కరోనాతో టీఎంసీ అభ్యర్థి మృతి.. ఎన్నికల సంఘంపై మర్డర్ కేసు పెట్టిన మృతుడి భార్య...
తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి సిన్హా మూడు రోజుల క్రితం కరోనాతో మృతి చెందిన సంగతి తెలిసిందే. కరోనా సోకిన రెండు రోజులకే ఆయన కన్నుమూశారు. కాజల్ సిన్హా మృతికి ఎన్నికల సంఘానిదే బాధ్యత అని ఆయన సతీమణి నందిత సిన్హా ఆరోపిస్తున్నారు. ఓవైపు దేశమంతా కరోనా సెకండ్ వేవ్‌తో అల్లాడుతుంటే... బెంగాల్‌లో 8 విడతల్లో పోలింగ్ నిర్వహించి ప్రజల ప్రాణాలతో ఎన్నికల సంఘం చెలగాటమాడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భర్త చావుకు ఎన్నికల సంఘమే కారణమని ఆరోపిస్తూ హత్య కేసు ఫైల్ చేశారు.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సుదీప్ జైన్ నిర్లక్ష్యానికి తన భర్తతో పాటు పలువురు అభ్యర్థులు కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారని నందిత సిన్హా ఆరోపించారు. తమిళనాడు,పుదుచ్చేరి,కేరళ రాష్ట్రాల్లో ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారని... అసోంలో మూడు విడతల్లో నిర్వహించారని... ఒక్క బెంగాల్‌లో 8 విడతల్లో ఎన్నికలు నిర్వహించడమేంటని ప్రశ్నించారు. కరోనా ఉధృతి రీత్యా ఎన్నికల విడతలను కుదించాలని ఈ నెల 16,20 తేదీల్లో తృణమూల్ కాంగ్రెస్ చేసిన విజ్ఞప్తులను ఈసీ పట్టించుకోలేదన్నారు.

రాత్రి 7 గంటల తర్వాత ప్రచారాన్ని నిషేధించడం,సైలెంట్ పీరియడ్‌ను 24 గంటల నుంచి 72గంటలకు పొడగించడం వంటి చర్యలు కరోనా కట్టడి విషయంలో వట్టి భ్రమలు మాత్రమేనని విమర్శించారు. కోల్‌కతా హైకోర్టు హెచ్చరించినప్పటికీ.. రాబోయే విపత్తును ఈసీ అన్ని విధాలుగా ఉద్దేశపూర్వకంగా విస్మరించిందన్నారు.
ఎన్నికల సంఘం తీరుపై ఎన్నికలు ముగిశాక సుప్రీం కోర్టును ఆశ్రయిస్తానని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచార కార్యక్రమాల కంటే ఎక్కువ తాను కరోనా సమీక్షా సమావేశాలే నిర్వహిస్తున్నానని తెలిపారు.
కాగా,బెంగాల్‌కు చెందిన కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో రెండోసారి కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఆయన టోలీగంజ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చేస్తున్నారు. గడిచిన 24 గంటల్లో బెంగాల్‌లో 16,403 మంది కరోనా బారినపడగా మరో 73 మంది మృతి చెందారు. కరోనా మహమ్మారితో ఇప్పటివరకూ రాష్ట్రంలో నమోదైన కేసుల్లో ఇవే అత్యధికం.












Click it and Unblock the Notifications