పట్టాలెక్కనున్న మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, నగరాల మధ్య రాకపోకలు సాగిస్తోన్న అత్యాధునిక వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ల సంఖ్య ఇక మరింత పెరగనుంది. ప్రయాణికుల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోన్న నేపథ్యంలో ఆ సర్వీసులను ప్రయాణికులకు మరింత చేరువ చేయనుంది. ఏపీ-తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల్లో రాకపోకలు సాగిస్తోన్న ఈ రైళ్లకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటివరకు 10 రైళ్లు పట్టాలెక్కాయి.
తాజాగా మరో వందే భారత్ రైలును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. చెన్నై-కోయంబత్తూరు మధ్య దీన్ని నడిపించనుంది. ఏప్రిల్ 8వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పచ్చజెండా ఊపి ఈ రైలును ప్రారంభించనున్నారు. వందే భారత్ సిరీస్ లో ఇది 11వ ఎక్స్ ప్రెస్ అవుతుంది. గురువారం ట్రయల్ రన్ ఆరంభం కానుంది. దీనికోసం దక్షిణ రైల్వే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే ఈ రైలు చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ కు చేరుకుంది. సాంకేతికంగా అన్నింటినీ పరీక్షించారు.

గురువారం తెల్లవారు జామున 5:40 నిమిషాలకు చెన్నై సెంట్రల్ నుంచి కోయంబత్తూరుకు బయలుదేరుతుంది ఈ ఎక్స్‌ప్రెస్. ఉదయం 11:40 నిమిషాలకు కోయంబత్తూరుకు చేరుకుంటుంది. మార్గమధ్యలో జోలార్‌పేట్, సేలం, ఈరోడ్, తిరుప్పూర్ లల్లో మాత్రమే ఈ ఎక్స్‌ప్రెస్ కు హాల్ట్ సౌకర్యాన్ని కల్పించినట్లు దక్షిణ రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ రైలు వల్ల ప్రయాణికులకు చెన్నై-కోయంబత్తూరు మధ్య ఆరు గంటల్లో రాకపోకలు సాగించే వెసలుబాటు లభించినట్టవుతుందని చెప్పారు.
ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం- ఇప్పటికే కీలక నిర్ణయాన్ని తీసుకుంది. వాటి సంఖ్యను పెంచనుంది. ఈ మేరకు రైల్వే బోర్డుకు ప్రతిపాదనలను పంపించాలని ఆదేశించింది. ఇందులో భాగంగానే అన్ని రైల్వే జోన్లలోనూ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ల సంఖ్యను పెంచుతోంది కేంద్రం. చివరిగా ముంబై- సాయినగర్ షిర్డీ, ముంబై-షోలాపూర్ మధ్య ఈ రైళ్లు పట్టాలెక్కిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీ ఈ రెండు రైళ్లకు పచ్చజెండా ఊపి ప్రారంభించారు.
16 బోగీలు ఉండే ఈ సెమీ హైస్పీడ్ రైలు సీట్ల సామర్థ్యం 1,128. గరిష్ఠ వేగం గంటకు 160 కిలోమీటర్లు. శతాబ్దితో సమానంగా పరుగులు తీయగలదీ రైలు. ఆటోమేటిక్ డోర్ సిస్టమ్, జీపీఎస్ ఆధారిత ఆడియో-విజువల్ పాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, హాట్‌స్పాట్ వైఫై కనెక్షన్, ఎగ్జిక్యూటివ్ క్లాస్ రొటేటింగ్ ఛైర్స్ ఇందులో అందుబాటులో ఉంటాయి. ప్రతి బోగీకీ నాలుగు అత్యవసర ద్వారాలను అమర్చారు. సీసీ కెమెరాల నిఘా ఉంటుంది.












Click it and Unblock the Notifications