ఆ ఇద్దరు మహిళల ఎంట్రీ పక్కా ప్లానా?.. శబరిమల దర్శనంలో కొత్త కోణం
Recommended Video

కేరళ : ఇద్దరు మహిళల అయ్యప్ప ఆలయ దర్శనం వెనుక ఎన్నో అనుమానాలు. మరెన్నో కథనాలు. వెరసి కొత్త కొత్త కోణాలు బయటపడుతున్నాయి. పక్కా ప్లాన్ ప్రకారమే ఈ దర్శనభాగ్యానికి తెర తీశారా? తెల్లవారుజామున ఆలయ ప్రవేశం హడావిడిగా ఎందుకు జరిగినట్లు. భక్తజన సందోహం తక్కువగా ఉన్న సమయంలో ఆ ఇద్దరికి ఎంట్రీ ఇవ్వడమేంటి? ఇలాంటి ప్రశ్నలకు దొరుకుతున్న సమాధానాలు వింతగా ఉన్నాయి.
బుధవారం తెల్లవారుజామున శబరిమల అయ్యప్ప సన్నిధిలోకి మహిళలు ప్రవేశించడం వివాదస్పదమైంది. అయితే వీరిద్దరు ఆలయంలోకి రావడం వెనుక అసలేం జరిగిందనేది చర్చానీయాంశమైంది. ఎంతోమంది మహిళలు అయ్యప్ప దర్శనానికి వచ్చినా.. భక్తులు అడ్డుకోవడంతో పంబ నుంచే వెనుదిరిగిపోయిన ఘటనలున్నాయి. మరి ఆ ఇద్దరికి ఆలయ ప్రవేశం అంతా సులువుగా ఎలా లభించిందనేది ట్విస్ట్.

ఆ ఇద్దరికి ఎంట్రీ అంత సులువా?
50 ఏళ్ల లోపు వయసున్న మహిళలు అయ్యప్ప ఆలయంలోనికి ప్రవేశించడం నిషేధం. దానికి బ్రేక్ వేస్తూ గతేడాది సెప్టెంబర్ 28న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో..
ఎంతోమంది మహిళలు శబరిమల ఆలయానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే అడుగడుగునా అయ్యప్ప భక్తులు అడ్డుకుంటున్నారు. అలాంటిది బుధవారం తెల్లవారుజామున 3 గంటల 45 నిమిషాలకు 40 ఏళ్ల లోపు వయసున్న ఇద్దరు మహిళలు అయ్యప్ప సన్నిధికి చేరుకోవడం వివాదస్పదమైంది. అసలు ఆ ఇద్దరిని లోపలికి ఎలా పంపించారు? భక్తులెవరూ అడ్డుకోలేదా? లాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

అలా వచ్చారా..? అందుకేనా సాఫీగా దర్శనం..!
బిందు, కనకదుర్గ అనే మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించడం పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందనే అనుమానాలున్నాయి. ట్రాన్స్‌జెండర్ల మాదిరిగా నటించి అయ్యప్ప సన్నిధికి చేరుకున్నారనే వాదనలు జోరందుకున్నాయి. వీరికి పోలీసులు కూడా భారీ భద్రత కల్పించారు. భక్తులు ఎవరూ అడ్డుపడకుండా హడావిడిగా ఆలయంలోకి తీసుకువెళ్లినట్లుగా తెలుస్తోంది. ఆ సమయంలో బయటకు వచ్చిన వీడియోల్లో కూడా ఇదే విషయం బోధపడుతుంది.

అదేనా స్ఫూర్తి.. అందుకేనా ఈవిధంగా..!
గతేడాది డిసెంబర్ 16వ తేదీన అయ్యప్ప దర్శనానికి వచ్చిన నలుగురు ట్రాన్స్‌జెండర్లను పోలీసులు అడ్డుకోవడంతో ఆందోళనకు దిగారు. చివరకు ఆలయ ప్రధాన అర్చకులతో మాట్లాడి ట్రాన్స్‌జెండర్లకు దర్శనభాగ్యం కల్పించారు. బుధవారం నాడు ఆలయంలోకి ప్రవేశించిన ఇద్దరు మహిళలు డిసెంబర్ 24వ తేదీన అయ్యప్ప దర్శనానికి ప్రయత్నించి విఫలమయ్యారు. పంబ దగ్గర భక్తులు అడ్డుకోవడంతో వెనుదిరిగారు. అయితే ట్రాన్స్‌జెండర్లకు దర్శనభాగ్యం కలగడంతో అదే దారి వీరు ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. ఆవిధంగా ట్రాన్స్‌జెండర్ల ముసుగులో అయ్యప్ప సన్నిధిలోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. అయితే ఇది వారి ఐడియానా? లేదంటే దీని వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అన్నది మాత్రం తేలలేదు.












Click it and Unblock the Notifications