ఒక జ్యోతిష్యుడికి ఓఎస్డీ పదవి ఎందుకు? విజయ్ కు కాంగ్రెస్ ఎంపీ సూటిప్రశ్న!
తమిళనాడు రాజకీయాల్లో సంచలన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నటుడు నుంచి రాజకీయ నాయకుడిగా మారిన విజయ్ తన వ్యక్తిగత జ్యోతిష్యుడైన పండిట్ వెట్రివేల్‌ను ముఖ్యమంత్రి కార్యాలయంలో స్పెషల్ డ్యూటీ అధికారి (OSD)గా నియమించడం రాజకీయంగా చర్చకు కారణం కాగా, ఈ అసాధారణ నియామకంపై కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతుంది. విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలు వరుసగా మిత్రపక్షం అయిన కాంగ్రెస్ ను షాక్ కు గురి చేస్తున్నాయి.
విజయ్ నిర్ణయాలపై అసహనంలో కాంగ్రెస్
విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నాటి నుండి తీసుకుంటున్న నిర్ణయాలు పెను సంచలనాలు నమోదు చేస్తున్నాయి. ప్రమాణస్వీకారం సమయంలో ఆయన రాష్ట్ర గీతాన్ని అవమానించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇప్పుడు జ్యోతిష్యుడిని ఓఎస్డీగా నియమించుకోవటం పై కాంగ్రెస్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తుంది.

రాజకీయాల్లో జ్యోతిష్యానికి చోటు లేదని విమర్శలు
పండిట్ వెట్రివేల్ గత చాలా సంవత్సరాలుగా విజయ్‌కు వ్యక్తిగత జ్యోతిష్యుడిగా సేవలందిస్తున్నారు. ఇప్పుడు అతన్ని సీఎం కార్యాలయంలో ముఖ్య స్థానంలో నియమించడం రాజకీయ వర్గాల్లో విమర్శలకు దారితీసింది. కాంగ్రెస్ నాయకులు ఈ నియామకాన్ని విమర్శిస్తున్నారు. రాజకీయాల్లో జ్యోతిష్యానికి చోటు లేదని, ప్రజా సమస్యలు, అభివృద్ధి, పాలనపై దృష్టి పెట్టాల్సిన సమయంలో ఇలాంటి నిర్ణయాలు సరికాదని వారు అభిప్రాయపడ్డారు.
జ్యోతిష్యుడికి ఓఎస్డీ పదవి ఎందుకు అవసరం
ఈ నియామకం రాజకీయాలను మతపరమైన మరియు అంధవిశ్వాసాల వైపు మళ్లిస్తుందని కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేసింది. విజయ్ నిర్ణయంపై విస్మయం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ ఎంపీ శశికాంత్ సెంథిల్ ఎక్స్ (ట్విట్టర్)లో ''నాకు అర్థం కావడం లేదు. ఒక జ్యోతిష్యుడికి ఓఎస్డీ పదవి ఎందుకు అవసరం?? ఎవరైనా వివరించగలరా?" అని ఆయన ప్రశ్నించారు. మరోవైపు, విజయ్ అనుచరులు మాత్రం ఈ నిర్ణయాన్ని సమర్థించారు.
తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర చర్చ
జ్యోతిష్యం ఒక శాస్త్రమని, ముఖ్యమంత్రి కార్యాలయంలో మంచి సలహాదారులు ఉండటం ఎల్లప్పుడూ మంచిదని వారు వాదించారు. వెట్రివేల్ అనుభవం మరియు నైపుణ్యం రాష్ట్ర పాలనకు ఉపయోగపడతాయని వారు అంటున్నారు . ఈ సంఘటన తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర చర్చలకు దారితీసింది. ప్రతిపక్షాలు ఈ నియామకాన్ని ప్రశ్నిస్తూ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.













Click it and Unblock the Notifications