చెరువులో వేలకొద్దీ "ఆధార్" కార్డులు.. అసలు పశ్చిమ బెంగాల్‌లో ఏం జరుగుతోంది ??
పశ్చిమ బెంగాల్‌లో మరో సంచలన ఘటన చోటు చేసుకుంది. పూర్బస్థలీ ఉత్తర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఒక చెరువులో వేల సంఖ్యలో ఆధార్ కార్డులు బయటపడడం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమం జరుగుతున్న తరుణంలో.. ఈ తరహా ఘటన వెలుగులోకి రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారం పట్ల పొలిటికల్ గా కూడా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
అసలు ఏం జరిగిందంటే..
కాగా స్థానికంగా ఉన్న చెరువులో ఆధార్ కార్డులు తేలియాడుతూ ఉండడం గమనించిన గ్రామస్తులు అధికారులకు సమాచారం అందించారు. ఈ క్రమంలోనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. అయితే పరిశీలనలో వేల సంఖ్యలో కార్డులు నిజమైనవేనని తేలింది. ఈ ఘటన వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయా? లేదా వ్యక్తిగత డేటా దుర్వినియోగం జరుగుతోందా? అన్నదానిపై తీవ్ర చర్చ నడుస్తోంది.

ఇదే సమయంలో బీజేపీ ఈ సంఘటనపై తీవ్రంగా స్పందించింది. అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. దేశ అంతర్గత భద్రతను పణంగా పెట్టే విధంగా టీఎంసీ పాలన కొనసాగుతోందని మండిపడింది. చొరబాటుదారులకు పశ్చిమ బెంగాల్ సురక్షిత స్థావరంగా మారిందని బీజేపీ నేతలు ఆరోపించారు. ఓటరు జాబితా మార్పిడి కుట్రలో భాగంగా ఈ రకంగా వ్యవహరించారని అభివర్ణించారు. ఈ ఆధార్ కార్డులు ఎవరివి? అవి చెరువులోకి ఎలా చేరాయి? వాటి వెనుక ఎవరు ఉన్నారు? అన్న అంశాలపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన సాదారణ నిర్లక్ష్యం కాదని, దాని వెనుక పెద్ద కుట్ర ఉందని వారు అనుమానం వ్యక్తం చేశారు.
మరోవైపు అధికార టీఎంసీ మాత్రం.. ఈ ఘటనకు బీజేపీ అవసరం లేకుండా రాజకీయ రంగు పులుముతోందని విమర్శించింది. ఎన్నికల ముందు వాతావరణం మసకబార్చడమే బీజేపీ లక్ష్యమని టీఎంసీ నాయకులు పేర్కొన్నారు. కానీ ఆధార్ కార్డులు వేల సంఖ్యలో ఇలా లభ్యమవ్వడం పట్ల ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఈ ఘటన రాబోయే ఎన్నికల దిశలో కీలక మలుపుగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications