సాధ్వీ నిరంజన్ జ్యోతి గొడవ: విపక్షాల రాజీ ఫార్ములా
న్యూఢిల్లీ: కేంద్ర సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి వ్యాఖ్యలపై కొనసాగుతున్న పార్లమెంటు స్తంభనకు స్వస్తి చెప్పేందుకు ప్రతిపక్షాలు రాజీ ఫార్ములాతో ముందుకు వచ్చినట్లు సమాచారం. నిరంజన్ జ్యోతి చేసిన వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటులో తీవ్రంగా పట్టారు. నిరంజన్ జ్యోతి క్షమాపణ చెప్పినందున ఆ విషయాన్ని వదిలేయాలని మోడీ చేసిన విజ్ఞప్తితో ప్రతిపక్షాలు సంతృప్తి చెందలేదు.
జ్యోతిని మంత్రివర్గం నుంచి తొలగించాల్సిందేనని పట్టుబడుతూ పార్లమెంటు కార్యక్రమాలను ప్రతిపక్షాలు స్తంభింపజేస్తున్నాయి. ఈ వ్యవహారంతో కేంద్ర ప్రభుత్వం చిక్కుల్లో పడింది. తగిన బలం లేని రాజ్యసభలో ప్రభుత్వం మరింతగా సమస్యను ఎదుర్కుంటోంది. ఈ స్థితిలో ప్రతిపక్షాలు ఓ రాజీ ఫార్ములాను ముందుకు తెచ్చినట్లు సమాచారం.

పేరును చేర్చకుండా నిరంజన్ జ్యోతి వ్యాఖ్యలను ఖండిస్తూ సభ ఏకగ్రీవ తీర్మానం చేయాలనే రాజీ ఫార్ములాతో ప్రతిపక్షాలు ముందుకు వచ్చాయి. అయితే, గతంలో సోనియా గాంధీ నరేంద్ర మోడీపై చేసిన వ్యాఖ్యతో సహా ఇతర నేతలు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను కూడా తీర్మానంలో చేర్చాలని ప్రభుత్వం అడుగుతోంది.
కాగా, ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి నిరంజన్ జ్యోతిని పంపించకూడదని బిజెపి నాయకత్వం నిర్ణయించుకుంది. సోమవారం నుంచి రాజ్యసభలో కార్యక్రమాలు స్తంభిస్తూ వస్తున్నాయి. క్షమాపణ చెప్పారంటే తప్పు చేసినట్లేనని, ఆ రకంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని, ఇక మంత్రిగా ఆమె ఎలా కొనసాగుతారని సిపిఎం నేత సీతారాం ఏచూరి అన్నారు.
తాను చేసిన వ్యాఖ్యలకు నిరంజన్ జ్యోతి మంగళవారంనాడు క్షమాపణ చెప్పారు. రాముడి సంతానానికి చెందిన ప్రభుత్వం కావాలో, అక్రమ సంతానం ప్రభుత్వం కావాలో ఢిల్లీ ప్రజలు తేల్చుకోవాలని సాధ్వీ నిరంజన్ జ్యోతి ఆదివారంనాడు ఢిల్లీ ఎన్నికల ప్రచార సభలో అన్నారు.












Click it and Unblock the Notifications