారు.

మీరు ప్రధాని నరేంద్ర మోదీని కర్ణాటకకు పిలిపించి ఎన్నికల ప్రచారానికి వీధి వీధిలో తిరిగారు, కర్ణాటక రాష్ట్ర నేతలపై మీరు ఎందుకు నమ్మకం పెట్టుకోలేదు?. ఆయనూరులో జరిగే మహాసభలకు 25 వేల మందిని చేర్చుకోవాలని చెప్పారు, ఎన్నికల్లో ఓడిపోయిన మంత్రి డాక్టర్ సుధాకర్ ఇంటికి మాజీ సీఎం బసవరాజ్ బొమ్మయ్ వెళ్లి ఓదార్చడం విడ్డూరంగా ఉందని రేణుకాచార్య ఆరోపించారు.
సుధాకర్ ఒక్కడే ఓడిపోయాడా?, మనం కూడా ఓడిపోయాము, మా ఇంటికి బసవరాజ్ బోమ్మయ్ ఎందుకు రాలేదని రేణుకాచార్య ప్రశ్నించారు. అన్నభాగ్య యోజన బియ్యాన్ని ఎందుకు తగ్గించారు?, ఎన్నికల హామీలేమిటి?. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను ఎవరితో తయారు చేశారు?, పనికిరాని మేనిఫేస్టో తయారు చెయ్యడం వలనే బీజేపీ ఓడిపోయిందని రేణుకాచార్య నిరసన వ్యక్తం చేశారు.
బీజేపీ అభ్యర్థులను తిప్పితిప్పి క్లైమాక్స్ లో టిక్కెట్లు ఇచ్చారు. ఆ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తమ అభిప్రాయం చెప్పేందుకు అవకాశం ఇవ్వలేదని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిపై గౌరవం ఉందని. ఆయన రాష్ట్రంలో పర్యటించారని, అయితే అది ఓటుగా మారలేదని, ఎన్నికల్లో ఓటమి తర్వాత నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాల్సి ఉందని మాజీ మంత్రి రేణుకాచార్య అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ దెబ్బకు బీజేపీ హైకమాండ్ నుంచి రేణుకాచార్యకు నోటీసులు జారీ అయ్యాయి.












Click it and Unblock the Notifications