Supreme Court: సీనియర్ సిటిజన్లకు షాకిచ్చిన సుప్రీం కోర్టు.. ఇక వారికి రాయితీ లేనట్టేనా..!
సీనియర్ సిటిజన్లకు రైల్వే టిక్కెట్లపై రాయితీని మళ్లీ ప్రవేశపెట్టాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. కొవిడ్ లాక్‌డౌన్‌కు ముందు, IRCTC 60 సంవత్సరాల పైబడిన వయస్సు గల మగ సీనియర్ సిటిజన్‌లకు, 58 సంవత్సరాల పైబడిన వయస్సు గల మహిళా సీనియర్ సిటిజన్‌లకు ఛార్జీలలో రాయితీని ఇచ్చేవారు. ఈ రాయితీలు రాజధాని ఎక్స్‌ప్రెస్, శతాబ్ది ఎక్స్‌ప్రెస్, దురంతో ఎక్స్‌ప్రెస్, ఇతర వాటితో సహా అన్ని రైళ్లకు చెల్లుబాటు అయ్యేవి.
కరోనా సమయంలో సీనియర్ సిటిజన్ల రాయితీని రైల్వే శాఖ ఎత్తేసింది. నిలిపివేసిన రాయితీలను పునరుద్ధరించాలని ఎంకే బాలకృష్ణన్ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తులు ఎస్‌కె కౌల్, అహ్సానుద్దీన్ అమానుల్లాతో కూడిన ధర్మాసనం తిరస్కరించింది. "రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద ఒక పిటిషన్‌లో మాండమస్ రిట్ జారీ చేయడం ఈ కోర్టుకు సరైనది కాదు. సీనియర్ సిటిజన్ల అవసరాలు, ఆర్థిక పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ సమస్యపై నిర్ణయం తీసుకోవాలని" అని ధర్మాసనం శుక్రవారం పేర్కొంది.

అయితే సీనియర్ సిటిజన్ రాయితీని భారతీయ రైల్వేలు త్వరలో పునరుద్ధరించవచ్చని ఈ సంవత్సరం ప్రారంభంలో రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతీయ రైల్వేలు 2019-20లో ప్రయాణీకుల టిక్కెట్లపై రూ. 59,837 కోట్ల విలువైన సబ్సిడీలను ఇచ్చాయి. ఇది ప్రయాణిస్తున్న ప్రతి వ్యక్తికి సగటున 53% రాయితీని అందజేస్తుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో రాజ్యసభలో తెలిపారు. కనీసం స్లీపర్, 3 ఏసీలలో సీనియర్ సిటిజన్లకు రాయితీని సమీక్షించి.. పరిశీలించాలని రైల్వే స్టాండింగ్ కమిటీ సూచించింది.
భారతీయ రైల్వే ఇప్పటికీ దివ్యాంగులు (విభిన్న వికలాంగులు), విద్యార్థులు, రోగుల వంటి అనేక వర్గాలకు ఈ సబ్సిడీ అందిస్తోంది. గతంలో మోడీ ప్రభుత్వం ఫోర్గో సీనియర్ సిటిజన్ కన్సెషన్ ఆప్షన్‌ను ప్రవేశపెట్టింది. దేశాభివృద్ధికి సహకరించాలనుకునే వ్యక్తులు రాయితీ అంశం లేకుండా తమ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది.












Click it and Unblock the Notifications