The IndiGo Paradox: పరాకాష్టకు ఇండిగో అరాచకాలు..! ఓవైపు వందల ఫ్లైట్లు రద్దుచేస్తూ....!
దేశంలో అతిపెద్ద ప్రైవేటు ఎయిర్ లైన్స్ సంస్థ ఇండిగోలో తలెత్తిన సంక్షోభం ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు. గత వారం రోజులుగా ఇండిగో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కుంటూనే ఉన్నారు. రెండు రోజులుగా అయితే రోజూ వందలాది విమానాలు రద్దవుతూనే ఉన్నాయి. అయినా ఇండిగో మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. దీంతో మధ్యలో ప్రయాణికులు నలిగిపోతున్నారు. ఇండిగో అరాచకాలు పరాకాష్టకు చేరుతున్నా కేంద్రం చేష్టలుడిగి చూస్తోంది.
ఇండిగోలో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా మూడు రోజులుగా భారీ ఎత్తున విమాన సర్వీసులు రద్దవుతున్నాయి. దీనిపై పౌర విమానయానశాఖ డైరెక్టర్ జనరల్ (డీజీసీఏ)తో పాటు కేంద్రం కూడా జోక్యం చేసుకున్నా ఫలితం లేకుండా పోతోంది. ఇండిగో సంక్షోభం కారణంగా వందలాది విమానాలు రద్దవుతుండటంతో అప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు నరకం కనిపిస్తోంది. ముఖ్యంగా ఎయిర్ పోర్టులో లగేజీ దగ్గరి నుంచి వసతి, రవాణా వరకు వారికి ఇబ్బందులు తప్పడం లేదు. అయినా ఇండిగో మాత్రం ప్రకటనలతోనే సరిపెడుతోంది.

మరోవైపు ఇండిగో చర్యలు పరాకాష్టకు చేరుకున్నాయి. ఓవైపు నిత్యం వందలాది విమానాలు రద్దు చేస్తున్న ఇండిగో ఎయిర్ లైన్స్ రాబోయే రోజులకు టికెట్ల బుకింగ్ ను మాత్రం కొనసాగిస్తూనే ఉంది. దీంతో ఆయా టికెట్లు బుక్ చేసుకున్న వారితో పాటు ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న వారికి కూడా నరకం కనిపిస్తోంది. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు వారి లగేజ్ ను సకాలంలో అందించడం, టికెట్ల డబ్బులు వెనక్కి ఇవ్వడం, ఎయిర్ పోర్టులకు వచ్చిన ప్రయాణికులకు తాత్కాలిక వసతి ఏర్పాట్లు చేయడం ఇండిగో వల్ల కావడం లేదు.

ఇంత జరుగుతున్నా ఇండిగో ఎయిర్ లైన్స్ విమాన టికెట్ల బుకింగ్స్ మాత్రం ఆపడం లేదు. ఇప్పటికీ దేశవ్యాప్తంగా ఇండిగో టికెట్ల బుకింగ్ మాత్రం కొనసాగుతూనే ఉంది. ఓవైపు కేంద్రం రెండు రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుందని చెబుతున్నా, స్వయంగా ఇండిగో మాత్రం ఈ నెల 10-15 తేదీల వరకూ ఈ సమస్య కొనసాగే అవకాశం ఉందని సమాచారం ఇచ్చింది. పైకి మాత్రం ఈ రాత్రి కల్లా సమస్య పరిష్కారం అవుతుందని ప్రతీ రోజూ చెబుతూనే ఉంది. దీంతో టికెట్లు అమ్ముకునేందుకు మాత్రమే ఇలా పైకి నటిస్తూ డబ్బులు సంపాదించుకుంటోందని సోషల్ మీడియాలో ప్రయాణికులు, వారి బంధువులు ఇండిగోను ఏకేస్తున్నారు.












Click it and Unblock the Notifications