ఎర్ర బంగారం: నిద్రహారాలు మాని టొమాటో పంటకు కాపలా
బెంగళూరు: మార్కెట్‌లో టొమాటో ధర ఆకాశానికి ఎగబాకింది. రోజులు గడుస్తున్నా వాటి రేట్లు నేలకు దిగిరావట్లేదు. ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు. టొమాటో.. బంగారం ధరను తలపిస్తోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా కేజీ టొమాటో.. మార్కెట్‌లో 160 నుంచి 180 రూపాయల వరకు పలుకుతోంది.
ఇదే టొమాటో ధర.. గతంలో రైతులను కంటతడి పెట్టించిన ఉదంతాలు లేకపోలేదు. టొమాటో విక్రయాల వల్ల కనీసం ఆటో ఛార్జీలు కూడా దక్కట్లేదనే కారణంతో వాటిని రోడ్ల పక్కన పడేసి వెళ్లిన సందర్భాలు చాలా ఉన్నాయి. చేతికి అందిన పంటను దుక్కి దున్నిన రోజులూ చాలానే ఉన్నాయి. ఇప్పుడు కిలో టొమాటో మీద ఎంత లేదన్నా రైతులు 150 రూపాయల వరకు లాభాలను అందుకుంటోన్నారు.

మార్కెట్లో బౌన్సర్లను పెట్టి టొమాటోలను విక్రయించే పరిస్థితి ఏర్పడిందిప్పుడు. ధర భారీగా పెరిగినందు వల్ల ఏపీ ప్రభుత్వం టొమాటోలపై రాయితీని ప్రకటించింది. రైతుల వద్ద భారీ మొత్తంతో టొమాటోలను కొనుగోలు చేసి, కేజీ 50 రూపాయల చొప్పున రైతు బజార్లల్లో విక్రయిస్తోంది. ఈ పరిణామం అటు రైతులు, ఇటు కొనుగోలుదారులకు ఊరటనిస్తోంది.
టొమాటోలకు భారీ రేటు పలుకుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పంటను కాపాడుకోవడానికి రైతులు ప్రాధాన్యత ఇస్తోన్నారు. ఈ క్రమంలో వారు నిద్రాహారాలను మానివేస్తోన్నారు. చేతికి అందిన పంట దొంగల బారిన పడే ప్రమాదం లేదనే భయాందోళనలు రైతాంగాన్ని చుట్టుముట్టాయి. దీనితో వారు కంటి మీద కునుకు లేకుండా పంటను కాపాడుకుంటోన్నారు.

ఏపీ- కర్ణాటక సరిహద్దుల్లోని కోలార్ జిల్లాలోని ఓ గ్రామంలో రాత్రివేళ రైతులు టోమాటో పంటకు కాపలా ఉంటోన్నారు. టార్చ్‌లైట్‌తో పహారా కాస్తోన్నారు. పంట ఏపుగా పెరిగిన నేపథ్యంలో- దొంగలు పడి ఎక్కడ వాటిని చోరీ చేస్తారోననే భయం రైతులను ఆవహించింది. దీనితో తెల్ల వారేంత వరకూ వంతులవారీగా పంటను కంటికి రెప్పలా చూసుకుంటోన్నారు. తమ కష్టం దొంగలపాలు కాకూడదంటూ కాపలా కాస్తోన్నారు.












Click it and Unblock the Notifications